సరూర్ నగర్‌లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కేసులో రాచకొండ పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. మరికొంత మందిని త్వరలో అదుపులోకి తీసుకోనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. కిడ్నీ మార్పిడి కేసులో దాతగా నశ్రీమ్ భాను, ఫిర్ధోస్ ఉండగా, తీసుకునే వారిగా రాజశేఖర్, ప్రభ ఉన్నారని వెల్లడించారు. ఆసుపత్రిలో తనిఖీల సమయంలో నలుగురిని గుర్తించినట్లు తెలిపారు. అలకనంద ఆసుపత్రిని 2022లో స్థాపించారని, ప్రధాన నిందితులు డాక్టర్లు అవినాష్, సుమంత్, ఇతర పార్టనర్స్ ప్రవీణ్, మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్లు రవీందర్, హరీష్ సాయిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడు పవన్ ఈ కేసులో కీలక పాత్ర పోషించాడని, అతను డాక్టర్లు, డోనర్ల మధ్య సంబంధాలు నెలకొల్పాడని తెలిపారు. వైద్య విద్యలో అనుభవం లేకుండా ఇతర దేశాల్లో మెడిసిన్ చేసి వచ్చిన నిందితులు, డబ్బుల కోసం అలకనంద ఆసుపత్రిని వేదికగా చేసుకుని కిడ్నీ మార్పిడి దందా నిర్వహించినట్లు గుర్తించారు. ఇంకా పరారీలో ఉన్న ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల డాక్టర్లు కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలిసిందని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

