వందకు వంద శాతం రిజర్వాయర్లు పూర్తి
పార్టీని కాపాడే బాధ్యత మీది
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది
పిచ్చి ప్రేలాపణలు, తుచ్ఛ ప్రచారాలు మానుకోండి
లాలూ‘ఛీ’లు పడకండి… లూజ్ టాక్ చేయకండి
బదనాం చేయాలని చూస్తే భరతం పడతా?
పజీత చేయాలని చూసే వారి పని పడతా?
పార్టీ అంటే నేనో, లేక మరెవరో కాదు. పార్టీ అంటే బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు మాత్రమే కాదు. పార్టీ అంటే కార్యకర్తలు, పార్టీ అంటే ప్రజలు… మీరంతా పార్టీని కాపాడండి.. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. కాదని పార్టీని పజీత చేయాలని చూస్తే, వారి పనిపడతా… బదనాం చేసే వారి భరతం పడతా? అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి హెచ్చరించారు. పాలకుర్తిని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నాది… పార్టీని కాపాడే బాధ్యత కార్యకర్తలు, ప్రజలు తీసుకోవాలని హితవు పలికారు. చివరకు పార్టీ కార్యాలయానికి ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానులను కూడా కొందరు ప్రతిపక్షనేతలు బెదిరించే నీచ స్థాయికి దిగజారారని, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని, కొందరు ముసలి నక్కలు, కుయుక్తులు పన్నుతున్నాయని ఎద్దేవా చేశారు. అలాంటి వారెవరినీ వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో కొత్త భవనంలో పార్టీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన ఎమ్మెల్యే ఘాటుగానే మాట్లాడారు.
గత పాలకులు తమ కాలంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడుతాయోననే భయంతో తప్పుడు ప్రచారాలు, పిచ్చి ప్రేలాపనలకు దిగుతున్నారన్నారు. చివరకు పార్టీ కార్యాలయానికి ఇచ్చిన యజమానిని కూడా బెదిరించారు. భయపెట్టించారు. అయినా ధైర్యంగా నిలబడి, కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం కోసం తమ ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యాలయం నుండే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయాలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే చమత్కరించారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కష్టపడి సైనికుల్లా పనిచేసి గెలిపించారో, అదే విధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనమంతా శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఆ రోజు అధికార దుర్వినియోగానికి, అవినీతికి, అక్రమాలకు ఎదురు తిరిగి, నాకు అండగా నిలబడి, ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు. మీరు లేకుండా నేను లేను. పార్టీ లేదు. అప్పటి లాగే ప్రజల, కార్యకర్తల అండదండలు మాకు కావాలని, ఇంతకుముందు కన్నా ఎక్కువ కష్టపడాలి. పార్టీని మీరు కాపాడాలి. మిమ్మల్ని మేము కాపాడుతాం. మీ మంచి చెడు చూసే బాధ్యత మాది. మీకు అండగా నిలబడతానని ఆమె అన్నారు. పాలకుర్తి పురోగతికి పాటు పడతామని ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, పార్టీ అభివ్రుద్ధి పనులు, అమలవుతున్న పథకాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. మన పథకాల గురించి ప్రజలకు చెప్పండి. మనం చేసే మంచిని చర్చించాలి. మనం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సింది మీరే అన్నారు.
అయితే, కొందరు పనిగట్టుకుని మరీ.. పార్టీపై, ప్రభుత్వ పథకాలపై, మాపై లూజ్ టాక్ చేస్తున్నారని తెలిసింది. అలాంటి వారి వెంట పడతాను. వారి భరతం పడతా. పార్టీలోనే ఉంటూ, కోవర్టులుగా పని చేస్తున్న వారి రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేస్తానని హెచ్చరించారు. ఇలాంటి వారికి మన చేసే అభివ్రుద్ధితోనే బుద్ధి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
తాను పాలకుర్తి ప్రగతి కోసం అహర్నిశలు పాటు పడుతున్నానని చెప్పారు. ఒక్కొక్క పని కోసం నేను చేస్తున్న కష్టం మీకేం తెలుసు. ఏయే ప్రాంతాల్లో ఏమేం చేయాలన్నదానిపైనే నేను ఆలోచిస్తున్నాను.
ఈ మధ్య కాలంలో సిఆర్ఆర్ఎంఆర్ కింద 50 కోట్ల నిధులు తెచ్చాను. మన పాలకుర్తి బస్టాండ్ కూడా మనం అనుకున్నట్లు అభివృద్ధి చేసి చూపిస్తాను. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు వందకు వంద శాతం పూర్తి చేస్తాను. దేవరుప్పుల మండలంలో రూ.150 కోట్లతో 131 కెవి సబ్ స్టేషన్ మంజూరు అయింది. కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ పెట్టిన… కొద్ది రోజుల్లోనే మంజూరు అయితది. కొడకండ్లలో టెక్స్టైల్ పార్క్ కూడా చేసి చూపిస్తా… రాయపర్తి మండలంలో రూ.14 కోట్లతో గోదాము మంజూరు అయింది. టెండర్లు కూడా పూర్తి అయినాయి. పాలకుర్తిలో 50 పడకల హాస్పిటల్ కు టెండర్లు పూర్తి అయి అగ్రిమెంట్ కూడా ఈ మధ్య అయిపోతుంది. తొర్రూరులో కూడా 100 పడకల హాస్పిటల్ కూడా అయిపోతుంది. అలాగే తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి వచ్చిన నిధుల నుండి రూ.5 కోట్లు కేటాయించిన… అట్లనే మొన్న డిప్యూటీ సీఎం భట్టి గారి పేషీలో 3 గంటలు కూర్చున్న… మిగతా ఎమ్మెల్యేలు విసుగు వచ్చి వెళ్ళిపోయినా సరే, నేను మాత్రం వెళ్ళి మాట్లాడి రూ.20 కోట్ల నిధులు తెచ్చాను. అని ఎమ్మెల్యే వివరించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. ఇవి అన్ని నేను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నా… నాకు ప్రచారం డంబాచారం కాదు కావలసింది. మనల్ని నమ్ముకున్న పాలకుర్తి ప్రజలకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం అన్నారు. ఎమ్మెల్యే అయిపోయిన.. ఇక నాకేంటి? అని చేతులు ముడుచుకుని చైర్ లో కూర్చోవడం కాదు, గెలిపించిన ప్రజల కష్టాలు తీర్చడం, కష్టపడి గెలిపించిన కార్యకర్తలను కాపాడుకోవడం. అవే నేను చేయాల్సింది నేను చేస్తున్నా అని యశస్వినీ రెడ్డి వివరించారు. నేను దీనిని శ్రమ అనుకోవడం లేదు. బాధ్యతగా భావిస్తున్న…ఇది నా కర్తవ్యం. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన… చేస్తున్న… ప్రజలకు సేవ చేస్తుంటే ఆనందంగా కూడా ఉన్నది. పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

