చేతిలో చెయ్యేసి గుట్టుగా గు‘లాబీలు!?’
కోర్టుల కేసులతో కోవర్టు రాజకీయాలు!?
బిఆర్ఎస్ తో ‘టచ్’ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు!?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిరాయింపులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్ర, దేశ అత్యున్నత న్యాయస్థానాల తీర్పులు.. ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలను, ఫిరాయింపుదారులను, చట్ట సభలను, ప్రభుత్వాన్ని షాక్ కు గురి చేశాయి. సంకటంలో పడేశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితిలో…అయోమయంలోఅటు ఇటు ఎటైనా సరే, ఫిరాయింపుదారులు మాత్రం చేతిలో చేయి ఉండగానే, గుట్టుగా గు‘లాబీయింగ్’ చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోనే కలిసి ఉన్నారా? లేక సొంతగూటితో గుట్టుగా అంటకాగుతున్నారా? లేక ఎటూ తేలక, తేల్చుకోలేక అయోమయంలో పడ్డారా? పార్టీ ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో కలిసి వస్తే కాంగ్రెస్ తో… కాదంటే గులాబీ గూటితో అన్న చందంగా గో.పి.ల్లా అదే గోడ మీద పిల్లుల్లా కాచుక్కూచున్నారా? తాజా పరిణామాలు మాత్రం అవకాశవాదంగా ఎదురుచూస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. అటు, ఇటు ఎటైనా సరే సిద్ధంగా ఉండే విధంగా పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఒకవైపు అంతర్గతంగా ఆ పది మంది సమాచాలోచనలు చేస్తూనే, మరోవైపు న్యాయనిపుణులు, పార్టీల నేతలతో, అత్యంత సన్నిహితులు, అనుచరులతో, తమ రాజకీయ భవితవ్యంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. తిరిగి సొంత గూటికి వెళితే? ఈ సమస్య సద్దుమనుగుతుందా? మారిన పార్టీతోనే ఉంటే ఫలితం ఏంటి? అనర్హత వేటా? రాజీలా? రాజీనామాలా? ఉప ఎన్నికలా? అన్న మీమాంసలో వారున్నారు.
ఇదే తరుణంలో వారు అటు, ఇటుగా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇందుకు తొలి ముఖ్యమంత్రికి తలలోనాలుకలా అత్యంత సన్నిహితుడైన ఓ నేత ఇరువైపులా శల్యసారథ్యం వహిస్తున్నట్లుగా సమాచారం. ఆ పది మందిని ఒక్కటి చేసి, కుల్లుగుత్తగా తిరిగి సొంత పార్టీలో కలపేందుకు చెవిలో జోరీగై గులాబీ బాస్ ని ఒప్పించడానికి తెగ పోరాటం చేస్తున్నట్లు ఫిరాయింపుదారులే అన్యాపదేశంగా చెప్పుకుంటున్నారు. అయితే, పోతే పోయినట్లే…తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని బాస్ తెగేసినట్లు ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇటువైపు ఈ వ్యవహారం బెడిసి కొట్టడంతో, అటువైపు నుంచి నరుక్కురావడానికి ప్రయత్నించాడట ఆ నేత. కాంగ్రెస్ తో తన పలుకుబడిని పెంచుకోవడానికి ఆ పది మంది తనకు టచ్ లో ఉన్నారని, అటుగా బేరం పెట్టారని భోగట్టా. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి కి నేరుగానే తెలిసిందని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే ఎటూ తేలని ఈ పరిస్థితులు తమను ముంచుతాయా? తేలుస్తాయా? అన్న మీమాంసలో ఆ పది మంది ఎమ్మెల్యేలు కొట్టు మిట్టాడుతున్నారట.

