సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన బిజి బిజి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా తొలి రోజే కీలక పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ మారుబెని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకొని, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ‘నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటుపై ముఖ్య చర్చలు జరిపారు. దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మారుబెని సిద్ధమైంది. 600 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి పార్కును దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ప్రభుత్వ అధికారులు, మారుబెని ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఈ పార్క్ ద్వారా ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు రావనున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 30,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కలుగుతాయని అంచనా. మారుబెని పార్క్ తెలంగాణలో ఉన్న నైపుణ్యాలను మరింత శక్తివంతం చేస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేస్తుందని సీఎం అన్నారు. ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి అవుతుందని, ఇందుకు మారుబెని మొదటి భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. జపాన్ – భారత్ మధ్య ఉన్న దోస్తీ కారణంగా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వదేశంగా భావిస్తున్నారన్నారు.
అలాగే, గురువారం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లో సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ప్రత్యేకంగా సోనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందంతో ముఖ్యమంత్రితో పాటు ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోనీ తయారీ చేస్తున్న కొత్త ఉత్పత్తులు, వారి కార్యక్రమాలను సమగ్రంగా పరిచయం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక ఫిల్మ్ సిటీ, వీఎఫ్ఐ, యానిమేషన్, గేమింగ్ రంగాలలో ఉన్న అవకాశాలను వివరించారు. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సౌకర్యాలను కలిగి ఉండేలా ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దే లక్ష్యాన్ని చెప్పారు. రాష్ట్రాన్ని సాంకేతికత, వినోద రంగాల్లో నూతన శకానికి తీసుకెళ్లే ఈ ప్రయత్నాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించనున్నాయన్నారు.