సొంత పార్టీ MLA|ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్!
సిగ్గుంటే మళ్ళీ పోటీ చేసి గెలవాలని సవాల్!
ఫస్ట్ మీ డిపార్ట్మెంట్ కోవర్టుల పని పట్టమని సీపీకి అడ్వైజ్!
CONGRESS|కాంగ్రెస్ లో ఎన్ కౌంటర్ల స్పెషలిస్ట్ తిష్ట!
75ఏళ్ల దరిద్రుడు, పరకాల ఎమ్మెల్యే అంటూ హాట్ కామెంట్స్!
కాంగ్రెస్ ను విమర్శిస్తూ KCR|కేసీఆర్ కు దగ్గరయ్యే ప్లాన్?
మెదక్ ఇన్చార్జీ మంత్రి బాధ్యతల నుంచి తప్పించడమా?
ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులకు మెమోల పర్యవసానమా?
రాహుల్ జన్మదిన వేడుకల్లో రఫాడించిన కొండా మురళి!
అమీ తుమీకి సిద్ధంగా మంత్రి ‘కొండా’ దంపతులు?
కాంగ్రెస్ లో కలకలం రేపుతోన్న కొండా సంచలన వ్యాఖ్యలు
MEDAK|మెదక్ ఇన్చార్జీ మంత్రి పదవిని పీకేసి పార్టీ అధినాయకత్వం మంత్రి కొండా సురేఖ దంపతులకు షాకిస్తే, వారు తిరిగి పార్టీకే రివర్స్ షాకిచ్చారు. ఏకంగా అల్టిమేటమే జారీ చేశారు. కాంగ్రెస్ లో చేరిన వేరే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, దమ్ముంటే తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ‘ఎన్ కౌంటర్ల స్పెషలిస్టుగా, టీడీపీ, బీఆర్ఎస్ లకు ద్రోహం చేశార’ని విమర్శించారు. పరకాల ఎమ్మెల్యేను ‘75 ఏళ్ళ దరిద్రుడు, ముసలోడు, కాళ్ళు పట్టుకుని దేబిరిస్తే వదిలేశామ’ని తూలనాడారు. వరంగల్ సీపీకీ వార్నింగ్ ఇచ్చారు. ‘పోలీసులకు ఇచ్చిన మెమోలు లీకెలా అయ్యాయి? ముందు మీ డిపార్ట్ మెంటులో కోవర్టుల పని పట్టు’ అంటూ ఘాటుగా స్పందించారు. ‘కొండా మురళి అంటే ఎవరు? పరికోడు కాడు, భయానికే భయం పుట్టిస్తడు’ కొండా సురేఖ మంత్రి పదవికి ఢోకా లేదంటూ అభిమానులిచ్చిన కత్తి దూసారు. రాహుల్ జన్మదిన వేడుకల వేదిక మీద నుంచే కొండా చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆయన వ్యతిరేకులు పీసీసీకి ఫిర్యాదు చేయడం, పీసీసీ ఎఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగిపోయాయి.
అసలు కొండా మురళి ఈ ఘాటు వ్యాఖ్యల వెనుక మెదక్ ఇన్ చార్జీ బాధ్యతల నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించడం, ఆమె మంత్రి పదవి పోతదని ప్రచారం జరగడమే ఇందుకు కారణమా? అలాగే కొండా మురళికీ ఎస్కార్టిచ్చిన పోలీసు అధికారులకు సీపీ మెమో ఇవ్వడం పర్యవసానమా?
ఒకవేళ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఊకునేది లేదు. ప్రభుత్వాన్ని పడగొడతాం. పార్టీ మారతాం. మా భవిష్యత్తును మేం చూసుకుంటామనే అర్థాలు కొండా మాటల్లో ధ్వనిస్తున్నాయి. టీడీపీని, బీఆర్ఎస్ ని ప్రస్థావిస్తూ, కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన కొండా మురళి, తనదారి తాను చూసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.
మంత్రి పదవి పోతుదని తెలిసి మాట్లాడుతున్నారా? లేక ప్రస్తుతం పార్టీలో పరిణామాలు ఎలా ఉన్నాయనేది తెలియక మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ తో అమీతుమీకి రెఢీ అయినట్లుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి కోపమొచ్చింది. కొండాకు కోపమొస్తే ఎలా ఉంటుందో ఆయన ప్రత్యర్థులకు తెలిసి వచ్చింది. కొండా మురళి పిరికోడు కాదు. భయానికే భయం పుట్టిస్తడని తెలిసేలా ఆయన మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. బయటి నుంచి వచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయమన్నాడు. 75 ఏళ్ళ దరిద్రుడు. ముసలోడు కాళ్ళు పట్టుకుని దేబిరిస్తే వదిలేశాం. అంటూ ఒక సీనియర్ ఎమ్మెల్యేను దూషించారు. తనకు ఎస్కార్టిచ్చిన పోలీసు అధికారులకు మెమోలిచ్చిన సీపీని వదిలి పెట్టలేదు. ముందుగా మీ డిపార్ట్ మెంటులో కోవర్టుల పని పట్టండని సూచించారు. దీనికి ఎఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుక వేదికనే తన వేదికగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
కాంగ్రెస్ లో ముదురుతున్న గ్రూప్ వార్ రాజకీయాలకు కొండా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. కొండా మురళి కామెంట్స్ పొలిటికల్ కాక రేపుతున్నాయి.
వరసగా జరిగిన ఘటనలు ఉమ్మడి మెదక్ ఇన్ చార్జీ బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో మరో విస్తరణ నాటికి సురేఖను మంత్రి పదవి నుండి తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ వరసగా పెట్టిన రెండు మీటింగులకు సురేఖ అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఈలోగా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించగా, ఎస్కార్టుగా వెళ్ళిన పోలీసు అధికారులకు సీపీ మెమోలు జారీ చేశారు. దీంతో చిర్రెత్తిన కొండా మురళి, కాంగ్రెస్ ని, సీపీని చీల్చి చెండాడారు.
పరకాల నుంచి సుస్మితాపటేల్ పోటీ!
వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సురేఖ-మురళి దంపతుల కూతురు సుస్మితా పటేల్ పోటీ చేయడం ఖాయమని మురళి తేల్చేశారు. పరకాలకు తన బిడ్డే కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ అని ఏకపక్షంగా ప్రకటించారు. ప్రస్తుత పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని చీల్చి చెండాడారు. ‘75 ఏళ్ల దరిద్రుడు, ముసలోడు పరకాల ఎమ్మెల్యే అయ్యా’డని హాట్ కామెంట్ చేశారు. ‘మా కాళ్లు పట్టుకొని సీటు వదిలిపెట్టమని దేబిరించాడని సెన్సేషనల్ కామెంట్ చేశారు.
రాజీనామా హెచ్చరికలు ఎవరెవరికి?
పార్టీకి విరుద్ధమైన ఇరుకున పెట్టే కామెంట్స్ చేశారు కొండా మురళి. కొండా దంపతులు సైతం పార్టీలు మారుతూ వస్తున్నప్పటికీ, పార్టీలు మారి, బయటి పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా సవాల్ విసిరారు. కడియం శ్రీహరి, ఆయన కూతురు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలే టార్గెట్ గా బయటకు కనిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ లో చేరిన ఇతర ఎమ్మెల్యేలందరికీ ఆ కామెంట్ వర్తిస్తుంది. అంతేకాదు తమ మంత్రి పదవికి ముప్పు పొంచి ఉన్నదని వస్తున్న పుకార్ల షికార్లకు కౌంటర్ గా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ వార్నింగ్ వర్తించేలా ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేంతా రాజీనామా చేస్తే ప్రభుత్వం ఉంటుందా? అంటే తమను మంత్రి పదవి నుండి తొలగిస్తే, ప్రభుత్వమే కూలిపోతుందన్న వార్నింగ్ తోపాటు అంతకూ తెగిస్తామని కూడా కొండా మాటల మర్మంగా కనిపిస్తున్నది. దమ్ముంటే తమను ముట్టుకుని చూడండి. మట్టైపోతారన్న హెచ్చరికలు కూడా కొండా కామెంట్స్ లో నిక్షిప్తమై వినిపిస్తున్నాయి.
కడియంను, కాంగ్రెస్ ను తిడుతూ, కేసీఆర్ కు దగ్గరవుతూ
కాంగ్రెస్ తో దూరం పెరుగుతున్న నేపథ్యంలోనే కొండా దంపతులు బీఆర్ఎస్ కు దగ్గర అయ్యేందుకు ఎత్తు వేశారా? అన్న అనుమానాలు కొండా మాటలను బట్టి చెలరేగుతున్నాయి. ‘కనుబొమ్మలు తీసుకునేటోడు కాంగ్రెస్ లో ఉన్నాడు. టీడీపీ ని భ్రష్టు పట్టించి, చంద్రబాబును ఓడించి, కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిష్టవేశాడ’న్న కొండా వ్యాఖ్యలు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించినవి. ఒకవైపు కడియంను టార్గెట్ చేస్తూనే, మరోవైపు కడియంను, కాంగ్రెస్ ను తిట్టడం ద్వారా కేసీఆర్ కు దగ్గరయ్యేందుకు ఓ ప్రణాళిక ప్రకారమే ఈ కామెంట్స్ కొండా మురళి చేసి ఉంటారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పైగా మెదక్ జిల్లా ఇన్ చార్జీ మంత్రిగా ఉన్న కొండా సురేఖ, కేసీఆర్ మేనల్లుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో సఖ్యతగా ఉంటూ బీఆర్ఎస్ ఫేవర్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అవే ఆరోపణలను నిజం చేస్తే పోలా? అన్నట్లుగా కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే, మంత్రి పదవి నుండి కూడా కొండా సురేఖను తప్పిస్తే గనక, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కొండా దంపతులు బీఆర్ఎస్ లో చేరవచ్చన్న ఊహాగానాలు కూడా అప్పుడే ఊపందుకున్నాయి.
మరోవైపు ఆయన ప్రత్యర్థులు కొండా వ్యాఖ్యలపై వీడియోలు, ఆధారాలతో పీసీసీకి, పీసీసీ నుంచి ఎఐసీసీకి ఫిర్యాదు చేశారు. కొండాకు షోకాజు ఇస్తారా? ఎఐసీసీ ఏ విధంగా స్పందిస్తుంది? పీసీసీ చర్యలు తీసుకుంటుందా? అంతా సర్దుకుపోతారా? సవరిస్తారా? చూడాలి.

