టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు తెలిపిన విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. “టెస్ట్ ఫార్మాట్‌లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఫార్మాట్ నా జీవితాన్ని మార్చింది, నన్ను పరీక్షించింది, పాఠాలు నేర్పింది,” అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు. తెల్లటి దుస్తులు ధరించడం తనకు అత్యంత వ్యక్తిగతమైన అనుభవమని, నిశ్శబ్దమైన ఆటతీరు, సుదీర్ఘమైన రోజులు, ఆటలో కనిపించని చాలా క్షణాలు తన మనసులో చెరిగిపోకుండా ఉంటాయన్నారు.
“ఈ ఫార్మాట్ నుండి తప్పుకోవడం సులభం కాదు, కానీ ఇది సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం,” అని చెప్పారు. టెస్ట్ క్రికెట్‌కి తాను ఇచ్చిన ప్రతి అణువణువునూ సమర్పించానని, దానికి బదులుగా ఇది తాను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇచ్చిందన్నారు. మైదానాన్ని పంచుకున్న సహచరులు, తన ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరిపట్ల కూడా కృతజ్ఞతతో నిండి ఉన్నానని వెల్లడించారు.
తన టెస్ట్ కెరీర్‌ను ఎప్పుడూ చిరునవ్వుతోనే గుర్తు చేసుకుంటానంటూ విరాట్ తన నిర్ణయాన్ని ఓ ఉద్వేగపూరిత సందేశంతో ముగించారు.
విరాట్ 123 మ్యాచ్‌ల్లో 9230 పరుగులతో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు, 46.85 సగటుతో 30 సెంచరీలు మరియు 51 హాఫ్ సెంచరీలు సాధించాడు. గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రికీ పాంటింగ్ (48 విజయాలు) మరియు స్టీవ్ వా (41 విజయాలు) తర్వాత అతను నాల్గవ అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు.

