అధికారం ప్రమాదకర మత్తు. అదో మాయామేయ జగత్తు. దాని కోసం ఎంతకైనా తెగించడం దాని గమ్మత్తు. కనిపెట్టిన వాడు దాని తాకత్తు. ప్రజలకు కనికడుతూనే ఉంటాడు ఆ తాయత్తు. ఒకసారి అధికారం రుచి చూసింది లగాయత్తు. దాని చుట్టూతిరుగుతుంటుంది యావత్తు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది, అందరికీ ఆసక్తి గొలిపేది, ఆకర్షణ కూడా కలిగి ఉంది. రాజకీయమే. వెనుకటికి మహిళ కోసం మహిలో యుద్ధాలే జరిగాయన్నది ఎంత నిజమో ఇవ్వాళ రాజకీయ అధికారం కోసం అంతకుమించిన ఆరాచక మథాంధకారం రాజ్యమేలుతోంది. ఇవ్వాళ భూమి మీద ఇన్ని రకాల ఉపద్రవాలకు, యుద్ధాలకు కూడా రాజకీయాలను తప్పు పట్టకుండా ఉండలేం. అందుకే అధికారంలో ఉండగానే కాదు, అధికారాంతమున చూడవలే అయ్యవారి ఆగడములు.. ఊరికే అనలేదు. దాని మహత్తు అలాంటిది మరి. అధికారం కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారనడానికి ప్రపంచ, దేశ, రాష్ట్రాలలో వారి రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. దేన్నైనా తమకు అనుకూలంగా, అనువుగా మార్చుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, తమ పబ్బం గడుపుకుని పలాయనం చిత్తగించడం రివాజుగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జగన్ పర్యటనలో జరిగిన హంగామా ఇద్దరి ప్రాణాలు తీసింది. చనిపోయిన ఓ వ్యక్తి పరామర్శ మరో ఇద్దరి చావుకు కారణమైంది. పరామర్శకు కూడా ఇంత అవసరమా అన్నదే సామాన్యుల ప్రశ్న. పరామర్శలకు వెళుతున్నారా లేక, రాజకీయ హంగామాకా? అధికారంలో ఉండగా ప్యాలెస్ దిగిరాని జగన్, సామాన్యులను పట్టించుకోలేదు. అమరావతి రైతుల ఆందోళనలు వినలేదు. చనిపోయిన వారెవ్వరి గురించీ ఆలోచించలేదు. ఇవ్వాళ ఇదంతా ఎందుకంటే అధికారం కోసం. ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు అధికారం దూరమై ఇంకా రెండేండ్లు నిండలేదు. అప్పుడే కొంపలు అంటుకు పోయినట్లు దారుణంగా అడ్డగోలుగా గగ్గోలు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దురాగతాలకు పాల్పడి ఇప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే తమదే అధికారమని సొంత పత్రికల్లో బాకాలూదుతున్నారు.
విమర్శలకు కూడా హద్దులు ఉంలాలి. మీడియాతో మాట్లాడటం, మరుసటి రోజు ట్విట్టర్ లో వల్లించడం, ఆతర్వాత రోజు దానిపై సొంత పత్రికల్లో కథనాలు, టీవీల్లో బాకాలు ఊదడం అలవాటైపోయిది. ప్రజల సమస్యలు పక్కకు పోయాయి. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా తమ పాలనలోని గత తమ పాపాలను ప్రజలు మరచి పోతారన్న ఏకైక లక్ష్యంతో జంకూగొంకూ బొంకుతున్నారు. అబద్ధాల ప్రచారంలో ఆరితేరారు. ఇది చాలదన్నట్లు తెలంగాణలో ఇప్పుడు కవిత కూడా బలయుదేరారు. తాము అధికారంలో ఉన్నన్నాళ్ళూ గుర్తుకురాని బీసీలకు రాజ్యాధికారం, రిజర్వేషన్లు, పూలే విగ్రహాలు వంటివన్నీ కవిత నోటినుంచి తన్నుకు వస్తున్నాయి. అధికారమంటే దోచుకోవడమే అన్న చందంగా ఐదేళ్లు జగన్, పదేళ్లు బిఆర్‌ఎస్ నేతలు దోచుకున్న విషయాన్ని ప్రజలు ఇంకా మరచి పోలేదు.
అసలు ఏపీ విభజన జరిగిందే తమ ఆదాయాల పెంచడానికి అన్నట్లుగా ఇరు రాష్టాల్రను అప్పట్లో దోచారు. అప్పుల్లో ముంచేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకుని వచ్చారు. ఇసుక, మట్టి, క్వారీ, భూకబ్జాలు వంటివెన్నో చెప్పనక్కరలేదు. జర్నలిస్టులను అంటరానివారిగా చూసిన ఘనత ఈ ఇద్దరు నాయకులకే చెల్లింది. సీఎం ప్రజలను కలవాల్సిన అవసర మేముందని దబాయించిన నేతలు ఇప్పుడు నీతి దండకాలు చదువుతున్నారు.
మాజీలని అనిపించుకోవడానికి కూడా ఇష్టపడని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేని నేతల పార్టీల పని పట్టి, ప్రజలు గట్టి బుద్ధే చెప్పారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ కి కేసీఆర్, బెంగుళూరు ప్యాలెస్ కు జగన్ పరిమితమయ్యారు. మల్లన్నసాగర్‌లో ప్రజల జీవితాలను ముంచేసిన కేసీఆర్ బృందం ఇప్పుడు మూసీ మురికి బాధితుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. దోచుకోవడమే పాలన అన్నచందంగా సాగిన వీరి ఆగడాలను భరించలేకే ప్రజలు అధికారం నుంచి దించేశారు. సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు పందేరాలు సాగించి, అదే అభివృద్ధి అని నమ్మించి, ఎన్నికల్లో ఓటమి పాలైనా వీరికి జ్ఞానోదయం కలగినట్లు లేదు. మూసీ మురికి వదలకూడదు. బతుకమ్మ చీరలు, నిరుద్యోగులకు టోపీ పెట్టిన వైనాన్ని నిలదీయరాదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ధరణి అవినీతుల గురించి అడగరాదు. ఈ ఫార్ములా రేసులో డబ్బుల హవాలాపై కేసు పెట్టరాదు. ఇక ఇప్పుడు ఏపీలోనూ పోలీసు కేసులు, వేధింపులు, పత్రికా స్వేచ్ఛ అంటూ జగన్ అండ్ కో గగ్గోలు పెట్టడం చూస్తే జాలేస్తోంది. పార్టీల, మీడియా ముసుగులో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ముఠాలు బయలుదేరాయి. మీడియాకు కూడా ప్యాకేజీలతో మాయ చేసే, థాట్ పోలీసింగ్ మాయను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నది మరువరాదు.
గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడి, అవినీతికి తెగించి, ఆర్థిక విధ్వంసాలు సృష్టించిన వారిపై చర్యలు ఉండకపోతే భవిష్యత్తులో మరికొందరు బరి తెగిస్తారు. తమకేమీ కాదులే అన్న దీమా రాజకీయ నేతల్లోనే కాదు ఎవ్వరిలోనూ రాకూడదు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండి తీరాలి. అయితే, అధికారంలో ఉన్న, లేని అన్ని పార్టీలు ఒకరిని ఒకరు పైకి విమర్శించినా, లోలోన సమర్ధించుకోవడం, సహకరించడమే రాజకీయాల్లో అత్యంత దారుణంగా, దయనీయంగా ఆందోళనకరంగా మారింది.

