తొర్రూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి. చెరువుకట్ట నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.., తొర్రూరుకు ఇది చారిత్రక రోజు. చెరువు కట్ట నిర్మాణం ద్వారా వరదల సమస్య తగ్గుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, పర్యావరణానికి ఉపయోగకరం అవుతుంది” అన్నారు. తొర్రూరు అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంతి ఉపాధ్యాయుల భవనానికి శంకుస్థాపన
తొర్రూరు పట్టణంలో విశ్రాంతి ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.., రిటైర్డ్ ఉపాధ్యాయులు యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అలాగే హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్ కు దిక్సూచిగా ఉపాధ్యాయులు నిలుస్తారన్నారు. వారి సేవలు మరువలేనివి అన్నారు.
కొత్తూర్ లో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ
రాయపర్తి మండలం కొత్తూర్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్ఠా మహోత్సవంకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై అమ్మవారికి బోనం ఎత్తి మొక్కులు చెల్లించారు.

అమ్మాపురంలో శ్రీ కంఠ మహేశ్వర పండుగలో ఎమ్మెల్యే
తొర్రూరు మండలంలోని అమ్మాపురంలో గౌడ కులస్తులు నిర్వహించిన శ్రీ కంఠ మహేశ్వర పండుగలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేయగా, గ్రామస్తులు ఘనంగా స్వాగతించి, సత్కరించారు.

పదవీవిరమణ చేసిన వెంకటేశ్వర రెడ్డికి సన్మానం
మిషన్ భగీరథ విభాగంలో సేవలందించిన పోతుల వెంకటేశ్వర రెడ్డి పదవీవిరమణ వేడుకలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని ఆయనను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వెంకటేశ్వర్ రెడ్డి సేవలు మరువలేనివి అన్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


