ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) బస్సు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.9 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. 2009 జూన్ 13న, లక్ష్మి నాగళ్ల అనే మహిళ తన భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమండ్రికి ప్రయాణిస్తున్న సమయంలో, ఎదురుగా వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనకు సంబంధించి లక్ష్మి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ ప్రమాదాల కేసుల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. 2014లో ట్రైబ్యునల్, బాధిత కుటుంబానికి రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీకి ఆదేశించింది. అయితే, ఆర్టీసీ ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు విచారణ అనంతరం పరిహారాన్ని రూ.5.75 కోట్లకు తగ్గించింది. ఈ తీర్పును చెల్లించకుండా, లక్ష్మి భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ.9.64 కోట్ల పరిహారం చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీకి ఆదేశాలు జారీచేసింది. శ్యాంప్రసాద్ కోర్టు ముందు తన వాదనలు వినిపిస్తూ, భార్య అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేసేవారని, ఆమె జీవించి ఉంటే నెలకు 11,600 డాలర్లు సంపాదించేవారని తెలిపారు. భార్య మృతితో కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని వివరించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సవరించి రూ.9.64 కోట్ల పరిహారం మంజూరు చేస్తూ తక్షణ చెల్లింపుకు ఆర్టీసీని ఆదేశించింది.

