నల్లా నర్సింహులు వర్ధంతి నేడు
తెలంగాణ సాయుధ పోరాటం నాటి ఊచకోతకు కారణమైన రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీకి నామ మాత్రపు జైలు శిక్ష పడింది. లొంగిపోయి, రాజభరణం పొంది, రాజ ప్రముఖ్ గా నిజాం మిగిలిపోయాడు. పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పార్టీ నుంచి గెలిచిన వాళ్ళంతా బయట యధేచ్ఛగా తిరిగితే, పార్టీ నాయకత్వం నిర్దేశానుసారం పని చేసిన వాళ్ళు మాత్రం జైళ్ళల్లో మగ్గిపోయారు.
ఉరి శిక్ష పడి, ప్రపంచ ఆహాకారాల వల్ల అది రద్దయి, నిరపరాధిగా విడుదలైన నల్లా నర్సింహులు మాత్రం ఏ గుర్తింపూ లేకుండా మిగిలిపోయాడు. సాయుధ పోరాటం కొనసాగింపా? విరమణా? తేల్చుకోలేకపోయిన ఆనాటి కమ్యూనిస్టు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే బాగుండేది. కమ్యూనిస్టుల స్పూర్తిని భారత ప్రభుత్వం గుర్తించేది. యూనియన్ సేనల పై అపవాదు తప్పేది. నల్లా నర్సింహులు లాంటి వారికి ఇంకా గుర్తింపు వచ్చేది.
నల్లా నర్సింహులు చేసింది వ్యక్తులపై పోరాటం కాదు, వర్గ పోరాటం. ఆయన త్యాగాలు శ్లాఘనీయం. తన ప్రాణాలను ఫణంగా పెట్టి చేసిన తన పోరాట ప్రస్థానంలో ఏనాడూ నాటి విస్నూరు దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మహా పోరాట శక్తి అయిన నల్లా నర్సింహులు జయంతి, వర్ధంతిలను కూడా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే బాగుంటుంది.
గాంధీజీ, శాస్త్రీజీ నాటి దేశ దాస్యశృంఖలాలు తెంచడానికి ఉద్యమిస్తే, నర్సింహులు నాటి తెలంగాణ నిజాం నిరంకుశ, దేశ్ ముఖ్‌ల నుంచి ప్రజలను రక్షించడానికి ఉద్యమించాడు. వారిది శాంతియుత మార్గమైతే, నర్సింహులు అనివార్యంగా సాయుధ పంథాని అనుసరించాడు.
ఇదే పోరాటం మరెవ్వరు చేసినా, నర్సింహులు మరే సామాజిక వర్గానికి చెందిన వాడైనా, మరో దేశంలో చేసినా, అసాధారణ పేరు ప్రఖ్యాతులు వచ్చేవి. కానీ తన ప్రాణాలను లెక్క చేయని, నిస్వార్థ గెరిల్లా పోరాట యోధుడు నల్లా నర్సింహులుకు రావాల్సినంత గుర్తింపు రాలేదు.
అడుగు చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ప్రత్యేక వ్యాసం అడుగు ఎడిటోరియల్
స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనం ప్రక్రియ పూర్తికావచ్చింది. 1947 సెప్టెంబర్ 13న మొదలైన ఆపరేషన్ పోలో 5 రోజుల్లోనే విజయవంతమైంది. సెప్టెంబర్ 17న విలీనమైంది. 18న నిజాం లొంగిపోయాడు. అప్పటికి ముషీరాబాద్ జైల్లో ఉన్న 50 మంది ఉరిశిక్షితుల్లో 12 మందిని ప్రపంచానికి తెలియనీయకుండా ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక అమెరికన్ జర్నలిస్టు ద్వారా ‘టైమ్స్’ పత్రికలో ‘బాలుడికి ఉరిశిక్ష’ అనే సారాంశంతో వచ్చిన కథనం ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. సుప్రీం కోర్టులో అప్పీలుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ కేసుని వాదించడానికి లండన్ లో సుప్రసిద్ధ న్యాయవాది డి.ఎన్.ప్రిట్ ఢిల్లీకి వచ్చాడు. ఈ నాలుగు రోజుల వాదనలకు అప్పటి సోవియట్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు. ఆ 12 మందిలో ఒకడిగా, రేపు ఉరి తీయబడతాడనగా, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థల, భారత ట్రేడ్ యూనియన్ల ఆందోళనల ఫలితంగా ఉరితీతకు కేవలం 8 గంటల ముందు అప్పటి భారత ప్రభుత్వం నర్సింహులు ఉరి శిక్షను రద్దు చేసింది.
మరో కేసులో అరెస్టై నల్లగొండ జైలులో ఉన్న నల్లా నర్సింహులును చూడ్డానికి అపరేషన్ పోలో ఇన్‌చార్జీ, యూనియన్ సైనిక జనరల్ జె.ఎన్. (జయంతో నాథ్) చౌదరి వెళ్ళాడు. అప్పుడు ఆ జిల్లా ఎస్.పి. ధనరాజ్ నాయుడు సంకెళ్ళతో ఉన్న నల్లా నరసింహులును “టైగర్ ఆఫ్ తెలంగాణ” అంటూ పరిచయం చేశాడు. ఎందుకంటే ప్రజల్లో ఆయనకు ఉన్న పేరు అది. నాటి నిజాం రాజ్యానికి, రజాకార్లకు, దొరలు, జాగీర్దార్లకు ఆయనంటే హడల్ అని చెప్పాడు.
ఇదే సమయంలో తన కాళ్ళ సంకెళ్ళు తొలగించాలన్న నల్లా నర్సింహులు మాటను తిరస్కరించడంతో, తన లొంగుబాటు కోసం అరెస్టు చేసిన తన భార్య వజ్రమ్మను విడుదల చేయాలని కోరగా, తర్వాత కొంత కాలానికి విడుదల చేశారు.
మొదటి ఘటన బక్కపలచగా, చిన్నగా ఉండే నర్సింహులు ఓ బాలుడిని తలపిస్తే, రెండో సంఘటన ఆ బక్క పలచని వాడి బలాన్ని నిరూపించింది. మూడో ఘటన ఆయనే కాదు ఆయన కుటుంబం పడిన కష్టాలకు తార్కాణంగా నిలిచింది.
అక్టోబర్ 2వ తేదీన స్వాతంత్రోద్యమానికి సారథ్యం వహించిన మహాత్మాగాంధీ, దేశానికి రెండో ప్రధానిగా సేవలందించిన జై జైవాన్, జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రీలు జన్మించారు. సరిగ్గా ఇదే తేదీన నల్లా నరసింహులు పుట్టాడు. తెలంగాణ సాయుధ పోరాట నర ‘సింహం’ గా వెలుగొందాడు. విచిత్రంగా వీళ్ళంతా… నీతి, నిజాయితీకి నిలువుటద్దాలు. వ్యక్తిత్వంలో సమున్నతులు. ఉద్యమాల్లో ఉద్దండులు. పోరాటాల్లో రాటుదేలిన వీరులు. యాదృచ్చికంగా ఈ ముగ్గురు మహోన్నతులు ఒకే తేదీన పుట్టడం కాకతాలీయం కావచ్చు కానీ, దేశం గర్వించదగ్గ భరతమాత ముద్దు బిడ్డలు. ఈ ముగ్గురివి స్వాతంత్య్ర పోరాటాలే కానీ, దారులు వేరు. గాంధీజీ, శాస్త్రీజీ నాటి దేశ దాస్యశృంఖలాలు తెంచడానికి ఉద్యమాలు చేశారు. నర్సింహులు నాటి తెలంగాణ నిజాం నిరంకుశ, దేశ్ ముఖ్‌ల నుంచి ప్రజలను రక్షించడానికి ఉద్యమించాడు. ఆనాడు వారి దారి శాంతియుత మార్గమైతే, నర్సింహులు అనివార్యంగా సాయుధ పంథాని అనుసరించాడు.
ఇదే పోరాటం మరెవ్వరు చేసినా, నర్సింహులు మరే సామాజిక వర్గానికి చెందిన వాడైనా, మరో దేశంలో చేసినా, అసాధారణ పేరు ప్రఖ్యాతులు వచ్చేవి. కానీ తన ప్రాణాలను లెక్క చేయని, నిస్వార్థ గెరిల్లా పోరాట యోధుడు నల్లా నర్సింహులుకు రావాల్సినంత గుర్తింపు రాలేదు.
నల్లా నర్సింహులు 1926 అక్టోబర్ 2న ఇప్పటి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో జన్మించాడు. మామూలు పేద పద్మశాలి కటుంబం. చేనేత పని చేసి, ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. నాడు తన తండ్రికి జరిగిన అవమానంపై తిరగబడ్డ నర్సింహులు అనుకోకుండానే ఉద్యమ బాట పట్టాడు. రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభలో సభ్యత్వం తీసుకున్నాడు. తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య పేర్వారం జగన్నాథం 22-01-1989లో చేసిన ఇంటర్వ్యూలో నర్సింహులు చెప్పినట్లు… ‘‘ప్రజలను దోపిడీ, వెట్టి నుంచి విముక్తం కావించే శాంతియుత ఉద్యమాలపై దొరల గూండాల దాడులు, వారికి రక్షణగా అప్పటి పోలీసుల కేసులు, నిర్బంధాల నుంచి రహస్య జీవితాలు, సాయుధ పోరాటాలకు దారితీశాయి. నిజానికి సాయుధ పోరాటం పిలుపును కమ్యూనిస్టు పార్టీలు గానీ, పోరాట యోధులు కానీ ఇవ్వలేదు. ‘ఆపరేషన్ పోలో’ సమయంలోనే సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.’’ ఆ తర్వాత నర్సింహులు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో, కొంత ఊగిసలాట తర్వాత సీపీఐలో జీవితాంతం కొనసాగారు.
‘ఒకనాడు భూస్వామి రామచంద్రారెడ్డి తన విస్నూరు గ్రామంలో దారిలో పోతుండగా, గమనించక, పొరపాటున ఒక రైతు తన ఇంటిముందు అరుగుమీద కూర్చున్నాడు. దీంతో ఆ గ్రామంలోని ప్రజల ఇంటిముందరి అరుగులన్ని మూలమట్టంగా కూలగొట్టించాడు.’ ఇది నాటి దాష్టీకం.
నాటి ‘దొరసాని (విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ) దగ్గర పనిచేసే 20 మంది జీతగాళ్లతో సహా ఆ గ్రామంలో జీతగాళ్లందరిని సంఘటిత పర్చి ఒక రోజు సమ్మె జరిపించాడు. 3 రోజుల తర్వాత రైతులు సంప్రదింపులకు దిగారు. రైతులు ఇచ్చే రేటు తాను కూడా ఇస్తానని దొరసాని తన ఏజెంటును సంప్రదింపులకు పంపించింది. 3 కుంచాల జొన్నలకు బదులు నాలుగు కుంచాలకు నెలజీతం పెంచబడింది. తూమెడుకు బదులు ఇద్దుం ధాన్యం సంవత్సరానికి ‘భిక్షం’ పేర అదనంగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. సంవత్సరానికి 15 రోజులు సెలవు కూడా అంగీకరించారు. ఇది నర్సింహులు మొదటి విజయం.
ఆరత్వాత అనేక మలుపులు తిరిగిన ఉద్యమంతోపాటు నర్సింహులు పోరాట ప్రయాణం అనేకానేక మలుపులతోనే సాగింది. ఒక సందర్భంలో పోలీసులకు దొరికిన నల్లా నర్సింహులుకు నరకం చూపించారు. ‘భూస్వాములకు, పోలీసులకు వ్యతిరేకంగా అలజడి చేస్తారా? సాధారణ యువకుడవు నీవు చెప్పితే ఇన్ని వందల మంది ప్రజలు ఒక్కమాట మీద ఆగి, మా మీదికి రాకుండా చేయగలిగిన సత్తా ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పమని, బోర్లా పండబెట్టి ఒక జవాన్ నడుం మీద కూర్చోని అరికాళ్లు పైకి లేపి పట్టుకోగా, మరో జవాను కర్రతో అరికాళ్లపై కనీసం 100 దెబ్బలైనా కొట్టాడు. రక్తం ఎర్రగా కమిలి రెండు రోజులు లేవకుండా అడ్డం పడిపోయాను. పోలీసులు మాకు మూత్రం తాగించడం, వారి వృషణాలను నోటిలో చొప్పించడం లాంటి కిరాతకాలకు పాల్పడ్డారు.’ అని ఆయన చెప్పుకున్నారు.
తన ఉద్యమ పథంలో 122 దళాలలను, ఆత్మార్పణ గెరిల్లా సమూహాలనూ నిర్మించి, నాయకత్వం వహించి, అనేకసార్లు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, అప్పుడప్పుడు పట్టుబడి, నరకయాతన అనుభవించి, జైలులో పెట్టబడి, కొన్నిసార్లు జైలు నుంచి తప్పించుకుని, ఒకసారి కోర్టు నుంచి తప్పించుకుని, అనేక కేసుల్లో ఇరికించబడి, తన కేసులు తానే వాదించుకుని, కోర్టు హాలులో న్యాయమూర్తులకే కమ్యూనిస్టు పోరాట పంథాపై సుదీర్ఘ డాక్యుమెంట్లు సమర్పించి, మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడి, రద్దు చేయబడి అజేయంగా నిలిచిన నల్లా నరసింహులు పోరాట పటిమ, వాక్పటిమ అనన్య సామాన్యం. అనితర సాధ్యం.
‘పోరాటం ముగిసిన తర్వాత’ ఆయన మీద పడిన మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు రద్దయినాక, సుదీర్ఘ జైలు జీవితం అనంతరం 1959లో జైలు నుంచి విడుదలైనారు. 1987లో తెలంగాణ సాయుధ పోరాటం 40వ వార్షికోత్సవం సందర్భంగా సాయుధ పోరాట యోధులు తమ అనుభవాలు నివేదించాలన్న కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు నివేదిక బదులు నల్లా నర్సింహులు, ‘తెలంగాణ సాయుధ పోరాటం: నా అనుభవాలు’ అనే పుస్తకమే రాశారు. 1989లో ప్రచురితమైంది.
నల్లా నర్సింహులు పోరాటంలో ఉన్నందు వల్ల ఆయన కుటుంబం, ఆయన బంధు వర్గం కూడా ఇబ్బందుల పాలైంది. వేధింపులకు తాళలేక, ఆయనతోపాటు ఆయన కుటుంబం, బంధువులు కూడా పోరాటంలోకి దిగారు. అజ్ఞాత వాసం, వన వాసం చేశారు. నల్లమల అడవిలోనే నల్లా నర్సింహులు భార్య వజ్రమ్మ ఒక బిడ్డ అరుణకు జన్మనిచ్చింది. విడుదల తర్వాత ఆనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ, నరసింహులు నవంబర్ 5, 1993న పరమపదించారు.
నాటి ఊచకోతకు కారణమైన రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీకి నామ మాత్రపు జైలు శిక్ష పడింది. కానీ, భారత ప్రభుత్వంతో యధాతథ స్థితిని కొనసాగిస్తూనే, అవకాశం వస్తే స్వతంత్ర దేశంగా, లేదంటే సరెండర్ కావడానికి నిర్ణయించుకుని, తర్వాత లొంగిపోయి, రాజభరణం పొంది, రాజ ప్రముఖ్ గా నిజాం మిగిలిపోయాడు. పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి, పార్టీ నుంచి గెలిచిన వాళ్ళంతా ప్రజాస్వామికంగా బయట యధేచ్ఛగా తిరిగితే, పార్టీ నాయకత్వం నిర్దేశానుసారం పని చేసిన వాళ్ళు మాత్రం జైళ్ళల్లో మగ్గిపోయారు.
ఉరి శిక్ష పడి, ప్రపంచ ఆహాకారాల వల్ల అది రద్దయి, నిరపరాధిగా విడుదలైన నల్లా నర్సింహులు మాత్రం ఏ గుర్తింపూ లేకుండా మిగిలిపోయాడు. సాయుధ పోరాటం కొనసాగింపా? విరమణా? తేల్చుకోలేకపోయిన ఆనాటి కమ్యూనిస్టు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే బాగుండేది. కమ్యూనిస్టుల స్పూర్తిని భారత ప్రభుత్వం గుర్తించేది. యూనియన్ సేనల పై అపవాదు తప్పేది. నల్లా నర్సింహులు లాంటి వారికి ఇంకా గుర్తింపు వచ్చేది.
నల్లా నర్సింహులు చేసింది వ్యక్తులపై పోరాటం కాదు, వర్గ పోరాటం. ఆయన త్యాగాలు శ్లాఘనీయం. తన ప్రాణాలను ఫణంగా పెట్టి చేసిన తన పోరాట ప్రస్థానంలో ఏనాడూ నాటి విస్నూరు దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మహా పోరాట శక్తి అయిన నల్లా నర్సింహులు జయంతి, వర్ధంతిలను కూడా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే బాగుంటుంది. చిరస్థాయిగా నిలిచేలా ఆయన పేరును ఏదైనా ప్రభుత్వ సంస్థలకు పెట్టడం, ఆయన స్మాకరకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, అవార్డులు పెట్టడం, ఆయన విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, పాఠ్యాంశంగా ఆయన జీవితాన్ని భావితరాలకు అందించడం వంటివి చేయాలి. తెలంగాణ సాయుధ పోరాట నర ‘సింహం’… నల్లా నర్సింహులుకు నిజంగా మనమిచ్చే ఘనమైన నివాళి ఇదే!.


