Media| మీడియాతో మాట్లాడిన హరీష్ రావు
Kaleshwaram| కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏర్పాటైన Commission| కమిషన్ విచారణలో భాగంగా ex minister| మాజీ మంత్రి హరీష్ రావు హాజరై, ప్రశ్నించిన ప్రతీ అంశానికి ఆధారాలతో సమాధానమిచ్చారు. దాదాపు గంటకు పైగా సాగిన విచారణ అనంతరం ఆయన BRK BHAVAN| బీఆర్‌కే భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కమిషన్ ముందుకు రాసిపెట్టి మాట్లాడటం, రేపటి నుంచి రాజకీయాలపై స్పందిస్తానని చెప్పారు. లోపల చెప్పిందే బయట మాట్లాడతానని స్పష్టం చేశారు.
విచారణలో తొలిగా తమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ మార్పుపై వివరణ ఇచ్చిన హరీష్ రావు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టిలోనే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నించిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రణాళికల ప్రకారం 7 ప్యాకేజీలుగా ప్రాజెక్టు ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రణాళికలు ప్రారంభించకముందే తవ్వకాలు చేసిందని విమర్శించారు.
ప్రాజెక్టుకు అనుమతుల కోసం మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్‌ను కలిసి దరఖాస్తు చేశామని, అయితే ఆయనే “ఎట్టి పరిస్థితుల్లోనూ 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని” తేల్చిచెప్పారని అన్నారు. అదే విషయాన్ని మహారాష్ట్ర సీఎం కూడా అప్పటి ఏపీ సీఎంకు తెలిపిన విషయాన్ని కమిషన్ ముందు వెల్లడించినట్టు చెప్పారు. మహారాష్ట్రలో సీఎంగా ఉన్న ఫడ్నవీస్ కూడా బీజేపీ మేనిఫెస్టో ప్రకారం ప్రాజెక్టును వ్యతిరేకించినట్టు తెలిపారు. తాము ఎంత ప్రయత్నించినా అనుమతులు రాలేదని, దీంతో తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టలేక మేడిగడ్డను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశామన్నారు.
ఇందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలు ఆధారంగా మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉన్నదని గుర్తించారన్నారు. సర్వే ఆధారంగా మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం జరిగిందని వివరించారు. తమ్మిడిహట్టిలో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, భూముల సేకరణ, అంతర్రాష్ట్ర ఒప్పందాలపై కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులైన కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు పట్టించుకోలేదన్నారు.
కాళేశ్వరం కార్పొరేషన్‌కు అనుమతి ఉందా అన్న ప్రశ్నపై అన్ని ఆధారాలను సమర్పించానని హరీష్ రావు చెప్పారు. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పులు టెక్నికల్ కారణాలతో జరిగాయని, ఇంజినీర్ల సర్వే ఆధారంగా తీసుకున్న నిర్ణయమని వివరించారు. దేశంలో అనేక ప్రాజెక్టులు ఇలాగే మారిన విషయాలు కూడా కమిషన్‌కు వివరించినట్టు చెప్పారు.
ప్రాజెక్టులో రిజర్వాయర్ల సామర్థ్యం 141 టీఎంసీలుగా ఉందని, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తామని, మొత్తం 240 టీఎంసీల నీటిని వినియోగించవచ్చునని వివరించారు.
ఈ ప్రాజెక్టు దూషణలకు తావు లేదని, అంతా సాక్ష్యాధారాలతో కూడిన వ్యవహారమని హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్టు, ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్నసాగర్ నుంచి వస్తాయని చెప్పారు. మల్లన్నసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు తాగునీరు, మూసీ నది సుందరీకరణకు నీటిని మల్లన్నసాగర్ నుంచి తరలిస్తామని ప్రకటిస్తున్నప్పుడు, అదే కాళేశ్వరం భాగం కాదా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార అని ప్రజలకు అర్థమైందన్నారు. కమిషన్ ముందు నోటిమాటలతో ఏమీ మాట్లాడలేదని, క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ లేఖలు, జీవోలు అన్నింటినీ ఆధారాలుగా సమర్పించామని హరీష్ రావు వెల్లడించారు.
ఇకపై రాజకీయ విమర్శలకు స్పష్టంగా స్పందిస్తానని హరీష్ రావు సూచించారు. అనుమతుల కోసం తాము చేసిన ప్రణాళికలు, శ్రమలు, కమిషన్ ముందు ఇచ్చిన సమాధానాలన్నీ ఆధారాలతో కూడుకున్నవే అని తేల్చి చెప్పారు. కాళేశ్వరం మీద విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, ఇది రాష్ట్రానికి ఆర్ధిక, వ్యవసాయ ప్రయోజనాల దిశగా తీసుకెళ్లే ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు.

