“భూ భారతి” ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర భూమితో ముడిపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. “భూ భారతి” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కొమురం భీమ్ గారి జల్, జమీన్, జంగిల్ కోసం చేసిన పోరాటం, సాయుధ రైతాంగ ఉద్యమం, కమ్యూనిస్టు నాయకుల పోరాటాలు అన్నీ భూమికోసమే సాగాయని గుర్తు చేశారు. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మారుస్తూ తెచ్చిన ధరణి వ్యవస్థ ప్రజల పాలిట ఒక భూతంలా మారిందని ఆరోపించారు. తహసీల్దార్‌లపై పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చేలా వ్యవస్థను నాశనం చేశారని పేర్కొన్నారు. అప్పటి పాలకులు రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి తమ ప్రయోజనాలు సాధించారని విమర్శించారు. రికార్డుల పేరిట వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టడమూ జరిగిందన్నది నిరాకరించలేని వాస్తవమని చెప్పారు.
ఈ నేపథ్యంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో “భూ భారతి” ప్రాజెక్టును ప్రారంభించినట్టు సీఎం వెల్లడించారు. ఈ కొత్త ఆర్వోఆర్ చట్టం పేదల హక్కులను కాపాడేందుకే తీసుకువచ్చామని తెలిపారు. భూ భారతి ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ప్రతి వ్యవసాయ భూమిని సర్వే చేసి, కొలతలు వేసి హద్దులు గుర్తించి, ఆధార్‌లాగే “భూధార్” అనే భూమికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, వారిని ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వం సంకల్పమని స్పష్టం చేశారు. గత పాలకుల్లా రెవెన్యూ అధికారులను అసెంబ్లీ సాక్షిగా దోషులుగా నిలబెట్టే చర్యలకు తాము వ్యతిరేకమని చెప్పారు. అవినీతిలో భాగమయ్యే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని, కానీ వ్యవస్థను మాత్రం తాము దెబ్బతీయబోమని స్పష్టంచేశారు.
కలెక్టర్లు ప్రతి మండలాన్ని పర్యటించి, చట్టం అమలులో చురుగ్గా పాల్గొనాలని ఈ వేదికపైనే ఆదేశాలిచ్చారు. రెవెన్యూ అధికారులపై వచ్చిన అపోహలను తొలగించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త భూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, రాష్ట్రంలో భూ వ్యవస్థను పారదర్శకంగా, న్యాయంగా మలచే దిశగా ఇది పెద్ద అడుగుగా సీఎం అభివర్ణించారు.