దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అయితే, రాష్ట్రంలో పల్లెలు ఎవరికీ పట్టని కొమ్మలుగా మిగిలిపోయాయి. ఒకవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విధించిన సెప్టెంబర్ 30 గడువు ముంచుకొస్తున్నది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నది. ఇంకోవైపు సర్పంచ్ లు లేని కారణంగా కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే గ్రాంట్లు, దానికి సమానంగా వచ్చే రాష్ట్ర సర్కార్ నిధులు కలిపి రూ.6వేల కోట్లు నిలిచిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్ర సర్కార్ నిధులేవీ లేకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఖర్చులు పెట్టలేక అప్పుల పాలవుతున్నామని కార్యదర్శులు మొత్తుకుంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన ప్రజారంజకంగా లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలంటున్న బిల్లుకు, రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదం లభించలేదు. అవి పొందేలా కూడా కనిపించడం లేదు. ఈలోగా రెండేళ్ల కాలం ఆవిరైంది. మరి ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అన్నది జవాబులేని ప్రశ్నలా మారింది.
‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ అందిస్తోన్న ‘సంకటంలో స్థానిక ఎన్నికలు!?’
స్థానిక సంస్థల ఎన్నికలు సంకట స్థితిలో పడ్డాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఒకవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విధించిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నది. ఇంకోవైపు సర్పంచ్ లు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే గ్రాంట్లు నిలిచిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, నిధులేవీ లేకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. చిల్లర ఖర్చులు చేయలేక అప్పుల పాలవుతున్నామని గ్రామ కార్యదర్శులు మొత్తుకుంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన ప్రజారంజకంగా లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలంటున్న రాష్ట్ర ప్రభుత్వం బిల్లుకు, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. పొందేలా కనిపించడం లేదు. మరి ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు అసలు ఎప్పుడు జరుగుతాయి? అన్నది జవాబులేని ప్రశ్నలా మారింది.
స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి రెండేండ్లు కావస్తున్నది. సర్పంచ్ ల పదవీ కాలం 2023 జనవరి 31తో ముగిసింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం 2023 మే నెలలోనే ముగిసింది. ఈ దశలో ఎన్నికలు ఆలస్యమవుతుండటం తో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలన ను ప్రవేశపెట్టింది. ఈ అంశంపై కొందరు కోర్టుకు వెళ్ళడంతో, 2023 జులైలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2025 జూన్‌లో హైకోర్టు మరింత స్పష్టంగా నిర్దేశిత ఆదేశాలిచ్చింది. 30 రోజుల్లో వోటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రకటన జరిపి, 60 రోజుల్లో పూర్తి ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహంచాలని ఆదేశించింది.
ఇందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిచాలని తలపోసింది. చట్టబద్ధత కోసం బిల్లు, ఆర్డినెన్స్, గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాలు అవసరం. కాబట్టి, మంత్రిమండలి ఆమోదించి, అసెంబ్లీలో చర్చించి, ఏకగ్రీవం చేసి, ఆ ప్రక్రియను చేపట్టింది. అయితే, గవర్నర్, రాష్ట్రపతిల ఆమోదం నేటికీ లభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీ జంతర మంతర్ లో ఒక రోజు దీక్షను చేపట్టింది. ఆ తర్వాత మరోసారి కేబినెట్ నిర్ణయం మేరకు, అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, స్థానిక సంస్థలకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్రానికి, గవర్నర్లకు మరోసారి పంపించింది. ఇది సాధ్యం కాపోతే, పార్టీ పరంగా బీసీలకు 42శాతం టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.
ఈ భావనలెలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కూడా జనాభాతోపాటు కుల గణనకు సిద్ధపడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి ఉంది. ఇదొక అవరోధంగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ముంచుకొస్తున్న సెప్టెంబర్ లోగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది తేలడం లేదు. ప్రభుత్వమూ చెప్పడంలేదు. ఆ మధ్య హై కోర్టు ఆదేశిత నిర్ణీత గడువులోగా ఎన్నికలు జరుపుతామని సీఎం చెప్పారు. కానీ దానిపైనా స్పష్టత కొరవడింది.
ఇక సర్పంచ్ ల ఎన్నికలు జరగని కారణంగా, కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా ఇచ్చే నిధులను నిలిపివేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కలుపుకుని 3వేల కోట్లకు పైగా నిధులు నిలిచి ఉన్నాయి. కేంద్ర గ్రాంట్ కు సమానంగా రాష్ట్ర గ్రాంటు అంటే మరో 3వేల కోట్లు కలిపి మొత్తం 6వేల కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా తిష్ట వేసి ఉన్నాయి. ఈ దశలో పంచాయతీ ఎన్నికల పంచాయితీ తమకు వద్దని నేతలు దూరం ఉంటున్నారు.
తాజాగా బీసీ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందడానికి, బీహార్ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. బీసీ రిజర్వేషన్లకు చట్టాలు సహా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ఇదే తరుణంలో అధికార కాంగ్రెస్ ప్రజా, ప్రజాస్వామిక ప్రయోజనాలకంటే, పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలు నెపాన్ని ఎదుటి పార్టీలమీద తోస్తూ తప్పించుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజలు, ప్రజాస్వామ్యం, స్థానిక సంస్థలు అపహాస్యం పాలవుతున్నాయి.