ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. తెలంగాణ ధాన్యాగారం. దిగుబడులలో మనమే నెంబర్ వన్. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంది. కానీ అన్నపూర్ణను చేసిన రైతు అనాథగా మిగిలి, ధాన్యాగారం కాస్తా దళారులకు, మిల్లర్లకు ధనాగారంగా మారి, వరి ఉరైన నెంబర్ వన్ మనమే అవుతున్న దశలను చూస్తున్నాం. ముందు చూపు, విధానమంటూ లేకుండా సాగుతున్న పాలనలో సాగు సావు అవుతున్నది.
ఈ భూమి మీద రెండో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా, ప్రపంచంలోనే అత్యంత పెద్దరంగంగా, అత్యధికులు సాగుపై ఆధారపడే దేశంలో. ఓ వ్యవసాయ విధానమే లేకపోవడం విచిత్రం,. విడ్డూరం. దరిద్రం. రైతే రాజు. అన్నదాత. దేశానికి వెన్నెముక. అంటున్న పాలకులు రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ సంక్షోభ నివారణకి గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా, కనీస చట్టాలు కూడా చేయడం లేదు.
దేశంలోని అన్నదాతలను ఆదుకోవడంతో పాటు.. దేశానికి అన్నం పెట్టాలన్న దూరదృష్టి నేతల్లో కొరవడింది. ఏం చేస్తే దేశంలో ప్రజలందరికి ఆహార ధాన్యాలు దక్కగలవో చర్చించడం లేదు. సాగు చట్టాలను రద్దు చేసిన తరవాత కూడా కేంద్రం ఈ సమస్యలపై చర్చించడం లేదు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హావిూలు మాటలకే పరిమితం అయ్యాయి. సన్నకారు రైతులకు అండగా ఉన్నానని, ఏటా 6వేల కోట్లు వారి ఖాతాల్లో వేస్తున్నానని గొప్పగా ప్రకటించు కోవడం తప్ప బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టడం లేదు. నిజానికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం కాకుండా వ్యవసాయాన్ని ఆ డబ్బులను పండించే సాగుగా మార్చడం గురించి ఆలోచించడం లేదు. అలాగే వ్యవసాయాధారిత పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అభివృద్ది చేయాలి. దీంతో గ్రావిూణ వృత్తులకు కూడా ఆసరా దక్కుతుంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు. అకాల వర్షాలకు భారీగా పంటలు దెబ్బతింటున్న సందర్భంలో వారికి సకాలంలో పరిహారం అందడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 శాతానికంటే ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతింటేనే నష్ట పరిహారానికి సిఫార్సు చేస్తారు. పంటనష్టం అంతకు మించి ఉంటేనే వ్యవసాయాధి కారులు వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. బీమా చేస్తున్న రైతులకు పరిహారం అందేది నామమాత్రంగానే ఉంటుంది. ఈ నిబంధనలను మార్చాల్సి ఉంది. భారీ వర్షాలతో నష్టపోతే రుణాలు తీసుకున్నవారికి ఈ బీమాను అమలు చేయక పోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల ఉత్పత్తి ఆధారంగా ఎంత పంటనష్టం జరిగితే అంతే మొత్తాన్ని అందించనున్నారు. అకాల వర్షాలు భారీగా పంట నష్టాన్ని కలిగించి, రైతుకు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను కాపాడు కునేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.
ఇక పంటలను అమ్ముకోవడం ఓ పెద్ద ప్రహనంగా మారింది. ధాన్యం మార్కెట్లోకి తెచ్చిన తరవాత సవాలక్ష కొర్రీలు పెట్టి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. పక్కా మార్కెటింగ్ వ్యవస్థ, పంటలను కొనుగోలు చేసే వ్యూహం లేకుండా పోయింది. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్, నీటి సరఫరా, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, రైతు బీమా, సన్నాలకు క్వింటాకు అదనంగా రూ.500 వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టి పంటలు కొనుగోలు చేయకపోతే ఎలా? పంటలు అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధరల కోసం రైతులు రోడ్డెక్కితే రాజకీయం ఎలా అవుతుంది.? ఇది ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు. దేశం వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య. ఏ సీజన్‌కు ఆ సీజన్ లో సకాలంలో పంటలు కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తే చాలు. రైతు సమస్యలు సగం తీరినట్లే. కానీ మార్కెట్ యార్డుల్లో పడిగాపులు, ధరలు రాకపోవడం, తాలు, తరుగులతో నిలువు దోపిడీయే రైతులకు శాపంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వాల నిర్లక్ష్యాలు.
దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దాఖలాలే లేవు. ఎరువులు ఎంత ఎక్కువ వేస్తే అంత అధిక దిగుబడి వస్తుందని భ్రమపడుతున్నారు. దీంతో భూసారం దెబ్బతింటోంది. ఆ పంటలను తింటున్న ప్రజారోగ్యం పరేషాన్ గా మారింది. ఇందుకు భిన్నంగా రైతులకు తాయిలాలు ప్రకటిస్తూ ప్రభుత్వాలు రైతన్నలను మోసం చేస్తున్నాయి. నిర్ధిష్ట విధి విధానాలను రూపొందించాలి. వ్యవసాయ విధానాన్ని, పంటల క్యాలెండర్ ను ప్రకటించాలి. రైతులకు సరైన గైడెన్స్ అందేలా చూడాలి. ఇప్పుడున్న వ్యవసాయ పాలనా వ్యవస్థ సరిగా పని చేసేలా చర్యలు చేపట్టాలి. రైతు బీమా సరే, పంటల బీమా అమలు కావాలి. మిగతా కార్పొరేట్ వ్యవస్థల్లానే రైతులకు, వారి పంటలకు కూడా భరోసా ఉండాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పాలి. ప్రోత్సహించాలి. అన్నింటికంటే ముందు భూ సమస్యలను పరిష్కరించాలి. భూ కబ్జాలను అరికట్టాలి. ఇదంతా చూస్తుంటే ఇదేదో చైన్ సిస్టమ్ లా ఒకదానికి ఒకటి ముడి పడి ఉన్న అంశాలు.
ఏవేవో పరిశ్రమల కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్న పాలకులు, వాటి స్థాపనకు విలువైన మన భూములు ఇస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సరే, వాటి ద్వారా మనవాళ్ళకు అందుతున్న ఉద్యోగాలు ఎన్ని? వాటికంటే, పాలకులకు అందుతున్న మామూళ్ళే ఎక్కువ. ఇక మన వ్యవసాయ విధానాలను మన భూములు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాకుండా అధ్యయనం పేరుతో విదేశీ విహారాలు చేసి, వాటి విధానాలను మనమీద రుద్దడం సరికాదు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.

