Hawai|హవాయి, Japan|జపాన్, China|చైనాలకు సునామీ హెచ్చరికలు
రాష్ట్రాలన్నీ భయాందోళనతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
రష్యాలోని తూర్పు ప్రాంతం కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం వల్ల సముద్రంలో విపరీతమైన అలలు ఏర్పడి సునామీగా మారాయి. దీంతో రష్యా తీర ప్రాంతాలతోపాటు, జపాన్, చైనా, అమెరికాకు చెందిన హవాయి రాష్ట్రంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. భారీ అలలు పలు ద్వీపాలను ముంచెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు సునామీ ముప్పు పొంచి ఉంది. రష్యా ప్రభుత్వం తక్షణమే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే కొన్ని దీవుల్లో వరదలు వచ్చాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా తీర ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇక జపాన్ తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. అక్కడి అధికార యంత్రాంగం సుమారు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది. సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న నివాసాలపై ముప్పు ఎక్కువగా ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు, చైనా తూర్పు తీరానికి కూడా ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. షాంఘైలోని 28 వేల మందిని ముందస్తుగా తక్షణమే తరలించారు. అంతేగాకుండా, సైక్లోన్ కూడా దూసుకొస్తుండటంతో జాతీయ స్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో తూర్పు చైనా అతలాకుతలమవుతోంది. ప్రయాణాలన్నీ నిలిచిపోయాయి. విమానాలు, బోటు సర్వీసులు రద్దయ్యాయి.
హవాయి రాష్ట్రంలో కూడా భూకంపం భారీ కలకలం రేపింది. అమెరికా వాతావరణ విభాగం రాష్ట్రానికి సునామీ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో సునామీ అలలు ఆరు అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తానికి సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై తమ నివాసాలను వదిలి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతున్నారు. పర్యాటకులు, స్థానికులు అంతా తప్పించుకునే యత్నంలో రోడ్డెక్కారు. దీంతో రోడ్లన్నీ ప్రజలతో నిండి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి.
అమెరికా వాతావరణ శాఖ కీలక హెచ్చరికను జారీ చేసింది. సునామీని తక్కువ అంచనా వేయొద్దని, ఫొటోలు తీసుకోవడానికి తీర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, వరుసగా పెద్ద అలలతో వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రపు నీరు పెద్ద మొత్తంలో తీరానికి ప్రవహించడంతో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదముందని పేర్కొంది. భూకంపం వల్ల సముద్ర మట్టంలో మార్పు రావడంతో భారీగా అలలు ఏర్పడి తీర ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయని, తద్వారా పలు దేశాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ ప్రకృతి విపత్తు ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దీవులు, తీర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉండగా, అధికార యంత్రాంగాలు యుద్ధప్రాతిపదికన ప్రజలను తరలిస్తున్నారు.