తక్షణమే తప్పులు సరిదిద్దాలి
-కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణలో జరుగుతున్న కుల గణన సర్వేపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ జనాభా 4.3 కోట్లకు పైగా ఉండగా, 3.95 కోట్ల మంది ఆధార్ కార్డుదారులు, 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 1 నుండి 12 తరగతుల వరకు 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, స్కూలుకు వెళ్లని చిన్నారులను కలుపుకుంటే మరో 30 లక్షల మంది ఉంటారని తెలిపారు. అయితే, కుల గణనలో 60 లక్షల మందికి పైగా ప్రజలను లెక్కించలేదని, ఇది తప్పిదంతో కూడిన బోగస్ సర్వే అని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ, మళ్లీ ఇంటింటికీ రీసర్వే చేయాలని, గ్రామ సభల ఆమోదం తీసుకోవాలని సూచించారు. బీసీలలో ముస్లింలను చేర్చే చర్యలను తాము అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదని, బీసీ ఓటర్ల సంఖ్యను తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కుల గణనపై కాంగ్రెస్ పార్టీలోనే విభేధాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే తప్పిదాలను సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.

