మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో వారంలో రెండు రోజులు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా, మొత్తం 54,619 అర్జీలు నమోదయ్యాయని, అందులో 68.4 శాతం సమస్యలు పరిష్కరించామని అధికారులు తెలిపారు. అర్జీల పరిష్కారంలో మరింత పారదర్శకత, సమర్థత కోసం ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసీ ప్రజావాణి’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
డ్యాష్‌బోర్డ్ ద్వారా ప్రత్యక్ష మానిటరింగ్
ప్రజావాణి డ్యాష్‌బోర్డును ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా యాక్సెస్ చేయగలిగేలా సాంకేతికంగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో వచ్చే అర్జీల పరిష్కారం తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఈ విధానం ఉండాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని ఆన్‌లైన్‌లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. ప్రజల వ్యక్తిగత భద్రతకు విఘాతం కలగకుండా సమాచారాన్ని పంచే విధానం కోసం అధికారులు మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.