మాంసాహారులకు బీజేపీలో స్థానం లేదా!?
అలా అయితే PARTY| పార్టీ ఎలా బలపడుతుంది?
పైన MODI| మోడీ, ఇక్కడ నేను గెలిస్తే ఏం లాభం?
రాజకీయ పార్టీగా బీజేపీది బలమైన స్థానం
స్వార్థానికి వాడుకునే వాళ్లతోనే బలహీనం
దేశభక్తి, దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్‌లో చేరండి.
KONDA| కొండా మాటలు కమలానికి బీటలు!
సొంత పార్టీపై బీజేపీ ఎంపీ కొండా సంచలన వ్యాఖ్యలు
ఆయనది సుసంపన్నమైన కుటుంబ నేపథ్యం, ఆయనది రాజీ లేని రాజకీయ వారసత్వం. ఆయనకు విద్యాధికం. ఆయనకు ఎక్కడా కనిపించని అహంకారం. ఆయనది తెలుగు సరిగా రాని నుడికారం. వీటన్నింటికీ మించి ఆయనది ముప్పిరిగొన్న ముక్కుసూటి తనం. ఆయన మనసులో ఏది ఉంటే అదే మాటగా బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆయన ముక్కుసూటిదనపు మాటే ఆయన్ని ఇరకాటంలో పెడుతుంది. అందుకే ఆయనంటే అనేక మందికి ఎంతో ఇష్టం. పాపం కొందరికి ఆయన మాటంటే ఇబ్బందికరం. అయినా ఆయన మాట్లాడటం మాత్రం ఆపరు. ఉన్నదున్నట్లుగా.. కుల్లం కుల్ల మాట్లాడటం ఆయనకు అలవాటైపోయింది. ఆయన మాటలు కూడా చాలా మందికి అలవాటైపోయాయి. ఇంతకీ ఎవరీయన అనుకుంటున్నారా? ఆయనే చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాత స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మేనమామ కొండా వెంకట రంగారెడ్డి మనుమడు. ఆ రంగారెడ్డి పేరునే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. మహారాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసిన కొండా మాధవరెడ్డి వీరి తండ్రి. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూతురు, ఆ హాస్పిటల్స్ ఈడీ సంగీతారెడ్డి వీరి సతీమణి. న్యూ జెర్సీలో చదువుకుని, అధ్యాపకుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికైన ఎంపీలలో ధనికుడు. తెలంగాణలో ఈయనే ప్రథముడు.
మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా చెప్పే అలవాటున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మనసు ఎందుకు ఏ విధంగా గాయపడిందో తెలియదు కానీ, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ బీజేపీ, నేతలపై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
హైదరాబాద్, జూలై 7 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సాధారణంగా సౌమ్యంగా, పరిధి దాటని పద్ధతిలో మాత్రమే ఉండే చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన పరిధి దాటి మాట్లాడారు. బహుషా ఆయన మనసే నొచ్చుకుందో లేక కడుపులోంచి తన్నుకొచ్చిన ఆవేదనో కానీ, సొంత పార్టీ బీజేపీపైనా, నాయకత్వంపైనా కామెంట్లు చేశారు.
వికారాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో వారినుద్దేశించి మాట్లాడుతూ, ‘మీకు నిజమైన దేశభక్తి, దైవ భక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్‌లో చేరండి. రాజకీయాల్లోకి వచ్చేందుకు, బీజేపీ వంటి రాజకీయ పార్టీలో ఉండేందుకు మీరు అర్హులే కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ రాజకీయ పార్టీయే కాదు, దేశ భక్తి పేరుతో దాన్ని వ్యక్తిగత స్వార్థానికి వాడుకునే వాళ్ల చేతిలో పార్టీ బలహీనపడుతోందని’ విమర్శించారు.
అలాగే ‘మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారా? అలా అయితే పార్టీ ఎలా బలపడుతుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘ఇది ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ, అందరికీ సమాన అవకాశాలు ఉండాల’న్నారు. అంతేకాదు, ‘పైన మోడీ ఉన్నారు, ఇక్కడ నేనే గెలుస్తానని చెప్పుకోవడం కాదు. అధ్యక్ష పదవుల కోసం పోట్లాడే బదులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’ అని కార్యకర్తలను ఉద్దేశించి పరోక్షంగా పలువురు నేతలపై చురకలంటించారు.
ఇటీవల కాలంలో బీజేపీలో తీవ్ర అంతర్గత సంఘర్షణలు, భావజాల విభేదాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు మరోసారి పార్టీలో బిన్నాభిప్రాయాలను స్పష్టం చేస్తున్నాయి. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గతంగా, బహిరంగం గా కూడా రచ్చకు దారితీయవచ్చు. ఇప్పటికే బీజేపీలో అధ్యక్ష ఎన్నిక వివాదాస్పదంగా మారింది. భంగపడిన బీజేపీ ఎంపీ ఈటల పార్టీ వీడి బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆపార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు మరో ఎంపీ కొండా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో అత్యంత క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో ఏం జరుగుతోంది? ఇప్పటికే కొందరి శిష్ట వర్గానికి, కొన్ని సామాజిక వర్గాలకే చెందిన అంటరాని పార్టీగా ముద్రపడి ఉన్న ఆ పార్టీ, నిజంగానే మాంసాహారులను పక్కన పెడుతోందా? అన్న మీమాంసలు కొండా మాటలు విన్నాక కలగకమానవు. పార్టీ అధ్యక్ష పదవి కూడా వివాదాస్పదం అవడం ఆ పార్టీకి మంచికంటే చెడే ఎక్కువ చేసేలా ఉంది.
ఇదిలా ఉండగా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న దశలోనే అన్ని మీడియా, సొషల్ మీడియా వేదికల నుంచి తొలగించారు. అయితే అప్పటికే వైరల్ అయిన ఈ వ్యాఖ్యలు పార్టీ లోపలా, బయటా దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేయనుంది?