తమిళనాడు గవర్నర్ డాక్టర్ ఆర్‌ఎన్. రవి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్ తిరస్కరించిన బిల్లులను ప్రభుత్వం మళ్లీ తిరిగి ఆమోదించి పంపిన సందర్భంలో, వాటిని గవర్నర్ ఆమోదించినట్లుగా పరిగణించాలని సుప్రీం కోర్టు తమ తుది తీర్పు వెలువరించింది. గవర్నర్లు శాశ్వతంగా బిల్లులను తమ వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంది. బిల్లులను తిరస్కరించిన తర్వాత శాసనసభ మళ్లీ ఆమోదిస్తే, రెండోసారి గవర్నర్ ఆ బిల్లులను రాష్ట్రపతికి పంపించే అధికారం ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
తమిళనాడు ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండా ఉంచిన 12 బిల్లుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో జస్టిస్ జెబి పార్ధివాలా, జస్టిస్ మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాలపై గవర్నర్ నిరాకరణ తెలపడం, బిల్లులను పెండింగ్‌లో ఉంచడం వంటి అంశాలను గమనించిన కోర్టు, గవర్నర్ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ నిర్లక్ష్యంగా స్పందించడమేగాక, వాటిని రాష్ట్రపతికి పంపించడం చిత్తశుద్ధి లేని చర్యగా పేర్కొంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాధికారం, గవర్నర్ యొక్క రాజ్యాంగబద్ధమైన పాత్రల మధ్య ఉన్న సరిహద్దులను స్పష్టత పరుస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

