పేరుకే జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డిఎ). పరిపాలన మొత్తం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీదే. ఇంకా చెప్పాలంటే మోడీదే. వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కారణమైన ఎన్‌డిఎ పక్షాల పాత్ర పరిమితంగానే కనిపిస్తోంది. విధానపరమైన నిర్ణయాలలో, పరిపాలనలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు పెద్దగా భాగస్వామ్యం ఉన్నట్లుగా లేదు. సమిష్టి నిర్ణయాలు, ఆలోచనలు లేవు. గతంలో వాజ్‌పేయి హయాంలో తరచూ ప్రధాన అంశాలపై చర్చించేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎన్‌డిఎ పక్షాలు కూడా ఇదేమిటని అడిగే ధైర్యం చేయడం లేదు. చంద్రబాబు లౌక్యంగా ఏపీకి, నితీశ్ కుమార్ బీహార్‌కు పరిమితం అయ్యారు. వారి రాష్ట్రాలకు నిధులు సమకూర్చుకోవడంలో ఉన్న ఆసక్తి, ప్రజల సంక్షేమంపై మాత్రం లేదు. వ్యవసాయ జాతీయ విధానం వంటి అంశాలను పట్టించుకోవడం లేదు.
విద్య, వైద్యం, మౌళిక వసతులు, రోడ్లు తదితర అంశాల పై జాతీయస్థాయిలో చర్చించి ప్రజలకు అనువైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కేవలం డవ్మిూ పాత్ర పోషిస్తున్నాయి. విద్యారంగంలో మార్పులు రావాల్సి ఉంది. ఇప్పుడున్న విద్యావిధానం ఉద్యోగాలను, ఉపాధిని చూపడం లేదు. విదేశాలకు వెళ్లి చదువుకుందామనుకుంటే ఖరీదైనదిగా ఆమరింది. విద్యారంగ సంస్కరణలు రావాలి. విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. పెరిగిన డాలర్ విలువ, రూపాయి పతనంతో విదేశీ మారకం కోసం విద్యార్థులు, టూరిస్టులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటున్న ప్రధాని మోడీ కనీసం ఆడపిల్లల చదువుల ఖర్చుల గురించి ఆలోచించడం లేదు.
దేశీయంగా, విదేశీయంగా కూడా చదువులు భారంగా మారాయి. విదేశాలకు వెళుతున్న ఆడపిల్లలకు కనీసం వడ్డీ మాఫీ పథకం వర్తింప చేయాలన్న డిమాండ్ పట్టించు కోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వడ్డీలేని రుణాలను లేదా నామమాత్రం వడ్డీతో దేశీయంగా, విదేశాల్లో ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించేలా పథకాలు రూపొందాల్సి ఉంది. కార్పోరేట్ కంపెనీలకు వేలకోట్లు పందేరం చేస్తున్న ప్రభుత్వం విద్యారంగంలో మాత్రం వెసలుబాటు చూపడం లేదు. బ్యాంకులు కూడా రకరకాల కొర్రీల గ్యారెంటీతోనే వడ్డీ రుణాలు అందిస్తున్నాయి.
మరోవైపు భారత ఆర్థికవ్యవస్థ కుదేలు కావడంతో పాటు, ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు అందనంత ఎత్తున ఉన్నాయి. వైద్య సేవలు భరించలేనంత భారంగా పెరిగాయి. కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీతో సామాన్యులు అప్పుల పాలవుతున్నారు. మందుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నా పట్టించుకోవడం లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా ఎప్పటికప్పుడు పెంచడంతో సామాన్యుల బతుకు భారంగా మారుతోంది. పన్నుల భారం మోయలేక ప్రజల నడ్డి విరుగుతున్నది. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థికరంగాన్ని నిలబెట్టేలా లేవు. ఎడాపెడా పన్నులు విధించడంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఊపిరాడని స్థితికి చేరింది.
ఇదంతా ఒక ఎత్తయితే విదేశీ డాలర్ మారకం తీరని భారంగా మారింది. ఉన్నత చదువులకు వెళ్లాల నుకునే వారికి డాలర్ మారకం 86 రూపాయలకు పైనే కావడంతో తట్టుకోలేక పోతున్నారు. ఫీజులను డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఫీజల భారం తడిసి మోపెడు అవుతోంది. డబ్బున్నవాళ్లే చదువుకునేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి వాళ్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితితులు కానరావడం లేదు.
ఇలాంటి సమస్యలను ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చర్చించాలి. ఇక్కడ ఇంజనీరింగ్, మెడిసిన్ పూర్తి చేసి, ఇతర డిగ్రీలతో విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి ప్రధానంగా రెండు సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకటి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బ్యాంకులు సజావుగా స్పందించడం లేదు. డబ్బున్న వారికి రుణాలు అందుతున్నాయి. కానీ పేదలు, మధ్య తరగతి వారికి రుణాలు ఇవ్వడం లేదు. రెండోది రుణం పొందినా.. దాని వడ్డీ రేటు అధికంగా ఉంటోంది. విదేశాలకు వెళ్లి, చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం సంపాదించి వచ్చే సరికి రుణభారం మోయలేనంతగా పెరుగుతోంది. దీంతో సంపాదన అంతా చదువుకోసం తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించడానికే సరిపోతుంది. దీనికి తోడు విదేశీయానం కూడా భారంగా మారింది. ఇంధన ధరల వల్ల విమానరంగం టిక్కెట్లను అమాంతంగా పెంచేసింది. దీంతో అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకున్న వారికి టిక్కెట్లు భారంగా మారాయి.
విదేశీ విద్య కావచ్చు, దేశీయంగా చదువుకునే విద్య కావచ్చు..సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు స్వశక్తివిూద బతికేలా చేయాలి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రుణాలను ఉదరాంగా ఇచ్చేలా చూడాలి. అప్పుడే మన యువత తమకాళ్లవిూద తాము నిలబడగలుగుతారు. దేశీయంగా ఉన్నత చదువులు చదివే వారికి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారి కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకులు నామమాత్రపు గ్యారెంటీతో, నామమాత్రపు వడ్డీతో రుణాలు ఇచ్చేలా విధానాలు సరళీకరించాలి. అందుకు కేద్రం వడ్డీ భరించే పథకాన్ని ప్రవేశ పెడితే మరీ మంచిది. ఇలాంటి సమస్యలపై చర్చించే ధైర్యం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చేయకపోవడం దారుణం.