బస్సు, లారీ ఢీ – పాన్ షాప్ లోకి దూసుకుపోయిన లారీ
పలువురికి గాయాలు – స్పందించిన ఎమ్మెల్యే
మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశం
జనగామ జిల్లా, పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఢీ కొనడం, లారీ ఆ రోడ్డు మీద ఉన్న పాన్ షాప్ లోకి చొచ్చుకుపోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి క్షతగాత్రులకు తగిన మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
తొర్రూరు నుండి జగద్గిరిగుట్ట వెళ్లే బస్సు, తిరుమలగిరి నుండి స్టేషన్ ఘనపూర్ కు భారీ లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొన్నాయి. ఢీ కొన్న లారీ చౌరస్తాలో గల ఒక పాన్ షాప్ లోకి చొచ్చుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలవగా, వారిని వెంటనే పాలకుర్తి దవాఖానకు తరలించారు. అందులో ఒక్కరు సీరియస్ గా వున్నట్లు సమాచారం. సీరియస్ గా వున్న వ్యక్తిని జనగామ జిల్లా దవాఖానకు తరలించారు. సంఘటన స్థలానికి పాలకుర్తి ఎస్ ఐ దూలం పవన్ కుమార్ తన సిబ్బంది తో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

స్పందించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి స్పందించి ఫోన్ ద్వారా పోలీసులు, వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలించి మంచి వైద్యం అందించాలని, డాక్టర్లను ఆదేశించారు. క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున కావాల్సిన సహాయం అందజేస్తామని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, ఆ సమయంలో చౌరస్తాలో పెద్దగా జనం లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని, లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

