-జననాయకుడు సుధాకర్ రావు మొదటి వర్ధంతి నేడు
సాధారణ జీవనం సమున్నత చింతనం! ఈ అక్షరాలకు ఆకృతిని ఇస్తే డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు. సుధాకర్ రావు పుట్టిన తేది 1950 ఏప్రిల్ 3. స్వగ్రామం వడ్డె కొత్తపల్లి. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో ఉన్నది. విమలా దేవి, యతిరాజ రావుల తొలి చూలు కొడుకు ఆయన. తన తరువాత నలుగురు తమ్ముండ్లు, ఒక చెల్లె. భూస్వామ్య కుటుంబం, రాజకీయ నేపథ్యం. తల్లి ఒకసారి ఎం ఎల్ ఏ మరియు జెడ్ పి చెయిర్ పర్సన్. తండ్రి ఒకసారి పంచాయతి సమితి అధ్యక్షుడు, ఆరు సార్లు ఎం ఎల్ ఏ, రెండు సార్లు మంత్రి.
సుధాకర్ రావు అట్టహాసాలకు అతీతంగ చక్కగ చదువుకొన్నడు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిండు. తరువాత వైద్య విద్య అభ్యసించి కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఎం.బి.,బి.ఎస్., ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎం.డి. జెనరల్ మెడిసిన్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ నుంచి డి.ఎం. ఎండోక్రైనాలజి పట్టాలు అందుకొన్నడు. ఎండోక్రైనాలజి అంటె వినాళ గ్రంథులు, అవి స్రవించే హార్మోన్ ల శాస్త్రం. సాధారణ జనం ఎండోక్రైనాలజిస్ట్ ను మధుమేహ వ్యాధి నిపుణుడుగ మాత్రమే భావిస్తరు. కానీ నవజాత శిశువుల నుంచి వృద్ధుల వరకు హార్మోన్ లు, జీవ క్రియలతో సంబంధం ఉన్న అన్ని సంక్లిష్టమైన వ్యాధులు ఎండోక్రైనాలజి పరిధిలోనికి వస్తయి. అందుకే ఎండోక్రైనాలజిస్ట్ ను కన్సల్టెంట్ లకు కన్సల్టెంట్ అంటరు. వేరే స్పెషలిస్ట్ లకు అర్థం కాని క్లిష్టమైన కేసులను ఎండోక్రైనాలజిస్ట్ లు పరిష్కరిస్తరు. ఎండోక్రైనాలజిస్ట్ గ రాణించాలంటే సునిశిత మేధస్సు కావాలె. ఆసియాలో పది మంది ఉత్తమ ఎండోక్రైనాలజిస్ట్ ల పేర్లు పరిశీలిస్తే అందులో సుధాకర్ రావు పేరు తప్పకుండ ఉంటది. అంతటి ఖ్యాతి సంపాదించు కొన్నరు. జన్మభూమి మీద ప్రేమతో ఇక్కడనే ఉన్నడు. బోధన పట్ల అనురక్తితో ప్రొఫెసర్ అయ్యిండు. ఎన్.టి. రామారావు వంటి సెలబ్రిటీలకు వ్యక్తిగత వైద్యుడు. అయినా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే ఆప్తుడు.
పదవుల పట్ల ఆయనకు ఆసక్తి లేదు. అభిమానుల కోరిక మేరకు తొలుతగ వల్మిడి రాముల వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి చేపట్టిండు. శ్రీరామనవమికి రాముల వారి కల్యాణం రాత్రి పూట జరిగేది. గుట్ట మీద రాత్రి కార్యక్రమం భక్తులకు అసౌకర్యంగ ఉందని గ్రహించి, కల్యాణ వేళను పగటికి మార్పించిన ధీశాలి, సంస్కర్త. తండ్రి యతిరాజా రావుకు పెద్ద వయసు కావటం, కార్యకర్తల ఒత్తిడితో, గాంధీ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసి 1999లో చెన్నూరు నియోజక వర్గం ఎమ్మెల్యేగ గెలుపొందిండు. దేశంలోనే అత్యున్నత వైద్య విద్యార్హత కలిగిన ప్రజా ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రావు. ఎమ్మెల్యే అయినా జనాలలో “డాక్టర్ సాబ్” గనే పేరు పోయిండు. అధికారులతో స్నేహపూర్వకంగ మెదులుతూ ప్రసన్నంగ పనులు చేయించే వాడు. అధిష్టానంతో మెప్పించి నిధులు రాబట్టే వాడు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మింప చేసిండు. పక్కా రోడ్ లు వేయించిండు. జన్మభూమి పథకం కింద ప్రజలను చైతన్య పరచి విద్యుత్ సబ్ స్టేషన్ లు వంటివి ఏర్పాటు చేయించిండు. వెలుగు పాఠశాలలు, బలహీన వర్గాలకు గృహాలు మంజూరు చేయించిండు. సాగు నీరు, తాగు నీరు పథకాలకు కృషి చేసిండు. శ్రీరామ్ సాగర్ కాలువ తవ్వించి చెరువులు నింపించిండు. పాలకుర్తి దేవస్థాన ప్రాచుర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నడు. జాతర సందర్భంగ పండిత సన్మానాలు చేయించిండు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేసిన పాలకురికి సోమనాథుని విగ్రహాన్ని ఆవిష్కరింప చేసిండు. పాలకుర్తి పాండవుల బోడు మీద పర్యాటక అతిథి గృహం కోసం ప్రతిపాదనలు రూపొందించిండు. గ్రామాలలో జ్వరాలు ప్రబలినప్పుడు స్థానిక ఆరోగ్య వ్యవస్థకు దన్నుగా, వైద్య కళాశాల నిపుణులతో కారణాల అన్వేషణ చేయించి, చికిత్సా మార్గదర్శకాలు సూచించే వాడు. ప్రజలు కోలుకొనే దాకా పాలు, బ్రెడ్ కూడా ఇప్పించే వాడు. సభలు, సమావేశాలు జరిపినా సామాన్యులకు అసౌకర్యం కలుగకుండ జాగ్రత్త పడేవాడు. మానవత మరువని మర్యాద పురుషోత్తముడు డాక్టర్ సాబ్. సమాజ సమగ్ర వికాసాన్ని కాంక్షించిన స్వాప్నికుడు సుధాకర్ రావు.
తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపు అందుకుంటున్న దశలో 2004 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న ఆయన ఓటమి పాలు కావలసి వచ్చింది. ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను అర్థం చేసుకొన్న డాక్టర్ సాబ్ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యిండు. కాని, ఆ తరువాత ఎన్నికలు ఆయనకు కలిసి రాలేదు. అయినా ప్రజలతో అనుబంధాన్ని వీడలేదు. అందిస్తున్న ఆరోగ్య సేవలు నిలుప లేదు. ప్రాంత అభివృద్ధి ఆకాంక్ష ఆగలేదు. పాలకుర్తి పర్యాటక అభివృద్ధి గురించి 2014లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేసిన విజ్ఞప్తి ఫలించింది. నేడు కనుల ముందు కనిపిస్తున్న పాలకుర్తి పర్యాటక శోభ డాక్టర్ సాబ్ స్వప్నమే!
2024 మార్చ్ 13 న ఆయన మరణం అందరినీ హతాశులను చేసింది. సుధాకర్ రావు మరణంతో తెలంగాణ సమాజం హస్తవాసి కల ఒక మంచి వైద్యుని కోల్పోయింది. దార్శనికత ఉన్న ఉదాత్త రాజకీయ నాయకుడిని కోల్పోయింది. ఉన్నత సంస్కారం ఉన్న ఉత్తమ వ్యక్తిని కోల్పోయింది. మచ్చ లేని, మరచి పోలేని మంచి మనిషి “డాక్టర్ సుధాకర్ రావు సాబ్”!

– డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

