సంచలనమైన CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డి CHALLENGE|సవాల్!
సీఎం ఛాలెంజ్ కు KCR|కేసీఆర్ FAMILY|ఫ్యామిలీ జవాబేంటి?
రేవంత్ అన్నంత పనీ చేస్తారా?
MINISTERS|మంత్రులను పంపుతారా? లేక తనే వెళతారా?
ఫాం హౌస్ పంచాయతీ పరాకాష్టకు…
ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే ఏంటి?
గులాబీల్లో గుబులు? హస్తంలో ఆందోళన?
కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ‘రామ’ బాణం విసిరితే, సీఎం మాజీ సీఎం కేసీఆర్ పై ‘ఫాం హౌస్’ అస్త్రం వదిలారా? రైతులకు వ్వయ‘సాయం’ విషయమై ప్రజాక్షేత్రంలో పట్టుపట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు, ఇప్పుడు కేసీఆర్ నివాసం ఉంటున్న వ్యవసాయ క్షేత్రాన్ని రణ క్షేత్రంగా మార్చబోతున్నాయా? భూమి పుత్రుల మెప్పు కోసం మాటల యుద్ధానికి దిగిన ఆ రెండు పార్టీలు సై అంటే సై అంటూ సవాళ్ళు విసురుకుంటున్నాయి. ప్రెస్ క్లబ్ కు రావాలని కేటీఆర్ సవాల్ తో కాంగ్రెస్ పై గెలిచామనుకుంటున్న బీఆర్ఎస్ సంబరం, 24 గంటలు గడవక ముందే సైలెంట్ అయింది. తెలివిగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ను కార్నర్ చేస్తూ, మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ‘మీరు అసెంబ్లీకి రండి.. లేదంటే నేనే మీ ఫాం హౌస్ కి వస్తాను. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ చేద్దాం. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నాను. మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటాం. మీ అనుభవం రాష్ట్రానికి ఉపయోగడాలి. అదీ కాదంటే మా మంత్రులను పంపిస్తా.. అదీ కుదరదంటే నేనే వస్తా…’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. సాధారణంగా అధికార పార్టీలు అసెంబ్లీ, చర్చకు భయపడతాయి. అందువల్ల అసెంబ్లీ పెట్టాలని, చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడమే ఇప్పటిదాకా చూశాం. అసెంబ్లీకి రా రమ్మని ప్రతిపక్ష నేతను ప్రభుత్వమే పిలవడం, ప్రతిపక్షం అందుకు భిన్నంగా కనిపించడం చాలా అరుదేగాక, ఆశ్చర్యం కూడా! అప్పుడెప్పుడో మల్కాజీగిరి ఎంపీగా కేటీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్ కెమెరాలు ఎగిరించిన కేసులో బాధితుడైన సీఎం రేవంత్ అన్నంత పనీ చేస్తారా? కేసీఆర్ ఫాం హౌస్ కు మంత్రులను పంపిస్తారా? లేక తానే వెళతారా? సీఎం సవాల్ కు కేసీఆర్ ఫ్యామిలీ సమాధానమేంటి? సీఎంను గోల్ గోల్ చేద్దామని బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ లో పడిందా? పొరపాటున కేటీఆర్ తొందరపడ్డారా? నిజంగా ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే ఏంటి? గులాబీల్లో శ్రేణుల్లో గుబులు, హస్తంలో ఆందోళన, రాజకీయాల్లో ఉత్కంఠ మొదలైంది. ఏం జరగనుంది?
హైదరాబాద్, జూలై 10 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సవాళ్ళు… ప్రతి సవాళ్ళు రాజకీయాల్లో షరా మామూలే! పరస్పరం సవాళ్ళు విసురుకోవడం తెలిసిందే. పొలిటికల్ మైలేజీ కోసమో, వ్యక్తిగత, పార్టీ పరమైన ప్రతిష్టల కోసమో, కేడర్ ను కాపాడుకోవడం కోసమో, నిత్యం వార్తల్లో ఉండటం కోసమో ఇలా చేయడం మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ పార్టీలకు చాలా సందర్భాల్లో ప్రజల కంటే కూడా పరిస్థితుల పట్లే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏ అవకాశాన్ని ఏవిధంగానైనా తమకు అనుకూలంగా మార్చుకోవడం పైనే వాటి ద్రుష్టి ఉంటుంది. రాజకీయాల్లో ఇవేవీ కొత్త కాకపోయినా, తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితిలో కొంత తీవ్రత ఎక్కువ కనిపిస్తోంది.
రైతులకు మీ కంటే మేమే ఎక్కువ చేశామన్న అంశంపై సవాల్, ప్రతి సవాళ్ళు మొదలయ్యాయి. జూలై 4న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి‘రాష్ట్రంలో రైతు రాజ్యం రావడానికి మేమే కారణమని, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికగా ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని, ఈ చర్చకు మోడీ వస్తారో, కిషన్ రెడ్డి వస్తారో, కేసీఆరే వస్తారో రావాల’ని సవాల్ విసిరారు. దీంతో కేటీఆర్ కల్పించుకుని కేసీఆర్ దాకా ఎందుకు నేనే వస్తానని, కొండారెడ్డిపల్లె, కొడంగల్, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. 72 గంటల్లోగా సీఎం స్పందించకపోతే, తాను జూలై 8న సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ కు వస్తానని, సీఎం రావాలని సవాల్ విసిరారు. పొన్నం ప్రభాకర్ వంటి మంత్రులు, జగ్గారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు క్లబ్ లు కాంపౌండ్లు కాదు అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రండని పిలుపునిచ్చారు. అయితే కేటీఆర్ 8న తన పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ కి చేరారు. సీఎం సవాల్ స్వీకరించి తాను వచ్చానని, సీఎం కోసం తన పక్కనే ఒక సీటును ఖాళీగా పెట్టి మరీ, ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం అనూహ్యంగా కేటీఆర్ ఊసే లేకుండా, మాజ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అక్కడే రైతు రాజ్యంపై చర్చిద్దామని, కేసీఆర్ ఎలాంటి అగౌరవం కలగకుండా చర్చ చేద్దామన్నారు. ఆయన అనుభవాలను రాష్ట్ర ప్రగతికి ఉపయోగిద్దామన్నారు. ఆయన రానంటే ఆయన ఉన్న ఫాం హౌస్ కే తన మంత్రులను పంపుతానని, కాదంటే తానే స్వయంగా వస్తానని సుతిమెత్తగా సవాల్ విసిరారు. ఈ సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమై, చర్చగా మారింది.
సాధారణంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధుల చర్చకు అసెంబ్లీయే అసలైన వేదిక కావడంతో సీఎం చేసిన సవాల్ న్యాయ, చట్టబద్ధంగానే కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, సాధారణానికి భిన్నంగా ప్రతిపక్షం చేయాల్సిన డిమాండ్ ను ప్రభుత్వమే చేయడం కొంత ఆశ్యర్యమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎం ను ప్రెస్ క్లబ్ కి రమ్మనడం తప్పు కాదు. సీఎం ప్రెస్ క్లబ్ కి వెళ్ళడం కూడా తప్పు కాదు. కానీ ఇలాంటి సవాల్ పై చర్చకు వెళ్ళడం అసాధారమవుతుంది. బహుషా సీఎం ఎలాగూ రారనే కేటీఆర్ క్లబ్ ను వేదికగా ఎంచుకుని ఉంటారు. పైగా ఆయన షెడ్యూల్ ఢిల్లీలో ఉండటం మరో కారణం కావచ్చు.
కానీ, అనూహ్యంగా సీఎం స్పందించడం, నేరుగా తానే ఫాం హౌస్ కి వెళతానని చెప్పడం కేసీఆర్ ఫ్యామిలీ సహా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘రైతు రాజ్యంపై అసెంబ్లీ, పార్లమెంట్ లో చర్చకు సిద్ధ’మన్న సవాల్ రూపంలో సీఎం రేవంత్ విసిరిన వలలో కేసీఆర్ కుటుంబం పడిందా? అనవసరంగా సీఎం సవాల్ కు కేటీఆర్ స్పందించారా? అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. కేటీఆర్ సీఎంకు విసిరిన సవాల్ సంబరం 24 గంటలు కూడా నిలవక ముందే సీఎం విసిరిన సవాల్ గులాబీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వస్తే అసెంబ్లీకి రా రానంటే చెప్పు నీవున్న కాడికే వస్తా. అదీ కాదంటే మా మంత్రులను పంపిస్తా… అనడం మామూలు సవాల్ గా మాత్రం కనిపించడం లేదని బీఆర్ఎస్ నేతలు కొందరు అంటున్నారు. గతంలో కేటీఆర్ ఫాం హౌస్ కు పోయి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన కేసులో బాధితుడిగా ఉన్న సీఎం, ఇప్పుడు కూడా అన్నంత పనీ చేస్తే ఏంటి? నిజంగానే మంత్రులనో పంపో, లేక తానే ఫాం హౌస్ కు వెళితే ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సీఎం రారని తెలిసీ, ప్రెస్ క్లబ్ లో చేసిని హడావుడి కంటే, ఇప్పుడు సీఎం చేసిన సవాల్ నే ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఏ విషయాన్నైనా తెగేదాకా లాగడం అవసరమా? ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసలే అసెంబ్లీకి వెళ్ళని ఈ పరిస్థితుల్లో ఈ సవాళ్ళు అవసరమా? అన్న ప్రశ్నలను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా జరగకపోయినా, నిజంగానే సీఎం ఫాం హౌస్ కు వెళితే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుంది? మైలేజీ ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ లో మరో ఆసక్తి చర్చ జరుగుతోంది. వ్యవసాయ క్షేత్రం పోరాటం రేవంత్ రెడ్డికి కలిసే వస్తున్నదట. మొత్తానికి అసెంబ్లీ చర్చ ఫాం హౌస్ రచ్చగా మారడం సర్వత్రా రాజకీయ ఉత్కంఠగా మారింది.