ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు వినియోగించుకోవాలి
పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని
ప్రజల సంక్షేమమే మా కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కొడకండ్ల మండలంలోని రామవరం, కొడకండ్ల మండల కేంద్రం, తొర్రూర్ మండలం వెల్లికట్టే గ్రామంలో, రాయపర్తి మండల కేంద్రంలో, బుర్హాన్ పల్లి గ్రామంలో, కోలన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం. సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. దళారులను నమ్మి మోసపోకండి అంటూ… రైతులకు సూచించారు. రైతుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలంలో, గ్రామంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన బస్తాలు, తాగునీటి సదుపాయాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతూ…. వారు మాటలకే పరిమితమయ్యారు తప్ప పనులు చేయలేదన్నారు. కానీ మన ప్రభుత్వం చేతలతో పనిచేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవారికీ ఉచితంగా సన్న బియ్యం అందుతోంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.