Womens|మహిళలపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువ
ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో మాట్లాడిన మహారాజ్, ఈ రోజుల్లో వర్జిన్ అమ్మాయిలు చాలా అరుదు అని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో 100 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే పవిత్రంగా ఉంటారు. మిగతావారు బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరుగుతూ బిజీగా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇకపోతే పదిమంది అబ్బాయిలతో తిరిగిన అమ్మాయి ఎలా మంచి కోడలు అవుతుందని, ఆమె పతివ్రత ఎలా అవుతుందని ప్రశ్నించారు. అదే విధంగా నాలుగైదు అమ్మాయిలతో తిరిగిన అబ్బాయి కూడా మంచి భర్త కాబోదని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య సంస్కృతుల ప్రభావంతో భారతీయ సంప్రదాయాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సాంప్రదాయవాద ఆలోచనలకు ప్రతీకగా కనిపించినా, సమకాలీన సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రేమానంద్ మహారాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా మహారాజ్ వ్యాఖ్యలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీశాయి.

