శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఉగాది రోజున కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తాన్ని ఖరారు చేసి, అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రేషన్ కార్డులు లేత నీలిరంగులో ఉండాలని నిర్ణయించడంతో పాటు, కార్డు రూపురేఖలు కూడా మారనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు కూడా కొత్త రేషన్ కార్డుపై ఉండేలా నమూనాను ఫైనల్ చేశారు. రేషన్ కార్డుల భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటన్నింటిని కొత్త కార్డులతో మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై, ప్రజలు భారీ సంఖ్యలో వీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో, దీనిపై ప్రజల్లో ఊహించని ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వే ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆదాయ సమాచారం లభించడంతో, అర్హులైన వారికి వెంటనే రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొత్త రేషన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

