Praja Bhavan| ప్రజా భవన్ లో CM| సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి POWER POINT PRESENTATION| పవర్‌పాయింట్ ప్రసంగం
HYDERABAD| హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి హక్కుల అంశంపై కేంద్ర ప్రభుత్వం, గత పాలకులపై విరుచుకుపడ్డారు. నీళ్లు, నాగరికత ఎంత అనుబంధంగా ఉన్నాయో, అదే స్థాయిలో తెలంగాణ ప్రజల జీవితాల్లో నీటికి ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత నీటి విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వపు తప్పిదాలు తెలంగాణ రైతులను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు.
నీటి కేటాయింపుల విషయంలో రాజకీయ అహంకారం, నిర్లక్ష్యంతో కేసీఆర్, హరీష్ రావు పొరపాట్లు చేశారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 జూన్ 18న జరిగిన రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణకు దారుణమైన నష్టాన్ని కలిగించేలా కెసిఆర్, హరీష్ సంతకాలు పెట్టారని, ఆ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన కల్వకుర్తి, పాలమూరు, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని, అందుకే 299 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోలేకపోయిందని తెలిపారు.
తెలంగాణకు గోదావరి బేసిన్‌లో 968 టీఎంసీలను కేటాయించినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును మార్చి రీ ఇంజనీరింగ్ పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేసి కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించడం వారికి రైతులపై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుందన్నారు. అదే విధంగా బనకచర్లలో తాము వాస్తవాలను వెల్లడించగా, బీఆర్ఎస్ నేతలు కుట్ర రాజకీయాలతో దాన్ని ఏదో చేశారని, చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పెద్దమ్మ కోటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేసీఆర్, అదే సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనలను కొనసాగించినందుకే ఈ నీటి వివాదం ఇంత తీవ్రమైందని అన్నారు. గోదావరి మిగులు జలాలపై లెక్క తేలాలంటే ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడం అవసరమని, తర్వాతే మిగులు, వరద జలాలపై చర్చ జరగాలని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదని, స్పష్టం చేసిన సీఎం, నాకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాయలసీమ రొయ్యల పులుసుతో పని లేదు. మేము కేవలం తెలంగాణ ప్రజల నీటి హక్కుల కోసమే పోరాడతామన్నారు. న్యాయసమ్మతంగా ఏపీతో కలిసి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తమ ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత వహించకుండా, లిటిగేషన్ల ద్వారా సమస్యను మరింత క్లిష్టం చేస్తోందని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి వంటి బీజేపీ కేంద్ర మంత్రులు నీటి వివాదంలో మాట్లాడాల్సిన అవసరం ఉందని, కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అనుమానాలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
బీజేపీకి ఇచ్చిన ఎంపీ సీట్ల ఆధారంగా రాష్ట్ర హక్కులను కాలరాయడం న్యాయమా? అని ప్రశ్నించారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచందర్ రావును ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆయనకు ప్రధానమైన సమస్య గోదావరి జలాలే అని, దీనిపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లే విధంగా తొలి కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ మంత్రులు, అధికారులు కావాల్సిన డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ సమస్యను బీఆర్ఎస్ రాజకీయంగా, బీజేపీ వ్యూహాత్మక ప్రయోజనంగా వాడుకుంటున్నాయని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రజలకు అసలైన నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ నిజాలు వివరించకపోతే, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు చెప్పే అబద్ధాలే నిజాలుగా ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్నారు.
ఇక అసెంబ్లీలో రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దామని, వచ్చే దమ్ముందా… అని సీఎం హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఒక రోజు కృష్ణా బేసిన్, మరొక రోజు గోదావరి బేసిన్ పై చర్చ పెడదాం అన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ రాసి ఈ చర్చల ఏర్పాటుకు హరీష్ రావు ముందుకు రావాలని కోరారు. చివరగా, ఈ సమావేశం కేసీఆర్‌తో పంచాయతీ కోసం కాదు, తెలంగాణ ప్రజల శాశ్వత నీటి హక్కుల సాధన కోసం అని రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్ని రకాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం మీద, బీజేపీ మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఇదేనని సీఎం స్పష్టం చేశారు.

