సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అలాగే స్కూల్‌లో వ్యాపించిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వెంటనే స్కూల్ సిబ్బంది, వైద్య సిబ్బంది అప్రమత్తమై అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు వైద్యం అందుతూ, పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.
చిరంజీవి ప్రకటన
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని చిరంజీవి తెలిపారు. కాళ్లు, చేతులకు మాత్రం గాయాలయ్యాయ్ అని అన్నారు.
ఈ వార్త రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి సమాచారం చేరగానే, వెంటనే అధికారులతో పాటు పార్టీ నాయకులు ఆయనకు సింగపూర్ వెళ్లే ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అయితే పవన్ కల్యాణ్ గారు స్పందిస్తూ, “నిన్న అరకు సమీపంలోని కురిడి గ్రామంలోని గిరిజనులకు పర్యటన వస్తానని మాట ఇచ్చాను. వాళ్లను కలవడం, వారి సమస్యలు వినడం నా బాధ్యత. అలాగే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాబట్టి ముందుగా నా బాధ్యతను నిర్వర్తించి, వెంటనే కుమారుడిని చూడటానికి వెళ్తాను,” అని స్పష్టంగా చెప్పారు.
అటు పర్యటన ముగించుకుని పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సింగపూర్‌కు బయలుదేరనున్నారు. అధికారులు, వైద్యులు మార్క్ శంకర్ ఆరోగ్యంపై నిరంతరం అప్డేట్స్ అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పవన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు లోనైంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

