అంతా ఆ తాను ముక్కలే!
అందరూ గురువింద గింజలే!!
అరాచకమైన రాజకీయం|POLITICS
ఉత్సవ విగ్రహాలుగా రాజ్యాంగ పదవులు?
SPEAKERS|స్పీకర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండగలరా?
ఉంటే, వాళ్ళ POSTS|పదవులు భద్రమేనా?
ఇటీవలి ఉప రాష్ట్రపతి ఉదంతం తేల్చిందేంటి?
రాజ్యాంగ పదవులకు SAVAL|సవాల్ గా రాజకీయం!
స్వతంత్ర భారత రాజకీయమంతా ఫిరాయింపుల పర్వమే!
నేతల పార్టీ ఫిరాయింపులపై ‘అడుగు’ ప్రత్యేక కథనం
‘ఎక్కడో అక్కడ.. ఒకరిద్దరు మినహా అంతా ఆ తాను ముక్కలే! అందరూ గురువింద గింజలే!! అప్పుడో ఇప్పుడో ఎప్పుడో జంప్ జిలానీలే! అవసరాలు, సమయానుకూలలను బట్టి తప్ప, మిగతా సందర్భాల్లో ఎవరికి వారే యమునా తీరే! అవసరాన్ని బట్టి ఏమైనా చేస్తారు. ఎంతకైనా దిగజారుతారు. మరెంతకైనా తెగిస్తారు. కొద్ది అటు ఇటుగా రాజకీయ నేతలంతా ఒక్కటే!’ ఇది సగటు మనిషి అభిప్రాయం. కానీ, ఇందుకు భిన్నంగా నేతలు మనకు కనిపిస్తున్నారా? ఇప్పుడు నేతలు ఎదుటపడితే, మీరు ఆ పార్టీలోనే ఉన్నారా? లేక ఏ పార్టీలో ఉన్నారు? అనే ప్రశ్నించే పరిస్థితులు దాపురించాయి. ఎవ్వరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తేలియని అయోమయం నెలకొంది. నేతల పార్టీ ఫిరాయింపుల వ్యవహార శైలి వల్లే ‘గయా రాం..ఆయా రాం’ అనే నానుడి స్థిరపడి వర్ధిల్లుతున్నది. అటుఇటుగా మొదటి 20 ఏళ్ళు మినహా, స్వతంత్ర భారత రాజకీయ చరిత్రంతా చీలికలు, పీలికలు, పేలికలై, ‘ఫిరాయింపుల పర్వం’గానే కనిపిస్తుంది. అలాంటి వారే మన పాలకులు, ఏలికలు కావడమేగాక, మన, మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పురోగతికాములు కావడం, గోతులు తవ్వే వాళ్ళే మనకు నీతులు బోధిస్తుండటం విధి వైచిత్రం! ఫిరాయింపుల చరిత్రపై ‘అడుగు’ అందిస్తోన్న ప్రత్యేకం.
హైదరాబాద్, జులై 31 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
భారత రాజకీయ చరిత్రలో 1960వ దశకం నుండి సంకీర్ణ ప్రభుత్వాల హయాం మొదలయ్యాక, ‘ఆయా రాం గయా రాంలదే హవా!’ నడుస్తోంది. 1967లో హర్యానాలోని హసన్‌పూర్ నియోజకవర్గం (ఇప్పుడు హోడల్) నుండి గయా లాల్ స్వతంత్ర శాసనసభ సభ్యుడిగా గెలిచి, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. ఆ తర్వాత 15 రోజుల్లో మూడుసార్లు పార్టీలు మార్చినప్పుడు ఈ పదం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ నానుడిగా మిగిలిపోయింది. గయా లాల్ మొదట కాంగ్రెస్ నుండి యునైటెడ్ ఫ్రంట్‌కు, తిరిగి కాంగ్రెస్ కి మారాడు. ఆపై చివరిసారిగా యునైటెడ్ ఫ్రంట్‌లోకి ఫిరాయించాడు. యునైటెడ్ ఫ్రంట్‌ను విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరినప్పుడు, గయా లాల్‌ను కాంగ్రెస్ లోకి ఫిరాయించడానికి కారణమైన అప్పటి కాంగ్రెస్ నేత రావు బీరేంద్ర సింగ్, గయా లాల్‌ను చండీగఢ్‌లో విలేకరుల సమావేశానికి తీసుకువచ్చి “గయా రాం! ఇప్పుడు ఆయా రాం!!” అని చమత్కరించారు. దీని ఫలితంగా గణనీయమైన గందరగోళం ఏర్పడింది. చివరికి హర్యానా శాసనసభ రద్దై, రాష్ట్రపతి పాలనకు దారి తీసింది.
1967, 1971 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన 4వేల మంది శాసన సభ్యులలో 50 శాతం మంది పార్టీ ఫిరాయించారు. ఇది దేశంలో రాజకీయ గందరగోళానికి దారితీసింది.
1977–79లలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని మొట్టమొదటి జాతీయ కాంగ్రెసేతర ప్రభుత్వం, 76 మంది పార్లమెంటేరియన్ల ఫిరాయింపు కారణంగా అధికారం కోల్పోయింది.
1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి టీడీపీ సీఎం ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ రామ్ లాల్ చర్యల కారణంగా, ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. అయితే నెల రోజుల్లోనే బల నిరూపణ నెగ్గి తిరిగి సీఎం అయ్యారు.
1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఫిరాయింపులను నివారించడానికి 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌గా చేర్చింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా భారత రాజ్యాంగం లోని 52వ సవరణ పార్లమెంటులో రాజకీయ నాయకులు పార్టీలు మారే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారకుండా నిరోధించడానికే రాజ్యాంగాన్ని సవరించారు.
అయితే రాజీవ్ హత్యానంతరం ప్రధాని అయిన పీవీ నర్సింహారావు ప్రభుత్వం జూలై 1993లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో తనకు ఓటు వేయడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు ముడుపులు అందించారని ఆరోపణలు వచ్చాయి. పీవీ తన పదవీ కాలం తర్వాత ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ళ కఠిన జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పీల్ చేసుకోగా, 2002లో ఢిల్లీ హైకోర్టు దిగువ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది.
ఇక బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, రాజనీతిజ్ఞుడు వాజ్ పేయి మొదట 1996లో 13 రోజులు, తర్వాత 1998 నుండి 1999 వరకు 13 నెలలు, ఆపై 2004లో పూర్తి పదవీకాలం పాటు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన పూర్తి కాలం పనిచేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నిలిచారు. అయితే 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ నుంచి వాజపేయి భారత 10వ ప్రధాని అయ్యాడు. కానీ బీజేపీ ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 1999 మధ్యలోనే జయలలిత మద్దతు ఉప సంహరించుకోవడంతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది.
2003లో పార్లమెంటు భారత రాజ్యాంగానికి 91వ సవరణను ఆమోదించింది. ఇది ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించడానికి, కొంతకాలం పాటు వారిని మంత్రులుగా నియమించకుండా నిషేధించడానికి నిబంధనలను జోడించడం ద్వారా చట్టాన్ని బలోపేతం చేసింది.
అయినప్పటీకీ ఆతర్వాత కూడా అనేక సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతూనే ఉన్నాయి.
రాజ్యాంగం, చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే సున్నితమైన తేడాతోనే రాజకీయ నాయకులు దర్జాగా పార్టీలు మారుతున్నారు. అంతెందుకు తనదాకా వస్తేగానీ, అన్న విధంగా ఇవ్వాళ పార్టీల ఫిరాయింపులపై కోర్టుకు వెళ్ళిన బీఆర్ఎస్, గడచిన పదేళ్ళ ప్రభుత్వ కాలంలో చేసిందేంటి? టీడీపీ ఎల్పీనే విలీనం చేసుకున్నది నిజం కాదా? బహుషా ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉండి ఉంటారు. అలాగే కాంగ్రెస్ ఎల్పీని నిర్వీర్యం చేసింది బహుషా ఆ పార్టీకి గుర్తుండే ఉంటుంది. ఉన్న ఒక్క సీపీఎం ఎమ్మెల్యే కాదంటే, సీపీఐ ఎమ్మెల్యేను కూడా పార్టీలో కలుపుకోలేదా? అప్పట్లో ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా మొదటి విడత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి మిగతా పార్టీల వారు తమ పార్టీలో కలుస్తున్నారన్నది కల్వకుంట్ల కుటుంబమే కాదా? రెండో విడత పురోగతికి ఆకర్షితులయ్యారని చెప్పిందీ అబద్ధం కాదు కదా? ఆనాడు కేసీఆర్ విసిరిన ఫిరాయింపుల వలకు విలవిలలాడిన పార్టీలు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ వంటివి లేవా?
అంతకుముందు వైఎస్ హయాంలోనూ అప్పటి టీఆర్ఎస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకోలేదా? ఆనాడు విలవిలలాడిని టీఆర్ఎస్ కు ఉద్యమకారులు అండగా నిలబడ్డారు. పార్టీల మారిన వారిని ఎక్కడికక్కడ నిలదీశారు.
అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ వలకు చిక్కని రాజకీయ నాయకుడెవ్వరున్నారు? రాజకీయ పార్టీలెక్కడ ఉన్నాయి? ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోయి, ఆయా చోట్ల కమలం వికసించలేదు? ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే. అయితే విచిత్రంగా ఈ గురువింద పార్టీలే, గురువింద గింజ నేతలే తిరిగి పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడటం సగటు మనిషికి వెగటు పుట్టిస్తున్నాయి. ఒకరిద్దరు నేతలు, పొరపాటుల మిగిలి ఉంటే ఒకటి రెండు పార్టీలు మినహా, సో కాల్డ్ అన్ని పార్టీలు, ఆయా పార్టీల్లోని చాలా మంది నేతలూ జంప్ జలానీలే! అలాంటి వాళ్ళే ఇవ్వాళ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగానే ఉంటుంది.
రాజకీయ పార్టీల్లో, నేతల్లో సచ్చీలతను, నీతి నిజాయితీలను, నైతిక విలువలను వెతుక్కోవడమంటే గొంగట్లో కూర్చుని బొచ్చేరుకోడమే!
నిజానికి స్పీకర్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటున్నారా? ఉత్సవ విగ్రహంగా మిగిలిపోతున్నారా? అత్యున్నత రాజ్యంగ స్థానాలను కూడా రాజకీయ పార్టీ నేతలే, పార్టీల లెజిస్లేచర్ నాయకులే నిరంకుశంగా నిర్దేశిస్తున్నారు. తమ చెప్పుచేతల్లో ఉండేవాళ్ళనే కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నారు. అంతా తమ కనుసన్నల్లోనే జరిగే విధంగా చూసుకుంటున్నారు. అంతకు మించి ప్రవర్తిస్తే ఏమవుతుందో మనం నిన్ననే రాజ్యసభలో చూశాం. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్ ఖడ్ కాస్త స్వతంత్రంగా వ్యవహరించబోయి, ఉన్న పదవిని స్వయంగా ఊడగొట్టుకున్నారు. పాపం! ప్రభుత్వ కోపానికి బలైపోయారని మీడియా కోడై కూసింది. ఆయన పదవి మాత్రం తిరిగి రాలే.
ఈ నేపథ్యంలో నిజంగానే స్పీకర్ రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు కట్టుబడి నిర్ణయం తీసుకోగలరా? ఆ వాతావరణం మన భారత రాజకీయాల్లో ఉందా? తీసుకుంటే ఏం జరుగుతుందో? కళ్ళ ముందే కనిపిస్తున్నది. చట్టసభల్లో సుప్రీం జోక్యం అత్యంత పరిమితం. అందుకే సీజే ధర్మాసనం తెలంగాణ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని, శాసించలేమని, పార్లమెంటు నిర్ణయించాలని కూడా తీర్పు చెప్పింది. అయితే, అధికారంలో ఉండే పార్టీలకు, నేతలకు ఫిరాయింపుల చట్టంలోలా అక్కడక్కడా లోపాలు లేదా అస్పష్టత అవసరం. వాటి మనుగడకు ఆ లొసుగులే శ్రీరామ రక్ష. అందుకే పార్టీలేవైనా వాదిస్తాయే తప్ప, దేన్నీ సాధించాలనుకోవు. సవాళ్ళు మాత్రం విసురుకుంటాయి. అవి ప్రజలకు కూడా సవాల్ గానే మిగిలిపోతున్నాయి.

