ఐలమ్మ వారసుడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ రామచంద్రం అస్తమయం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ మనవడు, పాలకుర్తి గ్రామ పురోగతిలో కీలకంగా పని చేసిన, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన పాలకుర్తిలోని తన ఇంట్లోనే కన్నుమూశారు. రామచంద్రం భార్య భారతి తేదీ:16-03-2022లో మరణించగా, ఆయన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలలో చిన్న కొడుకు గోపీ ఇంటర్ చదువుతున్న దశలోనే అకాల మరణం చెందారు. పెద్ద కుమార్తె హైదరాబాద్ లో, చిన్న కుమార్తె ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.
చిట్యాల రామచంద్రం 1953లో పాలకుర్తిలో ఐలమ్మ ఐదుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు చిట్యాల (కట్టెల) సోమయ్యకు మూడో సంతానంగా జన్మించారు. పాలకుర్తి హై స్కూల్ లోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. నాయినమ్మ, తండ్రిల పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రామచంద్రం, వారితోపాటు సిపిఐ లోనే కొనసాగారు. 1975లో సిపిఐతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. యువజన విభాగంలో పని చేస్తూ, మూడేండ్ల తర్వాత సిపిఎంకు మారారు. అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జీడి సోమనర్సయ్య శిష్యరికంలో ఎదుగుతూ వచ్చిన రామచంద్రం అప్పటిదాకా సుదీర్ఘంగా పాలకుర్తి సర్పంచ్ గా పని చేసిన వీరమనేని కిషన్ రావుని ఓడించి తేదీ: 01-06-1981లో పాలకుర్తి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తేదీ 14-08-2001 వరకు దాదాపు 20 ఏండ్లపాటు అప్రతిహతంగా సర్పంచ్ గా కొనసాగారు. ఇప్పటి వరకు పాలకుర్తికి అత్యధిక కాలం పని చేసిన సర్పంచ్ రామచంద్రమే.

రైతు కూలీ ఉద్యమాలలో..
సిపిఐ యువజన విభాగంలో పని చేస్తూన్న సమయంలో అవిరినేని సోమేశ్వరరావుతో పాటు సమరయోధులు జీడి సోమయ్య, జీడి సోమనర్సయ్య తదితరులతో కలిసి రైతులు, రైతు కూలీల, కార్మిక ఉద్యమాలు చేశారు. పార్టీలో ఆయన అవిరినేని సోమేశ్వరరావు, గూడూరు చంద్రయ్య, బండి మదారు, గూన సోమయ్య, జీడి సత్యనారాయణ, సంకటబోయిన ఉప్పలయ్య, అనంతోజు కమ్మరి బ్రహ్మయ్య, అనుముల జనార్దన్ రెడ్డి, జీడి సోమనాథం, జీడి మల్లయ్య వంటి అనేక మంది కలిసి పలు ఉద్యమాలు చేశారు.

1969 ఉద్యమంలో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 1969లో కీలకంగా పని చేశారు. ఆ సమయంలో తన సహాధ్యాయులు ఎండి అఫ్జల్ ఖాన్, పాలకుర్తి మాజీ వార్డు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి సోమమల్లయ్య, తనతోపాటు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 20 ఏండ్ల పాటు పాలకుర్తి గ్రామ కార్యదర్శిగా పని చేసిన ఎ.సోమేశ్వరరావులతో కలిసి పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో…
ఆతర్వాత తెలంగాణ మలి ఉద్యమ సమయంలోనూ కీలకంగా పని చేశారు. అప్పటికే విశాలాంధ్ర నినాదంతో ఉన్న కమ్యూనిస్టు పార్టీని కాదని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పని చేశారు. అదే సమయంలో పార్టీ ఆయనను పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో బహిష్కరించింది.
తర్వాత వివిధ పార్టీలతో…
అయితే ఆతర్వాత ఆయన మారుతున్న రాజకీయాలకనుగుణంగా తన రాజకీయ ప్రయాణాన్ని మార్చుకుంటూ వెళ్ళారు. కొంత కాలం టిడిపితోనూ, మరికొంత కాలం బిఆర్ఎస్ తోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోనూ కొనసాగారు. ఆయా పార్టీల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు.

యతిరాజారావును ఎదిరించి…సహకారం తీసుకుని..
రామచంద్రం రాజకీయ జీవితం పదవిలో ఉన్నప్పటికీ పోరాటాలతోనే గడిచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉండటం, అప్పట్లో యతాజారావు ఎమ్మెల్యేగా ఉండటంతో, రాజకీయంగా ఆయన్ని ఎదిరిస్తూనే, పోరాడుతూనే, మరోవైపు గ్రామ అభివ్రుద్ధి కోసం ఆయన సహకారం తీసుకుంటూ తెలివిగా రాజకీయాలు చేశారు.
గ్రామాభివృద్ధిలో కీలకం…
రామచంద్రం తన సర్పంచ్ పదవీ కాలంలో పాలకుర్తి గ్రామ పురోగతిలో కీలకంగా పని చేశారు. భవిష్యత్తులో ఎదిగే గ్రామం, పెరిగే జనాభాకనుగుణంగా ఎంతో ముందు చూపుతో పని చేశారు. గ్రామంలో విశాలమైన రోడ్లు, మంచినీరు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు, అప్పట్లోనే 100 ఫీట్ల వెడల్పైన రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత రామచంద్రంకే దక్కుతుంది.
ఉత్తమ గ్రామ పంచాయతీగా…
గ్రామ సర్పంచ్ గా ఆయన 20 ఏండ్ల ప్రస్థానంలో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డులు పొందింది. సిపిఎం సర్పంచ్ గా ఉన్నప్పటికీ, అప్పటి ప్రధాన పార్టీలకు దీటుగా పని చేసిన ఆయన గ్రామానికి ఈ అవార్డులు రావడం విశేషం.
అనేకసార్లు జైలుకు…
యువ నాయకునిగా పని చేస్తూన్న సమయంలోనే రామచంద్రం, ఉప సర్పంచ్ అవిరినేని సోమేశ్వరరావు వంటి వారితో కలిసి చేసిన ఉద్యమాల్లో భాగంగా అనేక సార్లు జైలుకు పోయారు. రైతులు, కూలీల కోసం పోరాడే క్రమంలో ఆయనపై రాజకీయక కేసులు కూడా అయ్యాయి. అయితే వాటిని ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ఐలమ్మ విగ్రాహాల ఏర్పాటుతో…
సాయుధ పోరాట యోధురాలు చాకలి అయిలమ్మ మనవడిగా ఆమె విగ్రహాన్ని మొదట పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటవడం, వాటిలో చాలావాటిని రామచంద్రం చేతే ఆవిష్కరించడం జరిగాయి. ఈ విధంగా రామచంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చారు. ఐలమ్మ వారసులు మరికొందరున్నప్పటికీ, ఆమె మనవడంటే రామచంద్రమే అనే స్థాయి ప్రచారాన్ని, ప్రాచర్యాన్ని పొందారు.
కీర్తి ప్రతిష్టలు
ఇదే తరుణంలో ఐలమ్మ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని, ఐలమ్మ వారసురాల్లో ఒకరికి మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే, వారి వారసుల మధ్య విభేదాల కారణంగా ఆ పదవి కేటాయింపు వాయిదా పడింది. అంతకుముందు అప్పటి సీఎం కెసిఆర్ సైతం రామచంద్రం కుటుంబాన్ని పిలిపించుకుని అభినందించి, సత్కరించి, తగిన గుర్తింపునిస్తామని ప్రకటించారు.
పలువురి సంతాపం
చిట్యాల రామచంద్రం మరణం పట్ల అనేక మంది తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. సంతాపం తెలిపిన వారిలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, పార్టీ ఇన్ చార్జీ ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, అడుగు చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, ఆయన సహాధ్యాయి ఎడవెల్లి సోమమల్లయ్య, సహచరులు అవిరినేని సోమేశ్వరరావు, బండి మదారు, జీడి సత్యనారాయణ, ఎండి అబ్బాస్ అలీ, ఎండి యాకూబ్, ఎడవెల్లి దండయ్య, గాదెపాక యాకయ్య, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్, సాయిసందీప్ తేజ మార్గం, డాక్టర్ జివై సోమయ్య, కడుదుల కరుణాకర్ రెడ్డి, చిట్యాల సమ్మయ్య, గుమ్మడిరాజుల సాంబయ్య, రాపర్తి కొమురయ్య, కమ్మగాని సుక్క సారయ్య, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు తదితరులు ఉన్నారు.

