ఫాల్గుణ పౌర్ణమి నాడు లింగైక్య తిథి
పాల్కురికి సోమనాథుడు (క్రీ శ 1160-1240) అందరి వంటి కవి కాదు. అన్నింటా అసామాన్యుడు. తెలంగాణ ఆదికవి. తెలుగు భాషలో తొలి స్వతంత్ర కవి. ఆయనకు ముందు అందరూ అనువాద కవులే. సోమనాథుడు అష్ట భాషా కోవిదుడు. అక్షర క్రీడలో ఆరితేరిన ప్రతిభా శాలి, ప్రయోగ శీలి. అయినా ప్రగల్బ ప్రదర్శన లేని వాడు. జాను తెలుగులో వ్రాసి ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిండు. భాష, భావం, వస్తువు, ఇతివృత్తం, పాత్రలు, ఛందస్సు, ప్రక్రియ, ప్రస్తుతి అన్నింటి లోనూ నవ్య మార్గంలో నడిచిండు. ఒక విప్లవం తెచ్చిండు.
కన్నడ నేలపై ప్రభవించి సమ సమాజం, సామ్యవాదం సాధనకు వీర శైవంను ఒక పరికరంగా స్వీకరించి ప్రజలను మేలు కొలిపిన మహనీయుడు బసవేశ్వరుడు. బసవేశ్వరుని భక్తి తత్వాన్ని తెలుగు దేశాన తెలియ చెప్పిన వాడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఈ ఇరువురి దివ్య చరితలను వారి బలగమైన శివ శరణుల కథలను తనివి తీరా వ్రాసిండు. తన ఇలు వేలుపు పాలకురికి సోమేశునిపై సోమనాథ స్తవం వ్రాసిండు. ద్విపదకు పద్య పదవిని ఇచ్చిండు. లక్షణ యుక్తంగా తొలి శతకాన్ని కూర్చిండు. ఉదాహరణకు ఉదాహరణగా నిలిచిండు. గద్యలతో, రగడలతో ఊర్రూత లూగించిండు. అలతి ద్విపదలు, అలుకటి మాటలే కాదు, అరుదైన ఛందస్సులు, అబ్బుర పరిచే అక్షర విన్యాసాలు చూపించిండు. తన కాలపు సమాజాన్ని, సంస్కృతిని, కళలను, ప్రకృతిని, విజ్ఞానాన్ని, ఆనాటి సమస్తాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించిండు. అంతటి మహత్తరమైన కవి మరొకరు లేరు. సోమనాథుడు తెలంగాణలో పుట్టినా, ప్రాంతానికి పరిమితం చేయలేని విశ్వ కవి.
సోమనాథుడు ప్రజల మధ్య, భక్తుల నడుమ పర్యటిస్తూ శ్రీశైలం మీదుగా కన్నడ కల్య క్షేత్రాన్ని చేరుకొన్నడు. అక్కడి జంగమ మఠంలో శివ శరణి చెన్నమ్మ చెంత ఆ వృద్దాప్యంలోనూ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉండి పోయిండు. కాలం సమీపించి అక్కడనే లింగైక్యం చెందిండు. క్రీ శ 1240 వికారి నామ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు ఆయన ఆత్మ శివ పరమాత్మలో లీనమైంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు కల్య క్షేత్రంలో అక్కడి జంగమ మఠం వారు సోమనాథుని సమాధి వద్ద దీపారాధన చేస్తున్నరు. విశేషం ఏమిటంటే అక్కడ స్థానికులకు సోమనాథుని గురించి తెలుసు. ఈ వ్యాసకర్త 2024 అక్టోబర్ 19న కల్య సందర్శనకు పోయినప్పుడు నాగరాజ్ అనే పాతికేండ్ల కాపుదనపు యువకుడు విశేషాలన్నీ వివరించిండు. వ్యాసకర్త మిత్రుడు రఘు కిరణ్ అయ్యంగార్ దుబాసిగా తోడు ఉన్నడు. తిరిగి వస్తున్న దారిలో ఎదురుపడ్డ కె సి ఈశ్వర్ ప్రసాద్ మరికొన్ని వివరాలు తెలిపిండు. సోమనాథుని సమాధిని విభూదితో నింపినారట. పక్కనే పెంచిన మారేడు చెట్ల నుంచి సమాధి మీద నిత్యం బిల్వ దళాలు పడే ఏర్పాటు కొనసాగుతూ వస్తున్నదట.
సోమనాథుని లింగైక్య అనంతరం పాలకుర్తిలో ఆయన పేరు మీద మందిర నిర్మాణం జరిగింది. జంగమ పెద వీరయ్య వారసులు ఆ గుడి నిర్వహణ చూస్తున్నరు. పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం వినతి మేరకు తెలుగు విశ్వవిద్యాలయం సోమనాథుని శిలా విగ్రహాన్ని ప్రదానం చేసింది. 2002 లో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 2015 నుంచి సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో ఏటా సోమనాథుని దీపారాధన జరుగుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలకుర్తి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్మృతి వనం నిర్మించి సమున్నత వేదిక మీద సోమనాథుని భారీ శిలా విగ్రహాన్ని కూర్చుండ బెట్టింది. 2023 సెప్టెంబర్ 4 న ప్రారంభ సంరంభం జరిగింది. ఆ తదుపరి ప్రభుత్వం పట్టింపు లేక సోమనాథుని స్మృతి వనం వెలవెల పోతున్నది.
కల్య క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మలచాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం పర్యాటక మంత్రి ఎచ్ కె పాటిల్ బృందాన్ని పాలకుర్తికి పంపాలని యోచిస్తున్నది. ఈ తరుణంలో పాలకుర్తిలోని సోమనాథుని స్మృతి వనం సక్రమ నిర్వహణతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయంకు పాల్కురికి సోమనాథుని పేరు పెట్టవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వంపై ఉన్నది.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

