17 సెప్టెంబర్ 2019 నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేసిన కృషి ఫలితంగా 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల అంశాన్ని తన మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారంటీలలో కూడా ఉద్యమకారుల అంశాన్ని చేర్చింది. కానీ ఇంకా ఉద్యమకారుల కోసం స్పష్టమైన ప్రకటన ఏది కూడా ప్రభుత్వం నుండి అధికారికంగా రాలేదు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో కూడా ఉద్యమకారుల వివరాలు సేకరించింది. కేసుల వివరాలు కూడా అడగడంతో కేసులు లేని అనేక మంది ఉద్యమకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యమకారులు అందరికి న్యాయం జరిగేలా స్పష్టమైన ప్రకటన చేసి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేసుల ప్రాతిపదికన, జైలు శిక్షల ప్రాతిపదికన ఉద్యమకారులను గుర్తిస్తామంటే అది చట్ట విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఎందుకంటే భారత దేశం అంతటా వర్తించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసులు, జైలు శిక్షలు ముద్దాయిలు, నేరస్థులపై ప్రయోగించేవి. కాబట్టి ఆ ప్రాతిపదికన చేస్తే నిందితులను లేదా నేరస్థులను ఉద్యమకారులుగా గుర్తించినట్టు అవుతుంది.
ఉత్తరాఖండ్ ఓ ఉదాహరణ: ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా అనేక ఉద్యమాలతోనే 09 నవంబర్ 2000 న ఏర్పాటైంది. రాష్ట్రం సిద్ధించిన అనతి కాలంలోనే ఉద్యమకారులను గుర్తించి అందరికి ఫ్రీ బస్సు పాస్ లు, విధాన సభ, సచివాలయం లోకి ప్రత్యేక ప్రవేశాలను కల్పించారు. ఉద్యమకారులకు జిల్లా మెజిస్ట్రేట్ తో గుర్తింపు కార్డులు జారీ చేశారు. అంతే కాకుండా 7 రోజులు ఆపైన రోజులు జైలు శిక్ష అనుభవించిన వారికి లేదా గాయాలైన వారికి ఏ పరీక్ష లేకుండా విద్యార్హతలను బట్టి గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 పోస్టుల్లో ఉద్యోగాలు కల్పించారు, 7 రోజుల కన్నా తక్కువ జైలు శిక్ష అనుభవించిన వారికి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో (గ్రూప్ 4 నుండి గ్రూప్ 1 వరకు) 10% హారిజంటల్ రిజర్వేషన్ ను కల్పించారు. 50 సంవత్సరాల పైబడిన ఉద్యమకారులకు వారి కుటుంబ సభ్యులకు ఉద్యమకారుల లబ్ది అవకాశాలు కల్పించారు. 2007 లో కరునేశ్ జోషి మరియు 2009 లో నారాయణ్ సింగ్ రానా రిట్ పిటిషన్ల వల్ల ఆ రాష్ట్ర హై కోర్టు ఆ జీ.ఓ.లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 కు విరుద్ధంగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆర్టికల్ 309 ప్రకారం కొన్ని రూల్స్ ఫ్రేం చేసింది. ఈ రూల్స్ ప్రకారం ఉద్యమకారులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి దాటి ఒక్కసారికి గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 ఉద్యోగ అవకాశాలు కల్పించింది. తదనంతర జి.ఓ.ల ద్వారా రిజర్వేషన్లు ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తాయని చెప్పింది. ఆ రాష్ట్ర హై కోర్టు… ఉద్యోగాలు పొందిన వారందరి డేటాను పరిశీలించి, ‘‘శాంతియుతంగా ఉద్యమం చేసిన అమాయకులకు, పరపతిలేని వారికి ఎవరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. రౌడీలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చార’’ని వ్యాఖ్యానించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తరాఖండ్ ఉద్యమకారుల మరియు వారిపై ఆధారపడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చట్టం – 2015” ముసాయిదాను తయారు చేసింది. రాష్ట్ర అసెంబ్లీ 2016 లో ఆ బిల్ పాస్ చేసింది. కానీ, గవర్నర్ ఆమోదం పొందలేదు. 2017లో హై కోర్టు డివిజన్ బెంచ్ లోని ఇద్దరు జడ్జీలలో ఒకరు జస్టిస్ ధ్యానీ ఉద్యమకారులకు న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారుల నిర్వచనం సరిగా లేకపోయినా అది ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న నిర్ణయం కాబట్టి, ఎవరూ తల దూర్చక్కర్లేదని ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పిచ్చారు. కానీ మరో జడ్జి జస్టిస్ సుధాంశు ధూలియా మాత్రం చాలా నేర్పుతో సుదీర్ఘంగా, లోతుగా చర్చిస్తూ 55 పేజీల తీర్పిచ్చారు. ‘‘ఉద్యమకారులకు న్యాయం జరగాలి, ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రూల్స్ చేసే అధికారం ఉంది కానీ చేసిన రూల్స్ లో ఉద్యమకారులను గుర్తించే విధానం, ఉద్యమకారులు అంటే ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 16 లకు విరుద్ధంగా ఉన్నద’’ని అన్నారు. సొంత ఖర్చులతో కొందరు ఉద్యమకారులు తమ విలువైన పనులను వదులుకొని, విలువైన సమయాన్ని వెచ్చించి ర్యాలీలలో పాల్గొన్న వారిని, ధర్నాలు చేసిన వారిని, సాహిత్య పోరాటం చేసిన వారిని ఉద్యమకారులు కాదంటే ఎలా?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యమకారులు అందరిని పేద ప్రజలుగా భావించలేమని చెప్పారు. స్వాతంత్ర్య సమర యోధులు అనడం వీలు కాదని కూడా చెప్పారు. అలాగే మహారాష్ట్రలో ప్రాజెక్ట్ ప్రభావిత ప్రజలకు ఇచ్చే లబ్ది మాదిరిగా ఉద్యమకారులందరికి లబ్ది చేకూర్చడం కూడా వీలు కాదని ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా తీర్పిచ్చారు.
మొత్తంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులను నిర్వచించడంలో, నిర్ధారించడంలో శాస్త్రీయత, తార్కికత లేకపోవడం కనిస్తున్నది. ఇద్దరు న్యాయమూర్తుల దృష్టిలో ఉద్యమకారుల గుర్తింపునకు శాస్త్రీయమైన తార్కికతకు నిలిచే నిర్వచనం కావాలనేది ఏకరూప నిర్వివాదాంశం. ఇవేవీ లేకుండానే చట్టం చేస్తే, ఉద్యమకారులు మళ్ళీ ఉద్యమాలు చేసే అవకాశాలే ఎక్కువని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉద్యమకారులను నిర్వచించి, గుర్తించి తగిన న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారులంతా కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తేనే అందరికీ మంచిది.

– మోకాటి రాంబాబు
రాష్ట్ర కో-ఆర్డినేటర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
ఫోన్ నెంబర్: 7799080866

