మింటికేగిన ఇంటి వైద్యుడు!
ఆయన పిలిస్తే పలికే వైద్యుడు. పిలవకున్నా ఇంటి ముందుకొచ్చే ఇంటి వైద్యుడు. అంతా బాగేనా? అంటూ నవ్వుతూ, అప్యాయంగా పలకరించే ప్రతి ఇంటికి పెద్దకొడుకు. గూడూరే కాదు ఆ చుట్టుముట్టు గ్రామాలు, తండాల ప్రజలకు సుపరిచితుడు. అత్యంత ప్రజాదరణ గల ప్రజా వైద్యుడు. అతడే డాక్టర్ వైట్ల లక్ష్మీపతి.
ప్రజా వైద్యుడిపై ప్రముఖ రచయిత పాలడుగు రత్నాకర్ రావు రాసిన ప్రత్యేక వ్యాసం ఇంటి వైద్యుడు ఇక లేడు!
ఇంటి వైద్యుడు ఇక లేడు!
మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు. మా ఊళ్ళో నా బాల్యం ముందుగా చూసింది గృహవైద్యుడు డాక్టర్ వైట్ల లక్ష్మీ పతినే. మారుతున్న కాలంలో ఎన్నో మార్పుల్ని చవి చూసినా.. సరిగ్గా పదిహేను రోజుల కిందటె ఊర్లో వైద్య కుటుంబపు వారసుడుగా మిగిలిన ఆ వ్యక్తిని నేను పలకరించాను. పరస్పరం ఆరోగ్య సమాచారాలని పంచుకోకుండా ఉండలేక పోయాం. నిన్నటి దాకా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పలకరించిన ఇండ్లు, పలకరించే వారే లేక బోసిపోయాయి. ఆయన మరణ దుర్వార్త విస్మయాన్నే కాకుండా, విషాదాన్ని కలిగించింది. మోపెడ్ పై మెడికల్ కిట్ బ్యాగు పెట్టుకుని ప్రతి రోజు ఊరంతా కలియ తిరుగుతూ, నవ్వుతూ కనిపించే ఆయన, ఆయన పలకరింపులు ఇక మధుర జ్ఞాపకాలే!.
ఆయన్ని విస్మరించి, మా గ్రామం గూడూరును స్మరించుకోలేం. అర్థశతాబ్దిగా ఊరిలో ప్రజా వైద్యుడిగా ఆయన అడుగిడని గడపను చూడగలమా? ఇంత సుదీర్ఘకాలం గ్రామీణ వైద్యుడిగా సేవలు అందించిన మరోవ్యక్తి కనిపించ గలడా? కుటుంబ ఆర్థికస్థితుల నేపధ్యంలో చిన్నతనంలోనే బతుకుబాట పట్టక తప్పిందికాదు అతనికి. అననుకూల పరిస్థితులవల్ల బయట ప్రాంతంలో కంటే ఉన్న ఊరే నయం అనుకుని తిరిగి ఇల్లు చేరుకుని, తన పెద్దనాన్న దగ్గర ప్రాథమిక వైద్యాన్ని నేర్చుకుని క్రమ క్రమంగా ఉరకలేసే ఉత్సాహంతో ఇంటింటి వైద్యానికి తన సేవలు విస్తృతం చేయగలిగాడు లక్ష్మీపతి.
రోగ నిర్ధారణలో ఆయనది అందె వేసిన చెయ్యి. ప్రాబ్లం కచ్చితంగా వివరించేవాడు. జబ్బు తీవ్రతను బట్టి ఉన్నత స్థాయి వైద్యానికి రెఫెర్ చేసేవాడు. అనతి కాలంలోనే గ్రామీణ ప్రజా వైద్యుడిగా స్థిరపడిపోయి, యువజన రాజకీయల్లోనూ భాగస్వామ్యం అయ్యాడు. స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకున్నాడు. స్థానిక శివాలయ పునరుద్దరణలో అహర్నిశలు కృషి చేశాడు. పలు సామాజిక అంశాల్లో ముందున్నాడు. సమాచారం అందించడంలో, సేకరించడంలోనూ ఒక రకంగా చెప్పాలంటే ఊరికి చిరునామై నిలిచాడు.
డాక్టర్ వైట్ల లక్ష్మీపతిది వివాదాస్పదం తెలియని వ్యక్తిత్వం. అందరితో కలుపుకుపోయే మనస్తత్వం. బంధుత్వంలోను గట్టిగా పెనవేసుకున్న అనుబంధం ఆతనే. మూడుతరాల వారితో పెనవేసుకుని అల్లుకుపోయాడు. ఇలాంటి వ్యక్తులు అరుదే. క్రమక్రమంగా కనుమరుగౌతున్న తరం తమ అనుభవాల్ని, జ్ఞాపకాలన్నిటిని ఇలా వదిలేసి వెళ్లిపోతుంటే ఏర్పడే
శూన్యతని తట్టుకోలేం.
ఊరిలో లక్ష్మీపతి వైద్య గురువులు వైట్ల చంద్రం, వైట్ల బుచ్చిరాములు. రాజకీయ గురువులు చౌడవరం విశ్వనాధం, చుక్క రామయ్య. సహచర సన్నిహితులు పాలడుగు శేషగిరిరావు, కోడూరు జితేందర్ రెడ్డి. బంధువుల్లో వైట్ల శ్రీహరి, వైట్ల లోకనాధం, కళ్లెం సోమనరసయ్య… ఇలాంటి వారి సాన్నిత్యం తన భావి జీవితం ఎదుగు దలకు ఎంతగానో దోహదపడిందని చెప్పుకునేవాడు. నా మటుకు నాకు వ్యక్తిగతంగా ఆప్తుడు. ఊరిలో ఉన్నపుడు నా కుటుంబ వైద్యుడు. ఇక ముందు ఎపుడైనా ఊరికి వెళ్ళినపుడు అతను ఇక కనిపించడు అనుకునే క్షణాలను ఉహించ లేక పోతున్నాను నేను.
మరో వైపు 5 రోజుల వ్యవధిలోనే అతని చెల్లెలు దుస్స పుస్పలీల అకాల మరణం అత్యంత విషాదకరం.
బాధాతప్త హృదయంతో లక్ష్మీపతికి, వారి చెల్లెలు పుష్పలీల లకు అశ్రు నివాళులు అర్పిస్తూ…
✍ పాలడుగు రత్నాకర్ రావు, 8367657586