రాజకీయం నాటకం! ప్రజాసేవ బూటకం!! సంక్షేమం, అభివృద్ధి పితలాటకం!!! అధికారంలోకి ఎవరు వచ్చినా, ముందు తమ పనులు చక్కబెట్టుకోవడంలోనే బిజీగా ఉంటున్నారు. పైకి మాత్రం ప్రజలు, వారి సంక్షేమం, అభివృద్ధి మంత్రాలు జపిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. ఎన్నికలప్పుడే కాదు, ప్రభుత్వం, అధికారం, పరిపాలన, పురోగతి అంతా రాజకీయమే!? నాయకులంతా రాజకీయాల చుట్టే తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో పార్టీలు మారిన సందర్భాల్లో లేని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? ఉప ఎన్నికలు రావడానికి అవకాశం లేనే లేదని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటించారు. రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం ఘాటుగానే స్పందించింది. నియంత్రణతో మాట్లాడాలని సీఎంకు చెప్పండని లాయర్ ను ఆదేశించింది. అంటే నేతలు హద్దు మీరుతున్నారా?
ఇక బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ వేదికగా మొత్తం ప్రభుత్వమే తరలి వెళ్లి ధర్నా చేసింది. సిఎం రేవంత్ సహా మంత్రులు, కాంగ్రెస్ పరివారం వెళ్లింది. నిజానికి ఇదంతా రాజ్యాంగం పరిధిలో ఓ పద్ధతి ప్రకారం జరగాల్సిన వ్యవహారం. రాజ్యాంగ సవరింపులు, నిబంధనలతో కూడుకున్న విషయం. అయితే, దీనిపై తక్షణమే తేల్చండి అంటూ..ఢిల్లీకి వెళ్ళడం వెనుక కూడా రాజకీయమే. తమ కట్టుబాటు, నిబద్ధతని నిరూపించుకునే ప్రయత్నమే తప్ప, ఇది అంత ఈజీగా జరగదని ఏలే వారికి తెలుసు.
హైదరాబాద్‌కు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్కడ పరిశ్రమలు, ఐటి సంస్థలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరి కొత్తగా ఇప్పుడు వివాదంలోకి వచ్చిన సెంట్రల్ వర్సిటీ 400 ఎకరాల్లో ఐటి పార్కులు అభివృద్ధి చేస్తామని డిప్యూటి సిఎం భట్టి చెబుతున్నారు. ఓ వైపు ఆందోళనలు జరుగుతున్నా, సుప్రీం విచారణ చేస్తున్నా, ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సిందిపోయి, సంచలన ప్రకటనలు చేయడం సబబా? నిజానికి ఈ 400 ఎకరాలను అర్జంటుగా అమ్మి డబ్బులు చేసుకోవాలన్న ఆత్రుత పాలకుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
ఇకపోతే బిఆర్‌ఎస్ నేతలు తాము చేసిన గత పాపాలను మరచి, కొత్తగా కాంగ్రెస్ మాత్రమే పాపాలు చేస్తున్నదన్న రీతిలో తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దీంతో తమ పాపాలు మాసిపోతాయని, ప్రజలు వాటిని మరిచిపోతారని వారు భావిస్తున్నట్లు ఉంది. అందుకే విపక్ష బిఆర్‌ఎస్ తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. గతంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఎదురుదాడికి దిగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు పాడిందే పాటగా, చెప్పిందే చెబుతున్నారు. ఓ వైపు దర్యాప్తు సంస్థలు ఒక్కో అవినీతి పుట్టను తవ్వి పెడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్, ప్రాజెక్ట్ ల కుంభకోణాలు, ధరణి, అవినీతి… ఇలా ఒక్కక్కటి వెలుగు చూస్తున్నాయి. వారి పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని పదే పదే సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారు. గతంలో అసలు సమస్యలే లేనట్లు, ఇప్పటికిప్పుడు పుట్టుకు వచ్చినట్లు చిత్రీకరిస్తున్నారు. గతంలోనూ మీడియాపై ఎత్తివేతల ఆంక్షలు పెట్టి, తమ నియంత్రణలోకి తెచ్చుకుని, పాలన సాగించిన తీరు అందరికీ తెలిసిందే. పార్టీ ఏదైనా ఇలాంటి నేతలను నిలదీయాల్సిందే!
అయితే, గత పాలకుల లోపాలను ఎత్తిచూపుతూనో, ప్రస్తుత ఖజానా ఖాళీ అయి, దివాళా తీసిందని పదే పదే చెప్పడం కంటే, చేసే పనిపై ద్రుష్టి పెట్టడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సమతుతౌల్యాన్ని పాటించడం కత్తిమీద సామే. ప్రజా ప్రభుత్వమన్న పేరును నిలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా ముందుకు సాగాలి. కఠినంగా వ్యవహరించడం కూడా అలవర్చుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడంలో నిక్కచ్చిగా ఉండాలి. ఎన్నికల హావిూలను అమలు చేసేలా ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఉచితాలకు పాతరేయాలి. కాంగ్రెస్ నేతలు కూడా నిజాలు గుర్తించి మసలుకోవడానికి అలవాటు పడాలి. కాంగ్రెస్‌లో స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉండదు. సీనియర్లు కావచ్చు..జూనియర్లు కావచ్చు…పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేందుకు అవససరమైన మేరకు మాత్రమే నడుచుకుంటే తప్ప మున్ముందు కాంగ్రెస్ మరిన్ని విజయాలు సాధించలేదు. బీఆర్‌ఎస్ పాలనకు.. కాంగ్రెస్ పాలనకు తేడా అన్నది పనుల్లో చూపాలి. కరువు వచ్చిందంటే కాంగ్రెస్ తెచ్చిందని మతిలేని యతి ప్రాసలు మాట్లాడుతున్నారు. ప్రతీది ప్రజలు గుర్తిస్తున్నారన్నది మరువరాదు. సిఎం రేవంత్ కూడా ప్రజలకు ఇచ్చిన హావిూలు, చేయాల్సిన పనులు లక్ష్యంగానే ముందుకు సాగాలి. వ్యక్తిగత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వరాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలి. బిఆర్‌ఎస్ అవినీతిని ఎండగట్టడమే పాలన కాదు. ప్రజోపయోగ పనులు కూడా చేస్తూ పోవాలని గుర్తించాలి. పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి వేగాన్ని గుర్తించాలి. మన రాష్ట్రంలోనూ అంతకు మించిన సమర్థత, వేగంతో పథకాలు అమలయ్యేలా చూడాలి. ఏపీలో చంద్రబాబు ప్రజాక్షేత్రంలోనే అనునిత్యం ఉంటున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన హామీల అమలుతోపాటు, హామీ ఇవ్వని కొత్త పనులను కూడా అవసరాన్ని బట్టి చేపడుతున్నారు. రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ భవిష్యత్ ప్రణాళికలతో పని చేయాలి. సాగు, మంచినీటి రంగాలను చక్కదిద్దే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. వచ్చే వర్షాకాలం నాటికి నీటి నిల్వలు పెంచడం, సాగునీటి రంగాన్ని ఆధునీకరించడం వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఆయన విజయవంతమైన ముఖ్యమంత్రి కాగలుగుతారు.
రాజకీయం కాదు రాజనీతి కావాలి!
