అడుగు ఎక్స్ క్లూజివ్
కమలంలో కథనోత్సాహం-4
కాంగ్రెస్ కంచుకోటలో కాషాయ విజయం తథ్యమేనా?
గులాబీ గుభాళింపు ఇక గత వైభవమే అవుతుందా!?
దేశంలో ‘ కుడి ‘ ‘ఎడమ ‘లకు వందేళ్లు! భారతీయ, జాతీయ భావజాలంతో వచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు ఈ ఏడాదిలోనే శత వసంతాలు పూర్తవుతుండగా, భారత కమ్యూనిస్టు పార్టీ కి కూడా ఇదే ఏడాది నూరేళ్ళు నిండుతున్నాయి. ఆర్ఎస్ఎస్ మహారాష్ట్రలోని నాగపూర్ లో 1925 సెప్టెంబర్ 27న విజయదశమినాడు ఆవిర్భవిస్తే, సీపీఐ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో 1925 డిసెంబర్ 26న ఏర్పడ్డది. ఈ వందేళ్ల ప్రస్థానంలో భారత కమ్యూనిస్టులు ప్రస్తుతం తిరోగమనంలో ఉంటే, సంఘ్ పరివార్ కన్నుసన్నల్లో పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ పురోగమనంలో ఉంది. విచిత్రంగా, ఈ రెండు పరస్పర విభిన్న, విరుద్ధ భావజాలాలు తెలంగాణ నేలపై గంగా జామునా తెహజీబ్ లాగా జమిలిగా సాగాయి. దేశ స్వాతంత్ర్యోద్యమానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ ది శతాధిక (140 ఏళ్ళ) చరిత్ర. తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన బిఆర్ఎస్ పార్టీది 24 ఏళ్ళ ప్రస్థానం. ఈ పార్టీలు త్యాగాల పునాదులపైనే ఏర్పడ్డాయి. ప్రస్థానం సాగిస్తున్నాయి. ఇది గత చరిత్ర. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అప్రతిహతంగా విజయవంతంగా విస్తరిస్తున్న బీజేపీ, తెలంగాణలో అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారుతోందా? పదేళ్ళ పాలన తర్వాత ప్రజా తిరస్కారానికి గురైన గులాబీ గుభాళింపు ఇక గత వైభవమే అవుతుందా? కాంగ్రెస్ కంచుకోటలో కాషాయ విజయం తథ్యమేనా? ఎర్ర పూల నేలలో కమల వికాసం సాధ్యమేనా?
తెలంగాణ చరిత్రంతా ఎన్నో తిరుగుబాట్లు, ఉద్యమాలు, విప్లవోద్యమాలు, బలిదానాలు, త్యాగాలు, ఆత్మార్పణలు. అసలు తెలంగాణే త్యాగాల పునాదుల మీద నిర్మితమైంది. ముందు, స్వాతంత్ర్యానంతర తెలంగాణ ఆధునిక చరిత్ర అంతా రక్త చరిత్రే. స్వాతంత్ర్యోద్యమం, గోండుల తిరుగుబాటు, భాషోద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం, విలీన వ్యతిరేక ఉద్యమాలు, కమ్యూనిస్టుల ఉద్యమాలు, పీపుల్స్ వార్, మావోయిస్టు విప్లవోద్యమాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, సామాజిక, ఆర్థిక, ప్రాంత అస్తిత్వ, ఆత్మగౌరవం వంటి అనేక ఉద్యమాలు జరిగాయి. ఈ అనేక ఉద్యమాలు ఎక్కువగా ఎర్ర జెండాల కిందే జరిగాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలోనే మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులే దేశంలో రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించారు. నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన కమ్యూనిస్టు రావి నారాయణరెడ్డి నెహ్రూ కంటే అధికంగా ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. నిజానికి తెలంగాణ నెల ‘ కుడి ‘ ‘ ఎడమ ‘ల అనేక ఉద్యమాల అమరుల రక్తంతో తడిసిన నేల. ఎర్ర పూలు పూసిన నేల. ఇలాంటి ఎడారి నేలలో… కొలనులో మాత్రమే పూసే కమల వికాసం సాధ్యమేనా?
స్వాతంత్ర్యానంతరం దాదాపు 40 ఏండ్లపాటు అప్రతిహతంగా అధికారం నెరపిన కాంగ్రెస్ కంచుకోటను తెలుగు ఆత్మగౌరవం పేరుతో టీడీపీ కదిలించింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్, అనంతరం గులాబీ జెండా ఎగిరింది. అయితే, ఇప్పడు ‘గులాబీ’ని గుద్ది, ‘చేయి’ పై చేయి సాధించింది. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణలో మూడో అతి పెద్ద పార్టీగా ఉంది. కేంద్రంలో వరసగా మూడోసారి విజయం సాధించిన బీజేపీ, 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. 27 ఏళ్ళుగా ఊరిస్తున్న ఢిల్లీ పీఠంపై తాజాగా అధిష్టించింది. ఢిల్లీ విజయం బీజేపీని ఉరుకలెత్తిస్తున్నది. ఏపీ లో టీడీపీ, జనసేన తో సంకీర్ణంలో ఉంది. ఇక దేశంలో బీజేపీకి వశం కావాల్సిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే!
ఇప్పటి వరకు అసలు అధికారమే చేపట్టని రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే. అసలు సాధ్యం కాదనుకున్న త్రిపుర, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ, కమ్యూనిస్టుల కంచుకోట, మమతకి పెట్టని కోట పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష హోదాలో ఉంది. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ గా ఇప్పడు ఉంది బెంగాలే. ఆ తర్వాత రాష్ట్రాలు కచ్చితంగా కేరళ, తమిళనాడు, తెలంగాణే. అయితే కేరళలో కమ్యూనిస్టు కూటమి బలంగా ఉంది. హిందీ వ్యతిరేకతతో ఉండే తమిళనాడులో కొద్దోగొప్పో సీట్లు సాధించినా, ఇప్పట్లో అక్కడ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. మరికొంత సమయం పట్టొచ్చు. ఇక ఏ రకంగా చూసినా బీజేపీ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ ఇప్పుడు బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. తెలంగాణ తెచ్చామన్న బిఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. కమ్యూనిస్టులు కనుచూపు మేరలో లేరు. మావోయిస్టులను ప్రజలు మరచిపోతున్నారు. టీడీపీ ఉందో లేదో అన్నట్లుగా ఉంది. ఎం ఐ ఎం హైదరాబాద్ పాత నగరానికే పరిమితమైంది. తెలంగాణ ఇచ్చామన్న కాంగ్రెస్ పై అప్పుడే వ్యతిరేకత ప్రారంభమవడంతో బీజేపీ ఇక్కడ తమ దృష్టిని కేంద్రీకరించింది. అసలు 2023 ఎన్నికలే టార్గెట్ గా పని చేసినప్పటికీ, బీజేపీకి సరైన నాయకత్వం అందిరాలేదు. ఉన్న నాయకత్వం సరిపోలేదు. పార్టీని స్థాగతంగా పటిష్టం చేస్తూనే, ఇప్పుడా నాయత్వంపైనే బీజేపీ వర్క్ అవుట్ చేస్తున్నది.

