India|భారతదేశంలో పెరుగుతున్న క్రెడిట్ కార్డులు|Credit Cards
పెరుగుతున్న రుణ సంక్షోభం
క్రెడిట్ కార్డు వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో రుణ డిఫాల్ట్‌లు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి. ప్రముఖ క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, బ్యాంకుల ద్వారా జారీ చేసిన క్రెడిట్ కార్డులపై బకాయిలు చెల్లించని వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 91 నుంచి 360 రోజుల వరకు చెల్లించని రుణాలు 2025 మార్చి నాటికి రూ.33,886 కోట్లకు పెరిగాయి. ఇది గతేడాది హోదాలో 44 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
అన్‌సెక్యూర్డ్ లోన్లు, అంటే పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాలు బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయని హెచ్చరించబడింది. గత ఏడాదితో పోలిస్తే 91-180 రోజుల చెల్లింపుల గడువు దాటి ఉన్న బకాయిలు రూ.29,983.6 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.20,872.6 కోట్లు మాత్రమే ఉండేది. పోర్ట్‌ఫోలియో ఎట్ రిస్క్ (PAR) సూచిక 2024లో 6.9 శాతంగా ఉండగా ప్రస్తుతం 8.2 శాతంకి పెరిగింది. 181-360 రోజుల దాటిన PAR కూడా 0.9 శాతం నుండి 1.1 శాతానికి చేరుకుంది.
భారత్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరిగిపోతోంది. డిజిటల్ సేవల విస్తరణ, ఫైనాన్షియల్ టెక్నాలజీ ఆవిష్కరణలు, జీవన ఖర్చుల పెరుగుదల వల్ల ఈ వృద్ధి చోటు చేసుకుంది. అయితే వినియోగదారుల డిఫాల్ట్‌లు పెరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు, ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ఆకర్షణలు వినియోగదారులను ఆదాయానికి మించి ఖర్చు చేయించేస్తున్నాయి. అంతేకాక లైఫ్‌స్టైల్ ద్రవ్యోల్బణం కారణంగా క్రెడిట్ కార్డులు ఒక స్టేటస్ సింబల్‌గా మారాయి. దీని వల్ల కొంతమంది ఎక్కువ ఖర్చు చేస్తూ అప్పుల ఊబిలో పడుతున్నారు.
ఈ సమస్యలో ఆర్థిక అవగాహన లోపం కూడా ఒక కీలక అంశం. చాలా మంది బిల్లింగ్ సైకిల్స్, లేట్ పేమెంట్స్, వడ్డీ లెక్కలపై సరైన అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వారు కాలపరిమితి దాటిన చెల్లింపులను చేసి మరింత వడ్డీ భారం మోస్తున్నారు.
ఇప్పటికే RBI క్రెడిట్ కార్డులపై రిస్క్ వెయిటేజీని పెంచింది. దీంతో బ్యాంకులు రుణాల రక్షణ కోసం ఎక్కువ మూలధనం కేటాయించాల్సి వస్తోంది. అన్‌సెక్యూర్డ్ లెండింగ్ వల్ల బ్యాంకులు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు రుణాల ఆమోద ప్రక్రియను మరింత కఠినంగా మార్చే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డులను ఉచిత డబ్బు వలె కాకుండా ఆర్థిక నియంత్రణ సాధనంగా భావించాలి. ప్రతి నెల బిల్లు మొత్తాన్ని సకాలంలో పూర్తిగా చెల్లించాలి. అంతేకాక క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చడానికి క్రమం తప్పకుండా చెల్లింపులు చేయాలి. బిల్లింగ్ చక్రాలు, ఈఎంఐలు, ఆఫర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకొని ఖర్చులను నియంత్రించాలి.
ఇలా అయితేనే పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పుల సంక్షోభం నుంచి బయటపడగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.