భారీగా తరలి రానున్న అభిమానులు
తగిన ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు
జనగామ/పాలకుర్తి, జూలై 25(అడుగు న్యూస్):
ఇటీవల అకాల మరణం చెందిన PROFESSOR| ప్రొఫెసర్ PRABHANJAN KUMAR YADAV| ప్రభంజన్ కుమార్ యాదవ్ దశదిన కర్మను ఆయన సొంత ఊరు జనగామ జిల్లా, పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఆయనకిష్టమైన సత్యశోధక విద్యా పీఠం ఆవరణలో ఘనంగా సంస్మరణసభగా నిర్వహించేందు కు ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సభకు తరలి వచ్చే వేలాది మందికి భోజన వసతి కల్పించాలని సంకల్పించారు. అవసరమైన ఫ్లెక్సీలు, వేదిక, మైకు, షామియానా, కుర్చీలు వంటివి సమకూరుస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆయన సతీమణి మంచిర్యాల మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖా ప్రభంజన్. తల్లి కొమురమ్మ, తమ్ముళ్ళు రమేశ్ తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

HYDERABAD| హైదరాబాద్ లో తన నివాసంలో ఈ నెల 16న తెల్లవారు జామున 06:00 గంటలకు ప్రముఖ సామాజిక బహుజన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త, సామాజిక తెలంగాణ సాధన సమితి చైర్మెన్ ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి మృతదేహాన్ని స్వగ్రామమైన గూడూరుకు తీసుకువచ్చి ఘనంగా అంతిమయాత్ర నిర్వహించి, వైద్య విద్యార్థుల ప్రయోగ పరీక్షల నిమిత్తం జనగామ మెడికల్ కాలేజీకి వారి దేహాన్ని అందించారు. ప్రభంజన్ ఐఐఎస్ అధికారిగా, ప్రొఫెసర్ గా, బహుజన ఉద్యమ రూపకర్తగా, అనేక ఉద్యమాల్లో పాల్గొనడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి కూడా మిత్రులు, ఉద్యమకారులు, అభిమానులు, ఊహించని విధంగా భారీగా తరలివచ్చే అవకాశం వుంది. ఆరోజు నుండి ఇంకా నిత్యం వివిధ ప్రాంతాల నుండి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ పార్టీల నాయకులు గూడూరు గ్రామానికి వచ్చి వారి సతీమణి, డా. రేఖ, తల్లి కొమురమ్మ, వారి సోదరులు రమేష్ తదితర కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేన్నారు. ఈ పరిస్థితులను బట్టి వేయి మందికి పైగా మిత్రులు, అభిమానులు ఈ రోజు నిర్వహించే దశదినకర్మ, సంస్మరణ సభకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ అంచనాకు వచ్చారు. సంస్మరణ సభకు వచ్చే అభిమానులకు, మిత్రులకు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్న ప్రభంజన్ మిత్రులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ చిన్నప్పటి నుంచే తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాలైన పేద ప్రజల పక్షాన రచనలు చేస్తూ, ఉద్యమాలు నిర్మిస్తూ, పోరాటాలు చేస్తూ బహుజన ఉద్యమ నేతగా ఎదిగారు. బహుజన రాజ్యాధికారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. మండల్ టీవీని స్థాపించారు. జర్నలిజం ప్రొఫెసర్ గా, విద్యావేత్తగా, సామాజిక శాస్త్రవేత్తగా ఆయన అనేక మంది శిష్యులను సంపాదించుకున్నారు. ఉద్యమాల్లోనూ అయనకు అనేక మంది పాలోవర్లు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం మొదటి బ్యాచ్ వద్దే నిలిచిపోగా, దాన్ని పునరుద్ధరించడంతోపాటు ఆశాఖ ఏర్పాటులో ప్రొఫెసర్ ప్రభంజన్ శ్రమ మరువలేనిది. ఆ సమయంలో ఆయన వెంట డా. మార్గం లక్ష్మీనారాయణ కూడా వెంట ఉన్నారు. ఆతర్వాత డా. మార్గం, డా. రాపోలు సత్యనారాయణ కూడా బీసీజే విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ప్రొ.ప్రభంజన్, డా.మార్గం బీసీజే కోర్సు రైటర్లుగా కూడా వ్యవహరించారు. పలు సెమినార్లను నిర్వహించారు. ఆ తర్వాత ప్రభంజన్ తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజం శాఖ ఏర్పాటులో కీలకంగా పని చేశారు. జర్నలిస్టుగా, ఐఐఎస్ అధికారిగా, కేంద్ర ప్రణాళికశాఖలో, ఆల్ ఇండియా రేడియోలో, యూనివర్సిటీల్లో పలు హోదాల్లో ప్రభంజన్ పని చేశారు. దళిత, బహుజన ఉద్యమాల రూపకల్పనలో భాగంగా ఆయన అనేక వేదికల ఏర్పాటు చేశారు. ఆయా వేదికల్లో ఉపన్యాసాలిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను రూపొందించే పనిలో ఉండగానే ఆయనను అకాల మరణం కబళించింది. ఆయన మృతి ఆయన కుటుంబంతోపాటు, దళిత బహుజనుల ఉద్యమానికి తీరని లోటును కలిగించింది. ఆయన అభిమానులను, మిత్రులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఆయనకు వివిధ రాష్ట్రాల్లో శిష్యులు, మిత్రులు, అభిమానులు ఉన్నారు. ఆయన మరణాన్ని ఆయా రాష్ట్రాల బీసీ ఉద్యమ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది. అందుకే ఆయన సంస్కరణ సభకు తరలివచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సంస్మరణ సభకు ఎంతమంది తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.
బహుజన ఉద్యమ నేతల మృతికి దశదినకర్మ రోజును సంస్మరణ దినంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రజా పాటల గీతాలాపనతో, ఘనంగా నివాళులర్పిస్తూ, మృతి చెందిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం రివాజుగా మారింది. బహుజన ఉద్యమాల నేతలు, అభిమానులు హాజరై ఈ కార్యక్రమాలను నిర్వహించేవారు. అదే విధంగాసంస్మరణ సభను మాత్రం విజయవంతం చేయాలనే పనిలో ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు, అభిమానులు, నిమగ్నమయ్యారు.

