
‘సంతనాడు ఊరి డొంకల్ల బాటల్ల జంటలేమో కొన్ని జత కూడుకుంటాయి. హద్దులు, అదుపులు అన్ని గాలికొదిలి వలసినా మనసులు ఒక్కటైపోతాయి. దూరమయ్యిన గానీ ప్రేమ మిగిలినోళ్ళు వార వారం సంత పేరుతో కలిసేరు’ అని వలసిన మనసుల ఊసులను గొప్పగ చెప్పిండు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. ఆకలి రుసి ఎరగదు, నిద్ర సుకమెరగదు గద. గట్లనే గీ బుద్దైనోళ్ళు సమయం సందర్బం సూసుకోరు. గింత సాటైతే సాలనుకుంటరు!? గిదంత గీ ఊరు ఊసులె గనీ, గా పట్నపోల్ల సంగతులు యేరే తీర్గ ఉంటయి. ఎట్లంటరా?
ఓ రైలు పోతాంది. సీటు దొరకనోడు ఒకడు గదే గా పాయఖానా కాడ నిలబడ్డడు. అంతలోనే పాంటు, సేతుల బనీను యేసుకున్న ఓ పడుసుది గా పాయఖానాలోకి పోయింది. కా సేపటికే గామె అండ్లుండంగనే మరోకడు గండ్లకే పోయిండు. గిది జూసిన గా సోర పోరనికి తిక్కరేగినట్లుంది. ఇగ సెల్లు ఫోనుతో గా వాల్లు.. ముందుగ పోరడు, తర్వాత పోరి బయిటికి వత్తాంటే, యీడియో తీసిండు. ఉబ్బు అబ్బడు కొట్టినట్లు ఆడికి ఉబ్బు ఆగలే. ఎక్స్ కాతాల పెట్టిండు. ఇగ దాన్ని సూసినోడు సూసినట్లే ఇంకోనికి పంపిండు. ఇగేమైతది. గది మొత్తం నెట్టింట టాంటాం అయింది. ఇగ దాని మీద ఒకటే ముచ్చట పెట్టబట్టిండ్రు. ‘గిదేంది గివేమన్న రైలు డబ్బలా? ఓయో రూంలా?’ అని ఒకడు, ‘బాత్ రూం లా? బెడ్ రూం లా?’ అని ఇంకొకడు. ‘ఏ పోనీరా బయ్ ఆళ్ళు ఆలుమొగలే గావచ్చని’ ఇంకొకడు. ‘ఎక్కడ సందుగాక, గా సందుల్నే సదురుకున్నరు.. మీ లొల్లేందరా? ఒదిలేయిండ్రి!’ అని యేరే ఒకడు అనబట్టిండ్రు. గిసొంటియి సూసిసూడనట్లు పోవాలె. లేదంటే ఎచ్చరించాలె గనీ, గీ యీడియో తీసుడేంది. అందరికీ పెట్టుండేది? గింత లొల్లేంది? ఇగ ఇప్పటిదాకా ‘గీ రైలు డబ్బలల్ల పోరగాల్లు రీల్లు తీసి సూపిస్తుండే.. గవాట్ని నానా తిప్పలుపడి బంద్ చేయిస్తుంటిమి… గిదేందిర బయ్ గీవీళ్ళు గీ సిన్మానే సూపించ బట్టె!’ అని గా రైల్లు నడిపేటోళ్ళు పరేషాన్ అయితుండ్రట. పయానం సేసేటప్పుడు జెర పైలం!

