హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసర ప్రాంతాల్లోని అటవీ భూముల్లో జరిగిన భూ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ స్కాం వెనుక కర్త, కర్మ, సూత్రధారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. మొత్తం స్కాం విలువ సుమారు పదివేల కోట్లుగా పేర్కొన్నారు. యాజమాన్య హక్కులు తెలీకుండానే ఐసీఐసీఐ బ్యాంకు రుణాలు మంజూరు చేయడాన్ని అవినీతి చర్యగా పేర్కొన్నారు.
అటవీ శాఖ అనుమతి లేకుండా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండానే చెట్లను కూల్చి భూమిని TGICకి బదిలీ చేసిన తీరుపై ప్రశ్నించారు. బ్రోకర్ సంస్థ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ద్వారా స్కాం అమలు చేసిన తీరును వివరిస్తూ, 169 కోట్ల లంచం చెల్లించారని ఆరోపించారు. ఈ స్కాంలో బీజేపీ ఎంపీ ప్రమేయం ఉందని వెల్లడిస్తూ, త్వరలోనే అతని పేరు బయట పెడతామని హెచ్చరించారు. ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిబిలిటీ కోల్పోయే పరిస్థితి వచ్చిందని, RBIతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టి వందల ఎకరాల్లో చెట్లు నరికించడం వెనుక భారీ ఆర్థిక మోసం ఉన్నదని, సుప్రీంకోర్టు తీర్పులను దాటి భూములను తాకట్టు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పారదర్శకత లేకుండా భూమి విలువను కుదిస్తూ కమిషన్ల కోసం మోసం జరిపారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి అసలు యాజమాన్య హక్కులు లేకుండా భూమిని తాకట్టు పెట్టడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు.