అక్షరాస్యత అంటే వ్యక్తి చదవగలగడం, రాయగలగడం, ప్రాథమిక లెక్కలలో చక్కగా వ్యవహరించగలగడం. కానీ ‘సంపూర్ణ అక్షరాస్యత’ అంటే కేవలం అక్షరాల పరిచయం మాత్రమే కాదు. అది వ్యక్తి చైతన్యం, సంఘంలో విజ్ఞానంతో పాల్గొనగల సామర్థ్యం, ప్రాథమిక విద్యను మించిన జీవిత నైపుణ్యాలు కలిగి ఉండటమని అర్థం.
భారతదేశం సహా అనేక రాష్ట్రాలు అక్షరాస్యతలో పురోగతిని సాధించినప్పటికీ, అది సంపూర్ణ స్థాయికి చేరలేకపోయింది. దేశంలో 2024 నాటికి అక్షరాస్యత రేటు 77శాతంగా ఉండగా, తెలంగాణలో 72శాతం పైనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, మహిళలలో, ఆదివాసీ గిరిజన సమాజాల్లో, అక్షరాస్యత స్థాయి చాలా తక్కువగా ఉంది.
ప్రతి ఏటా సెప్టెంబర్ 8వ తేదీని ’అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నవంబర్ 17, 1965లో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించగా, 1966 నుండి జరుపుకుంటున్నాం. ఉన్నతమైన జీవనానికి, విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం వెనుకబడి వున్నట్లే. అనేక రాష్టాల్రు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్నాయి. ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం.
దేశంలో సర్వ శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో – బేటీ పడావో వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. గతంలో వయోజన విద్యకు ప్రాధాన్య ఇచ్చేవారు. ఈ మధ్య అది కనిపించడం లేదు. ప్రతి ఒక్కరిని అక్షరాస్యులను చేయాలన్న సంకల్పం మేరకు గ్రామ స్థాయిలో సర్వేచేసి పిల్లలను బలవంతంగా స్కూళ్లకు చేర్చారు. అలాగే పనిప్రదేశాల్లో బాలకార్మికులను లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేవారు అవేవీ ఇప్పుడు పెద్దగా అమలు కావడం లేదు. పలు వైఫల్యాల కారణంగా అక్షరాస్యతను సాధించడంలో మనం విఫలం అవుతున్నాం.
ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నా, వాటి వినియోగం లోపిస్తున్నది. నిర్దిష్ట లక్ష్యాలు లేకపోవడం, మధ్యంతర సమీక్షలు, విశ్లేషణల కొరత, వ్యవస్థాపిత అవినీతి, పాఠశాలల నిర్మాణం నుంచి ఉపాధ్యాయ నియామకాల వరకు ప్రతిచోటా కనిపిస్తోంది. బడుల్లో బోధన జరిగే తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠ్యాంశాలు స్థానికత లోపించి. అర్థవంతంగా ఉండకపోవడం, ఉపాధ్యాయుల నైపుణ్యం లోపించడం, ఉపకరణాల కొరత వంటి ఆటంకాలు కనిపిస్తున్నాయి. పేద కుటుంబాల పిల్లలు ఇప్పటికీ పనులకే వెళ్ళిపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థలో చిక్కుకొని ఇంకా కొందరు చదువుకు దూరంగా ఉండే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గిరిజన, దళిత సమాజాలలో విద్యపై అవగాహన లేకపోవడమే కాక, ఆధునిక విద్యను ‘అవాంఛిత భారంగా’ భావించే ధోరణి కనిపిస్తోంది. విద్యా మాధ్యమం అంటే బోధనా భాష అడ్డంకిగా మారుతోంది. విద్యార్థులు మాతృభాషలో అయితేనే చదువుకోగలరు. సులువుగా అర్థం చేసుగలరు. బాలికల విద్యలో ఇంకా ఉన్న సామాజిక ఆంక్షలు, బాల్య వివాహాలు, భద్రతా భయాలు వంటి అంశాలు సంపూర్ణ అక్షరాస్యతను దూరంగా ఉంచుతున్నాయి. అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం ఒక సవాల్ గా నిలుస్తోంది.
భారతదేశంలో సర్వ శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో – బేటీ పడావో వంటి కార్యక్రమాలు ఉన్నా, అవి ప్రగతికి కారణమయ్యాయో, లేక ప్రజలకు మరొక సంక్షేమ పథకంగా మిగిలిపోయాయో అన్నది ప్రశ్నార్థకమే. అనేక పాఠశాలలు విద్యార్థుల లెక్కల కోసం ‘ఒకడినీ వదలొద్దు’ అన్న నినాదాన్ని మాత్రమే అనుసరిస్తున్నాయి, బోధనను గాలిక వదిలేస్తున్నాయి.
విద్యా వ్యవస్థను కేవలం పాఠశాల స్థాయిలో కాక, సామాజిక స్థాయిలోనూ ఆధునీకరించాలి. ఉపాధ్యాయుల శిక్షణ, పాఠ్యాంశాల్లో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం, భాషను విద్యార్థులకి అర్థమయ్యేలా మార్చడం అవసరం. సమాజం మొత్తంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రచారం జరగాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కావాలి. డిజిటల్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. డిజిటల్ విభజనను అధిగమించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యా పరికరాలు అందించాలి. బాలికల విద్య, గిరిజన సమాజాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. జాతీయ నూతన విద్యా – ఎన్ఇపి-2020 – విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.
ప్రపంచ నిరక్షరాస్యు ల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. ప్రధానగా విద్యారంగం పట్ట కేంద్ర, రాష్టాల్రు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ బడ్జెట్ కేటాయింపులను తగ్గించేస్తున్నాయి. జనాభాకు అనుగుణంగా విద్యారంగానికి నిధులు ఇవ్వాలి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యపై ప్రభుత్వ అజమాయిషీ కొరవడింది. దీంతో వాటి ఫీజులుం, దోపిడీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక పట్టాలకెక్కడం లేదు. ఏపీలో జగనన్న ‘విద్యా కానుక’ తప్ప స్కూళ్ల బలోపేతం జరగలేదు. ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్యకు బలమైన పునాదులు పడాలి. అలాగేకార్పోరేట్ దోపిడీని అరికటటాలి. అప్పుడే విద్యారంగం విస్తృతం కాగలదు. సామాన్యుడి నుంచి, రాజకీయనాయకుల, అధికారుల పిల్లలంతా ఒకే విద్యావిధానంలో చదవాలన్న ఆకాంక్ష అమలు కావడం లేదు. విద్యాభివృద్దిలో కులరహిత హాస్టళ్లు ఉండకూడదు. కామన్ ఎడ్యుకేషన్ అన్నది సమాజాంలో అంతరాలను తొలగిస్తుంది. చదువుకుంటే నిరుద్యోగిగా మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలోచదువుతు తగ్గ ఉపాధి దక్కేలా చేయాలి. చిత్తశుద్ధి ఉంటే తప్ప విద్యారంగాన్ని మార్చలేం. అందరికీ విద్య అన్నది ప్రాథమిక హక్కుగా ఉన్నా, ఆచరణలో సాధ్యం కావడంలేదు. దీనిని ఆచరణలోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటే తప్ప సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాదు.