మూడు పోయే..! నాలుగు వచ్చే..!!
ఐదు రోజుల్లోనే ఎంత మార్పు?
వేగంగా చేంజ్ అవుతోన్న పొలిటికల్ ట్రెండ్స్!
అవును. లెక్క లెవెల్ అయింది. మూడు ఎమ్మెల్సీ సీట్లు కోల్పోయిన కాంగ్రెస్ తిరిగి మూడు ఎమ్మెల్సీ సీట్లను గెలవబోతోంది. మిత్రపక్షం సిపిఐకి కేటాయించిన సీటుతో కలుపుకుని నాలుగు ఎమ్మెల్సీ సీట్లను పొందనుంది. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు గెలవడం సంచలనమైంది. ఒక్కసారిగా ఫాంలోకి వచ్చిన బీజేపీ పొలిటికల్ ట్రెండింగ్ లోకి కూడా వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది! కాషాయం విస్తరిస్తోంది!! సీఎం సీటు దిగుడే! కమలం కబ్జా చేస్తోంది!! బాజాప్తా ఇక బాజపాదే భవిష్యత్తంటూ నిన్న మొన్నటి వరకు జరిగిన చర్చల్లోంచి ఇప్పుడు బీజేపీ లేకుండా పోయింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తో ఇప్పుడు కాంగ్రెస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ, సీఎం.లతోపాటు, ప్రకటించిన అభ్యర్థుల జాబితా కూడా తెగ ట్రెండవుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఎంత మార్పు? వేగంగా చేంజ్ అవుతోన్న పొలిటికల్ ట్రెండ్స్ కి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం.
కలిసి వచ్చే కాలమంటే ఇదే! కాంగ్రెస్ కి కలిసి వచ్చిన కాలమంటే కూడా ఇదే!! కేవలం ఐదు అంటే ఐదు రోజుల్లోనే రీల్ రివర్స్ అయింది. ఐదు రోజుల క్రితం తుది ప్రకటనల తర్వాత తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లను గెలిచింది. అందులో ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ, మరొకటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. కాగా ఒక టీచర్స్ సీటుని పిఆర్ టి యు గెలిచింది. నిజానికి రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, కేవలం గ్రాడ్యుయేట్ సీటులో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపింది. కానీ బీజేపీ మూడు సీట్లల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలిపింది. టెక్నికల్ గా చూస్తే కాంగ్రెస్ కేవలం ఒక సీటును మాత్రమే కోల్పోయినట్లు. అయితే బీజేపీ బరిలో నిలిచి గెలిచి పులిమిన రాజకీయ రంగుతో చూసినా, ఓవరాల్ గా ఎన్నికలు జరిగిన మూడు సీట్లను బట్టి చూసినా, కాంగ్రెస్ మూడు సీట్లనూ కోల్పోయినట్లే! అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీచర్స్ కి రాజకీయాలు వద్దన్న సంకల్పంతోనే కాంగ్రెస్ ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలపలేదన్నారు. కారణాలేవైనా, సాంకేతికత ఎలా ఉన్నా, బీజేపీ రెండు సీట్లు గెలిచింది. కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లను కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ గెలుపు తెగ చర్చగా మారింది. కాంగ్రెస్ పనైపోయిందని, సీఎం సీటు కూడా ఖాళీ అవుతుందని, బీజేపీదే ఇక భవిష్యత్తంతా అంటూ చర్చోప చర్చలు జరగసాగాయాయి. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా గెలవలేదు కాబట్టి, ఎపీ తరహాలో టీడీపీ, జనసేనతో సంకీర్ణానికి సంకల్పం తీసుకోవాలని కొందరు ఔత్సాహికులు సూచనలు కూడా చేసేశారు. కాంగ్రెస్ కి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారిగా పొలిటికల్ ట్రెండ్స్ అన్నీ వాడిగా వేడిగా వార్ వన్ సైడే అన్నంతగా మారిపోయాయి. నిజంగానే ఏమో అయిపోతోందేమో! అన్న సందేహాలు సామాన్యులకే కాదు రాజకీయ పరిశీలకులకు, రాజకీయ నాయకులకు కూడా కలిగాయి. దీంతో బీజేపీలో చేరడానికి కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధపడ్డారన్న ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో అలెర్ట్ అయిన గులాబీ బాస్…బీజేపీ పుంజుకుంటే, బీఆర్ఎస్ పనైపోతుందన్న కారణంగానే ప్రజల్లోకి రావడాని, అసెంబ్లీకి హాజరవడానికి సిద్ధపడ్డారన్న ఊహాగానాలు సాగాయి. తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలను సాగనీయమన్న కెసిఆర్ హెచ్చరికల వెనుక కూడా ‘కారు’ను షుషారెత్తించడంలో భాగమేనని అంతా భావించారు.
సరిగ్గా ఈ సమయంలోనే ఐదు స్థానాల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా కాంగ్రెస్ కు నలుగురిని గెలిపించుకునే, బీఆర్ఎస్ కి ఒకరిని గెలిపించుకునే సంఖ్యాబలం ఉంది. బీజేపీకి ఇప్పుడున్న సంఖ్యా బలం ఒక అభ్యర్థిని కూడా గెలిపించుకునేందుకు సరిపోదు. దీంతో కాంగ్రెస్, అసెంబ్లీలో కేవలం ఒక ఎమ్మెల్యే స్థానం మాత్రమే ఉన్న మిత్రపక్ష సీపీఐ పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం ఒక స్థానాన్ని వదిలి పెట్టింది. మిగతా మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ లను ఖరారు చేయగా, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ను, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లాకే చెందిన దాసోజు శ్రావణ్ ను అభ్యర్థులుగా ప్రకటించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలేగాక, పార్టీల, రాజకీయ నేతల, పరిశీలకుల దృష్టి అంతా ఈ వైపు మళ్ళింది. విజయశాంతి మినహా అభ్యర్థులంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా వాళ్ళే కావడం, విజయశాంతికి అవకాశం దక్కడంపైనే చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా గేమ్ చేంజ్ అయింది. రాజకీయ చర్చంతా కాంగ్రెస్ పైనే, ఆ జాబితాపైనే కేంద్రీకృతం కాగా, బీజేపీ ఆ చర్చలోనే లేకుండా పోయింది. అలాగని కాంగ్రెస్ దో లేక బీజేపీదో, బీఆర్ఎస్ దో పనైపోయిందని కాదు కానీ, రాజకీయాల్లో ఏదో ఒక చర్చల్లోనో, రచ్చల్లోనో పార్టీలు, ఆ పార్టీల నేతలు ఉండటం పరిపాటి. అయితే తెలంగాణలో ఈ పొలిటికల్ ట్రెండ్ వేగంగా మారడమే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇది మీనాక్షి నటరాజన్ మార్కా!?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ మార్పు ప్రభావమా? లేక సీఎం రేవంత్ రెడ్డి పంతమా? మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ గాడిలో పడుతోందా? ఈసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల జాబితా సరిగ్గా ఇవే అంశాలను బలపరుస్తున్నట్లుగా కనిపిస్తున్నది. గతానికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందనేది పార్టీలోనేగాక, పార్టీ బయట కూడా జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరిగిన మొదటి పార్టీ అభ్యర్థుల ఎంపిక ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ అభ్యర్థుల జాబితాపై పెద్దగా విమర్శలు లేకపోగా, వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. పైగా మీనాక్షి చెప్పినట్లుగా సూట్ కేసులు, బ్యాగులు మోసిన వాళ్ళకు, బసలు బుక్ చేసిన వాళ్ళకు కాకుండా, పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళకు, పార్టీ విధేయులకు, సుదీర్ఘంగా, ఓపికగా పార్టీని పట్టుకుని ఉన్నవాళ్ళకు మాత్రమే అవకాశాలు దక్కాయన్నది ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఒక డిసిసి అధ్యక్షుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం కింది స్థాయి కేడర్ ని గౌరవించడమేగాక, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పలుసార్లు ఓడిపోయినా, పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా, అద్దంకి దయాకర్ పార్టీలో క్రమశిక్షణతోనే ఉంటూ మీడియా చర్చల్లో పార్టీకి అండగా నిలబడ్డారు. ఇక విజయశాంతి, విలువైన సినీ జీవితాన్ని కాదని, తెలంగాణ రాష్ట్రం కోసం తల్లి తెలంగాణ పార్టీని పెట్టారు. ఎంపీగా పని చేశారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఆమెకు అవకాశం ఇవ్వడం వరకు సముచితమే. కానీ ఇది సముచిత గౌరవమేనా? ఆమె సినీ గ్లామర్ ని, రాజకీయ గ్రామర్ ని మరింతగా వాడుకునే వీలుగా అవకాశం కల్పిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే అద్దంకి దయాకర్ కి కూడా!

