సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ తన బ్రాండ్ గా చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ…. ఈ స్కూల్ ప్రతీ ఒక్క పోలీస్ సిబ్బందికి ఎంతో ముఖ్యమని తెలిపారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ ఏర్పాటు అంశాన్ని చేర్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది తన ప్రభుత్వ కట్టుబడి ఉండడానికి నిదర్శనమన్నారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దార్శనికత దేశానికి బలమైన విద్యా వ్యవస్థను అందించిందని, అట్టి మార్గదర్శనంతోనే దేశం అంతర్జాతీయంగా పోటీ పడగలిగిందని ఆయన గుర్తు చేశారు. చరిత్రలో పలువురు ప్రధానులు, ముఖ్యమంత్రులు వచ్చిపోయారు కానీ, కొద్దిమంది మాత్రమే తనిచేసిన నిర్ణయాల ద్వారా చరిత్రలో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. ఒక్కొక్క ముఖ్యమంత్రికి వారి వారి బ్రాండ్లు ఉన్నట్లు చెపుతూ, ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యంతో పేదల మనసు గెలిచారని, చంద్రబాబు నాయుడు ఐటీ అభివృద్ధితో హైదరాబాద్‌ను రూపురేఖలు మార్చారని, వైఎస్ రైతుల కోసం చేసిన కృషితో గుర్తింపు పొందారని ఉదహరించారు.
అలాగే తాను “యంగ్ ఇండియా” అనే బ్రాండ్‌ను మహాత్మా గాంధీ స్ఫూర్తితో నిర్మించుకున్నట్లు వెల్లడించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంటుంది అని పేర్కొంటూ, విద్య, ఉపాధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా నిలుస్తాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ”ని స్థాపించామని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇదే తరహాలో వచ్చే ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ”ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో “యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్” నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న దృష్ట్యా, మొదటి తరగతి నుంచే కాకుండా ప్రీ-స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సైనిక్ స్కూల్ స్థాయిలో పోలీస్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నామని, అవసరమైన అనుమతులందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పోలీస్ స్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యతగా ప్రైవేట్ సంస్థలు కూడా సహకరించాలన్నారు.