MUNUGODU|మునుగోడుకి అన్యాయం చేయొద్దు
నాకు పదవి కన్నా మునుగోడు DEVELOPMEMT|అభివృద్దే ముఖ్యం
-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఎక్కువ కృషి చేస్తున్నానని, ఈ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా కోరారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే, అది తనకు జరిగిన అన్యాయంగా భావిస్తానని, తనకు అన్యాయం జరిగినా… పర్వాలేదని కానీ ప్రజల అభివృద్ధిని ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి చెప్పినట్లే ప్రస్తుత ప్రభుత్వానికీ ఇదే అభ్యర్థన చేస్తున్నానని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయాలని, ఆలస్యం చేయకుండా వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మాటిచ్చారు కాబట్టి ఇవ్వండి, కానీ అప్పటివరకు మునుగోడు అభివృద్ధి పనుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం సమీకరణాలు కుదరటం లేదనే కారణం చూపించడం తగదని, ఎవరు అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.
తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను, అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నదమ్ములు అనే విషయం అందరికీ తెలియదా… అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి మంత్రి పదవిపై హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ విషయం తెలియదా… అన్నారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు ఇప్పుడు పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.
రాజకీయ సమీకరణల పరంగా ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా ముగ్గురు మంత్రులు ఉన్నారని, నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ముగ్గురు మంత్రులు ఉండడంలో తప్పేమీ లేదని అన్నారు. తాను, తన అన్న ఇద్దరూ సమర్థులం, గట్టి నాయకులమని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ఆలస్యమైనా తాను ఓపికగా వేచి చూస్తానని, కానీ మునుగోడు ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోల్చితే మునుగోడు వెనుకబడిందని, ఈ పరిస్థితిని మార్చడం తన లక్ష్యమని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు న్యాయం జరగాలని, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేద ప్రజలపై భారం మోపకూడదని ఆయన సూచించారు. పేదవాళ్లకండగా ఉండటమే నా ధ్యేయం అని చెప్పారు. తనకు పదవి ఏదైనా భగవంతుడు ఇస్తే అది మునుగోడు ప్రజల కోసమే ఉపయోగపడుతుందని, వ్యక్తిగత లాభం కోసం కాదని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య, విద్యా రంగాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమమే తన రాజకీయ జీవనోపాధి మూలం అని, అందుకోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

