నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజాపాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, విలేకరులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా, వేముల వీరేశం మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలతో పాటు నియోజకవర్గంలో గత ఏడాది చేసిన అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించినప్పటికీ, పట్టించుకోలేదని తెలిపారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వకు రూ. 219 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, వీటిని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే గ్రామీణ రోడ్లు & రుణమాఫీ ద్వారా 1238 కోట్ల నిధులు నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇందులో పంచాయతీ రాజ్ ద్వారా రూ. 53 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ. 103 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అట్లాగే నకిరేకల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రధాన వనరైన మూసీ నది ప్రక్షాళనపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రస్తుతానికి DPR (Detailed Project Report) తయారీలో ఉందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం మళ్లీ ప్రజా పాలనకు నాంది పలుకుతోందని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు.


