ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళిక, ప్రాథామ్యాలు, ప్రాధాన్యతలు, పద్ధతి లేకుండా పోయింది. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న ఆశతో, ఓటర్లను తాయిలాలతో ఆశల పల్లకిలో ఊగిసలాడించే వికృత క్రీడ విలయతాండవం చేస్తున్నది. అధికారం హస్తగతం అయ్యాక, అప్పులకుప్పను అదే ఓటర్ల నెత్తిన రుద్దుతున్న రాజకీయ పార్టీల, నాయకుల నిర్లక్ష్య దుర్నీతిని నిలువునా పాతర వేయాలి. ప్రతిదానికి అప్పుల కోసం దేబురించే పరిస్థితి పోవాలి. ఆదాయం ఉన్నమేరకు ప్రణాళికలు ఉండాలి. అప్పులు చేసి, ఉచిత పథకాలను కొనసాగించే దౌర్భాగ్యం ఎప్పటికీ సరికాదు. అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వాస్తవ అభివృద్ది చేసి, ఆదాయాలను పెంచుకునేలా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాలి.
ఉమ్మడి ఎపి నుంచి విడివడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. లక్షల కోట్లు అప్పులు చేసినా ప్రజల సమస్యలు తీరడంలేదు. అయినా పాలకుల్లో మార్పు కానరావడం లేదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి సిఎం ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండురూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకుంటూ కొనసాగిస్తున్నారు. అభివృద్ది ద్వారా సంపద సృష్టించి ప్రజలను స్వయం సమృద్ధిగా బతికేలా చేయాల్సిన నేతలు ప్రభుత్వ ఖాజానాను కొల్లగొట్టి దోచి పెడుతున్నారు. ఈ ఉచిత పందేరాల వల్ల అభివృద్ధి ఆగిపోయి..రాష్ట్రం దివాళా తీస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. ప్రజలకు మేలు చేసే పనులు, పథకాల ద్వారా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలవాల్సిన నేతలు ఉచితానుచితాలు మరచి ప్రజలను ఓటు బ్యాంకుగా మలచుకుంటున్నారు. కనీస మౌళిక వసతులు సాగు, తాగునీరు. రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్లు, విద్య, వైద్యం పై ఖర్చు పెట్టడం లేదు. వీటికి కేటాయింపులు కూడా తక్కువే. కేవలం పెన్షన్లు, ఉచిత బియ్యిం ఇవే ఇప్పుడు ప్రధాన ఎజెండాగా అమలవుతున్నాయి. జగన్ హయాంలో బటన్ నొక్కుడుతో రాష్ట్ర ఖజానాను దివాళా తీయించారు. విశాఖలో ఆకాశ హర్మ్యాల లాంటి భవంతులను కట్టుకున్నారు. తెలంగాణలో కెసిఆర్ హయాంలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు డబ్బులు వృథా చేశారు. అప్పనంగా డబ్బులు వెనకేసుకున్నారని ఆరోపిస్తున్న ప్రస్తుత పాలకులు వీటిపై నిజాయితీగా విచారణ జరిపించి, శిక్ష పడేలా చేయలేక పోతున్నారు.
పారిశ్రామిక అభివృద్ది చేసివుంటే కనీసం నిరుద్యోగం తీరేది. ఉత్పాదక రంగం అభివృద్ది చెందేది. తన ఓటు బ్యాంకు కోసం పాలకులు రాష్ట్రాలను అప్పుల కుప్పగా చేస్తున్న తీరు దారుణంగా కొనసాగుతున్నది. ఎన్ని కుటుంబాలకు నగగదు బదిలీ చేశామన్నది కాదు. ఎంతగా అభివృద్ధి సాధించామన్న లెక్కలు తీయాలి.
పరిశ్రమలకు అత్యంత కీలకమైన విద్యుత్ వినియోగం వేసవి వచ్చే వరకు ఎంత ఉంటుందో అంచనా లెక్కలు వేయలేక పోతున్నారు. అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవడం లేదా..ఉత్పత్తి ఉన్న ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడం లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనం. నిజానికి విద్యుత్ ఉత్పత్తిపై వ్యూహం లేకపోవడం దారుణం. కరెంట్‌పై ఖర్చు అన్నది ఉత్పత్తికి, ఉపాధికి బాట వేస్తుందని గుర్తించడం లేదు. కేంద్రంలోని మోడీ కూడా దీనిని పట్టించు కోవడం లేదు. ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీలతో కరెంట్ బిల్లులు ప్రజలకు వాతలు పెడుతున్నాయి. భారీగా పెరిగిన చార్జీలతో గృహ వినియోగదారులకు షాక్ తగులుతోంది. బహుళ జాతి కంపెనీలకూ ఎర్ర తివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు మరింత దారుణం. రైతులను ఓటు బ్యాంకుగా చూడకుండా మనకు పట్టెడు అన్నం పెట్టే అన్న గా చూసుకోవాలి.
విదేశాల నుంచి నూనెల దిగుమతి వేరుశనగ రైతులకు శరాఘాతంగా మారింది. పంటల విధానంలో శాస్త్రీయ దృక్పథం లోపించడం, సేంద్రియ ఎరువుల బదులు రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం ఏటేటా తగ్గుతోంది. ఏ పంట పండించినా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. చిత్త శుద్ధితో పనిచేసే వ్యవస్థను రూపొందించాలి. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో రైతుల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. వంటనూనెల మిల్లలును దేశీయంగా రూపొదించి, మన నూనెలను మనమే వాడగలిగేలా చేయాల్సిఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన వ్యవసాయ విధానం లేకపోవడం రైతుల పాలిట శాపం. ఫ్రీ మార్కెట్ అనేది ఒక అభూత కల్పన మాత్రమే అయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థ 8నుంచి 9శాతం వరకూ వృద్ధి జరుగుతున్న ప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతన్నా రైతుల ఆర్థిక పరిస్థితి మాత్రం బాగుపడడం లేదు. అవసరం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవడం కూడా రైతులకు శాపంగా మారింది. కల్తీలు కూడా రైతును కాటేస్తున్నాయి. మన అసవరాలకు సరిపడా కందులు, మిరప, ఇతర పంటలను రైతులు చెమటోడ్చి పండించినప్పటికీ వాటిని కొనుగోలు చేయడం లేదు. ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల దిగుబడి తక్షణం ఆగిపోవాలని అన్నారు. అప్పుడు మన అసవరాలకు అనగుణంగా పంటల విధానం వస్తుందని అన్నారు. దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ.. ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా సాగాల్సి ఉంది. అందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెంచుకోవాల్సి ఉంది. ప్రతిదానికి కేంద్రంపైనో, అప్పుల కోసమో చేయిసాచకుండా సొంతంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సాప ఉన్నంత మేరకే కాళ్ళు సాపుకోవాలి అన్నట్లు…ఆదాయం ఉన్న మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రజల కోసం పరిపాలన జరగాలి తప్ప రాజకీయాల కోసం పాలన చేయడం సరికాదు!