టీం ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ గోవర్ (Devid Gover) ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ ఫిట్నెస్ కి ఫిదా అయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో భారత జట్టు తరుపున సిరాజ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ని టీమిండియా 2-2తో సమం చేయడంలో సిరాజ్ పాత్ర కీలకం. మొత్తంగా 23 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా సిరాజు నిలిచాడు. అలాగే రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతడు ఏకంగా 185.3 ఓవర్లు (1113 బంతులు) బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. ముఖ్యంగా ఓవల్ టెస్ట్ లో అద్భుతంగా రాణించాడు. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను 367 పరుగులకే కట్టడి చేయడంలో సిరాజ్ పాత్ర అనన్య సామాన్యం. దీంతో ఈ మ్యాచ్ టీమిండియా ఆరు పరుగులు తేడాతో గెలిచింది. అలాగే ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఐదుకు ఐదు మ్యాచ్ లు ఆడిన ఏకైక బౌలర్ గా సిరాజ్ నిలిచాడు.
ఈ విషయమై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ గోవర్ సిరాజ్ ను కొనియాడాడు. “నేను సిరాజ్ ఏం తీసుకుంటాడో? అంటే అతడు ఏం తింటాడో? ఏం తాగుతాడో? తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాటిని ఇంగ్లాండ్ బౌలర్లకి అందించాలని అనుకుంటున్నాను. అతడు ఈ సిరీస్ లో విశ్రాంతి తీసుకోకుండా ఐదు టెస్టు మ్యాచిల్లోనూ ఆడాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో 30 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. అతను ఏమాత్రం తగ్గలేదు. అలసిపోయినట్టు కనిపించలేదు.” అని గోవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
అలాగే సిరాజ్ ఫిట్ నెస్ ను కూడా ప్రశంసించాడు గోవర్. “గెలవాలనే దృఢ సంకల్పం, ఫిట్నెస్ విషయంలో సిరాజ్ మేటిగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ దళం మాత్రం కొన్ని ఏళ్లుగా ఫిట్ నెస్ తో బాధపడుతుంది. నిజంగా అద్భుతం.”అని గోవర్ విశ్లేషించాడు.

