అతను ఒక మామూలు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కొడుకు. 8వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికి, జామియా ఉలూమ్ ఇస్లామిక్ పాఠశాలలో చేరాడు, అలీమ్‌గా పట్టభద్రుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. ఈ అలీమే ఆతర్వాత అంతర్జాతీయ ఉగ్రవాది అయ్యాడంటే నమ్మడం కష్టమే. పాకిస్తాన్ తమ దేశ అధ్యక్షుడికంటే, ప్రధాని కంటే కూడా, అత్యంత సైనిక భద్రత కల్పించి రక్షిస్తున్నది కూడా ఇతడినే. అయితే భారత్ లో ఇప్పటి దాకా జరిగిన అన్నిదాడులకు ప్రధాన సూత్రధారి కూడా ఇతడే. అతడే ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్.
హైదరాబాద్, మే 8 (అడుగు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి):
పాకిస్తాన్ లోని పంజాబ్‌లో గల బహవల్‌పూర్‌లో జూలై 10, 1968న పుట్టిన మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్. మన దేశంలోనే (1994 ఫిబ్రవరిలో)అరెస్టై, జైలులో ఉండి, విమానం హైజాక్ ద్వారా (1999, డిసెంబర్ లో ) విడుదలై, మన పార్లమెంట్ మీదే (డిసెంబర్ 13, 2001న) దాడి చేయించిన కరడుగట్టిన టెర్రరిస్టు నాయకుడు కూడా ఇతడే. 2008 ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి, ఇలా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (2000) వ్యవస్థాపకుడు. అది అతని కుటుంబ సంస్థ.
అయితే, భారతదేశం ఫిబ్రవరిలో అనంతనాగ్ సమీపంలోని ఖనాబాల్ నుండి అతన్ని అరెస్టు చేసింది. 1999 విమానం హైజాక్ నేపథ్యంలో జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా పాకిస్తాన్ కి వెళ్ళిపోయాడు. తమ దేశంలో అతడిపై ఎలాంటి అభియోగాలు లేనందున పాక్ కనీసం అతడిని అరెస్టు కూడా చేయలేదు. డిసెంబర్ 29, 2001న భారత పార్లమెంటుపై డాడి తర్వాత ఏడాదిపాటు గృహ నిర్బంధం చేసి, 2002 డిసెంబర్ 14న ఆ నిర్బంధాన్ని ముగించారు.
విడుదలైన కొద్దికాలానికే, అజార్ కరాచీలో 10వేల మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ” భారతదేశాన్ని నాశనం చేసే వరకు ముస్లింలు శాంతితో విశ్రాంతి తీసుకోకూడదని మీకు చెప్పడం నా విధి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ” అని ప్రకటించాడు, కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
2008 ముంబై దాడుల తర్వాత అతను పాకిస్తాన్ పంజాబ్ లోని తన స్వస్థలం భవల్‌పూర్‌లో ఉంటున్నాడు. 2014 జనవరి 26న, రెండేళ్ళ ఏకాంతవాసం తర్వాత అజార్ తిరిగి కనిపించాడు. 2019 పుల్వామా దాడికి పాల్పడింది తమ సంస్థేనని పాక్ పకడ్బందీ ఆర్మీ రక్షణలోని బంకర్ నుండి ప్రకటించాడు. దీంతో అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
ఇక అప్పటి నుంచి కనిపించడం మానేసిన మసూద్ అజార్, 2025 మే 7న, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా , బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ శిబిరంతో సహా, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు నిర్వహించింది . మసూద్ అజార్ తన సోదరి, మేనల్లుడు, మేనకోడళ్ళు, ఇతర దగ్గరి బంధువులతో సహా 14 మందిని కోల్పోయి, చావు మిగిల్చిన విషాదాన్ని అనుభవిస్తున్నాడా? లేక చావు దెబ్బ తిన్నాడా? సమీప కాలంలోనే బండారం అంతా బట్ట బయలవుతుంది.

