కెసిఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామని రాష్ట్ర నేపథ్యాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈరోజు నష్టం జరుగుతుందన్నారు. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదని చెప్పారు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు.. కానీ అది బీజేపీకి వచ్చిందన్నారు.దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుందని, పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నమన్నారు. దేశానికి 36% జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయని, డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నదన్నారు. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుందనీ, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది అని దుయ్యబట్టారు. ప్రస్తుతం బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చిందనీ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పారు.బిజెపి సారధ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నదన్నారు. ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆదిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశంగా చెప్పారు కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నదనీ చెప్పారు. మనమంతరం భారతీయులం…అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం అన్నారు. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి కానీ ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈరోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదన్నారు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిదనీ దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదన్నారు. డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు అన్నారు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు అని చెప్పారు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయని చెప్పారు.

