డా. పొనుగోటితో పాటు 500 మంది చేరిక
పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శూన్యంగా మారుతోంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో తొర్రూరు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డా. పొనుగోటి సోమేశ్వర్ రావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరికలో తొర్రూరు మాజీ సర్పంచ్ రాజేష్ నాయక్, రాయపర్తి మాజీ ఎంపీపీ కంజర్ల ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీలు సొమ్ల నాయక్, రాజేందర్, భోజ్యా, బానోత్ శ్రీను, జాతోత్ నరేష్, పద్మా యకేందర్, రవి నాయక్, కృష్ణమూర్తి, నరసింహ నాయక్, మైనారిటీ నేత ఎం.డి. అన్వర్, యువజన విభాగం నుంచి వీరమనేని రాజు, సురేష్ నాయక్, గుగులోతు అశోక్, నెహ్రూ నాయక్, మహిళా విభాగానికి చెందిన కేతావత్ అనుజా, దారవత్ అనిత, విమల తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలతో పాటు నాయకులు కూడా ఆకర్షితులవుతున్నారని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకత్వం కృషి చేస్తోందని, అందరిని కలుపుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకత్వం తమ అత్త, కోడళ్ళను తక్కువ అంచనా వేసిందని, మాజీ మంత్రి ఎర్రబెల్లి దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. వారి ఆశలు తీరవని స్పష్టం చేస్తూ, ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

