బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీజీఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) పరిధిలో లక్షా 75 వేల ఎకరాల భూములను తాకట్టు పెట్టేందుకు కుట్ర పన్నినట్టు ఆమె ఆరోపించారు. దీనిపై తన వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రకటించారు. ప్రభుత్వ లక్ష్యం టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి వేల కోట్ల అప్పులు తీసుకోవడమేనని ఆమె మండిపడ్డారు. దీనికోసం ప్రభుత్వం ఓ రహస్య జీవోను విడుదల చేసిందని, ఇది ప్రజలకు తెలిపకుండా దాచిపెట్టిన తంతు అన్నారు.
తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టి పెట్టుబడులు సమకూర్చే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని, పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చేందుకు టీజీఐఐసీ మార్గంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. టీజీఐఐసీ హోదా మార్పును ప్రజలకు ముందుగా వెల్లడించకపోవడం అనైతికమని, ఈ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1.8 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకుందన్న కవిత, అయితే ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. తెచ్చిన అప్పులతో అభివృద్ధికి ఉపయోగించకుండా, కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని ఆరోపించారు. గతంలో తీసుకున్న అప్పుల్లో కేవలం రూ.80 వేల కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారని, మిగిలిన లక్ష కోట్లు ఎక్కడకు వెళ్లాయో చెప్పాలన్నారు.
ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించిందని, ఇందులో రూ.20 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ఖజానాకు చేరాయని కవిత ఆరోపించారు. 20 శాతం కమీషన్ సర్కార్‌గా విమర్శిస్తూ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి నేరుగా వాటి నుంచి కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఇది కేవలం ఆరోపణలు కాదు, తాను ఆధారాలతో మాట్లాడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతేగాక, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చిన విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. చెట్లను నరికించి, ప్రకృతిని నాశనం చేసే ఈ చర్యలపై దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
ఇక మరోవైపు, మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. “నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నాను. ఇప్పటివరకు 47 నియోజకవర్గాల్లో పర్యటించాను. అక్కడి ప్రజాభిప్రాయాల ఆధారంగా నేను సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాను” అని చెప్పారు. ప్రజల్లో పార్టీపై నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ సమయంలో నాపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కొందరు పనిగట్టుకుని తానుపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
“ఆరు నెలలు జైల్లో ఉన్నా సరిపోదా? ఇంకా నన్ను కష్టపెడతారా? నన్ను రెచ్చగొడితే గట్టిగా స్పందించాల్సి వస్తుంది. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయమై పార్టీ స్పందిస్తుందని నమ్మకంగా ఉన్నాను” అని వ్యాఖ్యానించారు. కాలం వచ్చినప్పుడు నిజాలన్నీ బయటపెడతానని హెచ్చరించారు.
మొత్తంగా, టీజీఐఐసీ వ్యవహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా కొత్త చర్చకు తావిచ్చారు.

